Begin typing your search above and press return to search.

పిల్లి ఇళ్లు మార్చినట్లు.. పార్టీలు మార్చుడేంది పవనా?

By:  Tupaki Desk   |   16 Jan 2020 6:35 AM GMT
పిల్లి ఇళ్లు మార్చినట్లు.. పార్టీలు మార్చుడేంది పవనా?
X
పిల్లికి పవన్ కు పోలిక పెడితే ఆయన్ను విపరీతంగా అభిమానించే వారు.. పిచ్చిగా ప్రేమించే వారికి విపరీతమైన కోపం రావొచ్చు. రాజకీయాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ఆయన ఫాలోయర్స్ లోని కొందరే తప్పు పడుతున్న వేళ.. నిజం కాస్తంత నిష్ఠూరంగా ఉన్న చెప్పక తప్పదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ నిజాయితీని ఎవరూ తప్పు పట్టరు. సామాజిక అంశాల మీద.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆయనకు అవగాహన కంటే కూడా.. అయ్యో.. ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారన్న వేదనే ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. మిగిలిన రాజకీయ అధినేతలతో పోలిస్తే..నిజాయితీ పాళ్లు ఎక్కువే.

భావోద్వేగమే తప్పించి.. వ్యూహాత్మకంగా రాజకీయాల్ని ఎలా చేయాలో తెలీని వ్యక్తిగా చెప్పక తప్పదు. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలి. అలా అని కుళ్లిన రాజకీయాల్లోకి వచ్చి ఆయన్ను చెడిపోమ్మనటం లేదు. తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచిగా తీసుకోవటమే కాదు.. తొందరపాటు పనికి రాదు. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టటంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. తన తొలిదశలో ఎన్నికల్లో నిలుచున్నది లేదు.

అన్న గెలుపు మీద భారీ ధీమాతో ఉన్న ఆయనకు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఓటుతో ఇచ్చిన తీర్పు భారీ షాక్ గా మారటమే కాదు.. కొన్నేళ్లు రాజకీయాల వైపు ఆయన చూడకుండా చేసింది. రాష్ట్ర విభజన వేళలో మళ్లీ ఆయన తెర మీదకు వచ్చారు. ఈ సారి సొంత పార్టీ జనసేనను ప్రకటించారు. మళ్లీ కామ్ అయిపోయారు. కొద్ది నెలల తర్వాత ఎన్నికల వేళలో బీజేపీ.. టీడీపీలకు తాము మద్దతు ఇస్తామని.. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పత్తా లేకుండా పోయిన ఆయన.. కొన్ని సందర్భాల్లో తెర మీదకు వచ్చి కాస్త హడావుడి చేశారే తప్పించి.. బాబు చేస్తున్న తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు.

అదే సమయంలో బాబుకు పవన్ పూర్తిగా మద్దతు ఇచ్చింది కూడా లేదు. బాబు పనుల్ని.. ప్రత్యేక హోదా విషయంలో మోడీ తీరును తప్పు పట్టిన ఆయన.. ఆ రెండు పార్టీలకు దూరం జరిగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేనకు ఏపీ ప్రజలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాన్ని ఇచ్చారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే మినహా మరెవరూ గెలవలేదు. చివరకు పవన్ సైతం తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడారు. గతానికి భిన్నంగా ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి.. ఆ ప్రభుత్వాన్ని ఏదోలా విమర్శిస్తున్న ఆయన.. ఇప్పుడు బీజేపీతో కలిసిపోవటానికి సిద్ధమవుతున్నారు. జగన్ ను రాజకీయంగా దెబ్బ తీయటం కోసం ఇప్పుడు కమలనాథులతో కలిసిపోతున్న సంకేతాల్ని ఇచ్చిన వైనం చూస్తే.. పిల్లి ఇళ్లను మార్చిన వైనం గుర్తుకు రాక మానదు. పిల్లల క్షేమం కోసం పిల్లి ఇళ్లు మారుసతూ ఉంటుంది. మరి.. ఎవరి క్షేమం కోసం పవన్ తరచూ పార్టీలతో ఫ్రెండ్ షిప్ మార్చేస్తుంటారు? అన్నది ప్రశ్న. దానికి ఆయన క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో?