Begin typing your search above and press return to search.

పాతోళ్ల‌ను తీసుకోక‌పోతే పార్టీ మ‌టాష్ - ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   9 Jan 2019 4:04 AM GMT
పాతోళ్ల‌ను తీసుకోక‌పోతే పార్టీ మ‌టాష్ - ప‌వ‌న్‌
X
ప‌వ‌న్ స్వ‌రం మారింది. త‌న ప్ర‌మేయం లేకుండానే రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు ఆయ‌న నెలవు అవుతున్నారు. తాను మాట్లాడిన అంశాల‌పైనే తాను విభేదిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయాలు చెద‌లు ప‌ట్టి పోయాయ‌ని - ఈ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తానంటూ రంగంలోకి దిగేసిన ఆయ‌న‌... త‌న పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేవారంతా కొత్త వారేన‌ని - యువ‌రక్తంతో ఉర‌క‌లెత్తే యువ‌కులేన‌ని, అస‌లు ఇప్ప‌టిదాకా రాజ‌కీయ వాస‌న‌లు లేని వారినే పార్టీలోకి తీసుకుంటాన‌ని - త‌ద్వారా రాజ‌కీయాల్లో కొత్త అధ్యాయం లిఖిస్తాన‌ని తొలినాళ్ల‌లో చాలా గొప్ప‌గా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ఇదంతా ఎప్ప‌టి మాట‌... 2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన పేరిట కొత్త రాజ‌కీయ పార్టీ పెట్టిన‌ప్పుడు ప‌వ‌న్ నోట నుంచి వెలువ‌డిన మాట‌లు. ఇవే మాట‌ల‌ను ఆ త‌ర్వాత కూడా కొన‌సాగించిన ప‌వ‌న్‌... యువ‌త‌లో ప్ర‌త్యేకించి త‌న ఫ్యాన్స్‌ లో ఓ మేర ఉత్సాహాన్ని అయితే నింపార‌నే చెప్పాలి. అయితే త‌న ఫ్యాన్స్ మిన‌హా మిగిలిన వారు పెద్ద‌గా ప‌వ‌న్ మాట‌ల‌ను ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి.

అయినా ప‌వ‌న్ త‌న మాట‌పై తాను నిల‌బ‌డిన‌ప్పుడు చూద్దాంలే అన్న రీతిలో రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా ఆయ‌న మాట‌ల‌ను పెద్ద‌గా పట్టించుకోలేదు. అయితే ప‌వ‌న్ ఈ విశ్లేష‌ణ‌లకు బ‌లం చేకూరుస్తూ.. ఇప్పుడు స‌రికొత్త మాట‌ను చెప్పేశారు. గ‌డ‌చిన రెండు - మూడు రోజులుగా జిల్లాల కార్య‌క‌ర్త‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్న ప‌వ‌న్‌.... నేడు క‌ర్నూలు జిల్లా పార్టీ శ్రేణుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని అన్ని సీట్ల నుంచి పోటీ చేస్తామ‌ని చెబుతూనే... ఎన్నిక‌ల్లో సీట్ల‌న్నీ కూడా కొత్త వారికి మాత్ర‌మే కేటాయించే ఛాన్సే లేద‌ని తేల్చేశారు. రాజ‌కీయాల్లో యువ‌త స్థిర చిత్తంతో వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సూత్రీక‌రించిన ఆయ‌న... యువ‌కులు త‌మ‌లో ఉన్న క‌సికి అనుగుణంగా ప‌నిచేసే వారు చాలా త‌క్కువ‌గా ఉంటార‌ని కూడా ఆసక్తిక‌ర కామెంట్ చేశారు. పార్టీలో పాత‌వాళ్లను (అంటే ఇత‌ర పార్టీల్లో సీనియ‌ర్ నేత‌లను) చేర్చుకోక‌పోతే పార్టీ అనుభ‌వ రాహిత్యంతో ఇబ్బందులు ప‌డుతుంద‌న్నారు. కొత్త‌వాళ్లు మాత్ర‌మే ఉంటే పార్టీ నిల‌బ‌డ‌దు అన్నారు. కాబట్టి పార్టీకి సీనియర్లు కూడా కావాలని స్ప‌స్టంగా చెప్పేశారు. కొత్తవారితో కసి ఉంటుందని - రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌నికిరార‌ని చెప్పారు. మనం ఏదో చేస్తామని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని - అలాంట‌పుడు అనుభ‌వ‌జ్ఞులు లేక‌పోతే ఎలా అన్న‌ట్టు అన్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొన్ని సీట్ల‌ను కొత్త‌వారికి కేటాయించ‌డంతో పాటుగా మ‌రికొన్ని స్థానాల‌ను ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో ఉంటూ... పార్టీలోకి చేరుతున్న సీనియ‌ర్ల‌కు ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఫ‌లితంగా ఉర‌క‌లేసే ఉత్సాహానికి - అనుభ‌వంతో కూడిన సీనియారిటీని జోడిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక ఏ కోటాకు ఎన్ని సీట్లు ఇస్తామ‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌... 60 శాతం సీట్ల‌ను కొత్త వారికి కేటాయిస్తామ‌ని చెప్పారు. మిగిలిన 40 శాతం సీట్ల‌లో ఓ 20 శాతాన్ని భావ‌జాలం ఉన్న వారికి - మ‌రో 20 శాతాన్ని విలువ‌లు క‌లిగిన వారికి కేటాయిస్తామ‌ని ఆయ‌న తేల్చేశారు. మొత్తంగా ఈ ఒక్క ప్ర‌క‌ట‌న‌తో ప‌వ‌న్ త‌న మాట‌ను తానే మార్చేశార‌ని చెప్పాలి. అంటే... వ‌చ్చే ఎన్నికల్లో జ‌న‌సేన నుంచి పోటీ చేసే జాబితా ఒక్క కొత్త‌ వారితోనే కాకుండా భావ‌జాలం ఉన్న‌వారు - విలువ‌లు క‌లిగిన వారితో ఓ కంగాళీ కంగాళీగా ఉండ‌బోతుంద‌న్న మాట‌.