Begin typing your search above and press return to search.

పవన్ ను ఆపిన శక్తి ఏంటి?

By:  Tupaki Desk   |   16 May 2015 5:57 AM GMT
పవన్ ను ఆపిన శక్తి ఏంటి?
X

తెలుగు రాష్ర్టాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రజా సమస్య లేదా ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయం వచ్చిన వెంటనే వినిపంచే పదం పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారం సమయంతో పాటు ఆ తర్వాత కూడా తాను ప్రజల పక్షం అని పవన్ ప్రకటించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తానని చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇపుడెక్కడ? అనే చర్చ సాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మిస్తామని, అందుకు రైతుల అంగీకారంతో భూముల స్వీకరించడమే కాకుండా వారికి అత్యున్నత ప్యాకేజీ అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించి భూ సమీకరణ ప్రారంభించారు. అయితే...ఏపీ సీఎం చెబుతున్నదానికి వాస్తవ పరిస్థితికి పొంతన కనిపించక పోవడంతో మూడు పంటలు పండే రైతులు తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. నిరసనలు భగ్గుమన్నాయి.

ఈ నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం పర్యటించిన పవన్ కళ్యాణ్ వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే సహించేది లేదని హెచ్చరించారు. అన్నదాతల కన్నీటిపై రాజధానిని నిర్మిస్తే చూస్తూ ఊరుకోబోనని వార్నింగ్‌ ఇచ్చారు. రైతుల పక్షాన పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు.రైతులు తెచ్చిన భోజనం చేసిన పవన్‌ దేశానికి అన్నం పెడుతున్న కర్షకులను కష్టపెడితే పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. పచ్చని పంటలు పండే పొలాలను రాజధాని పేరుతో సేకరించడాన్ని తప్పుపట్టారు పవర్‌స్టార్. రైతులు చేయబోయే ఉద్యమానికి తాను ముందుంటానని హామీ ఇచ్చారు.

అయితే పవన్‌ ప్రకటనపై చంద్రబాబు గట్టిగా రియాక్టయ్యారు. తాము చేపడుతున్నది భూసమీకరణే గానీ.. సేకరణ కాదన్నారు.. పవన్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాము రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటున్నామన్నారు బాబు. పవన్‌ సపోర్ట్‌తో భూములు కోల్పోవాల్సిన పరిస్థితులు తప్పనున్నాయని రైతులు సంతోషపడ్డారు. అనంతరం పవన్ మాట్లాడుతూ..రైతులు ఇష్టప్రకారం భూమలిస్తే తనకేమీ అభ్యంతరం లేదన్నారు. బలవంతపు భూసేకరణకే తాను వ్యతిరేకమని వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తూనే రైతులకు అండగా ఉండే విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. భూసేకరణ చేపడితే పోరాడతానన్న మాటకు కట్టుబడి ఉంటానన్నారు పవన్‌.

అయితే అన్యాయం జరుగుతున్న రైతులు హైకోర్టులో న్యాయపోరాటానికి దిగగా 300 మంది రైతులకు అనుకూలంగా కోర్టు ఆదేశాలిచ్చింది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని స్పష్టం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు భూసమీకరణ మంత్రం జపించిన ఏపీ ప్రభుత్వం భూసేకరణ అస్త్రాన్ని బయటకు తీసింది. రైతులను బెదిరించైనా భూములను లాక్కునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం తాజాగా జీవో నంబరు 166తో ఆర్డినెన్స్ సైతం జారీ చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాతిధికార సంస్థ (సీఆర్‌డీఏ) సేకరించని భూములను దీని ద్వారా సమీకరిస్తారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్‌ నెలలో రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు తేదీలు కూడా ప్రకటించేశారు.

భూ సేకరణ చేస్తే ప్రజల తరఫు పోరాటం చేస్తానన్న పవన్ ఇపుడు ఎక్కడ? భూ సేకరణ కోసం ఆర్డినెన్స్ జారీచేసినా స్పందించలేనంత బిజీలో ఉన్నారా? లేక మనకెందుకులే అని ఊరుకుంటున్నారా? ఇది సర్వత్రా రేకెత్తుతున్న సందేహం.

-గరుడ