Begin typing your search above and press return to search.

రాహుల్ ను పవన్ టార్గెట్ చేశారా?

By:  Tupaki Desk   |   2 Feb 2016 4:51 AM GMT
రాహుల్ ను పవన్ టార్గెట్ చేశారా?
X
కాపు ఐక్య గర్జన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్ట్ కావటం తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడేందుకు కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన పవన్.. ఒక అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేయటం గమనార్హం.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై స్పందించి.. ఇప్పటికి రెండుసార్లు రాహుల్ హైదరాబాద్ కు రావటం తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య మీద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు గా నిలవటంతో పాటు.. కేంద్ర సర్కారుపై దునుమాడిన వైనం తెలిసిందే.

ఒక విద్యార్థి ఆత్మహత్యపై కాంగ్రెస్ యువరాజు లాంటి వ్యక్తి అంతలా రియాక్ట్ కావటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. అయితే.. ఈ ఉదంతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని రాజకీయంగా దెబ్బ తీసే అవకాశం ఉండటం.. తన సొంత నియోజకవర్గమైన అమేధీలో ఆమె చేస్తున్న హడావుడికి చెక్ పెట్టే పనిలో భాగంగా రాహుల్ ఇంతలా రియాక్ట్ అవుతున్నారన్న విమర్శలు వినిపించాయి.

ఇదిలా ఉంటే.. తుని ఇష్యూ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై రియాక్ట్ అయ్యారు. ఈ అంశం మీద మాట్లాడుతూ.. రోహిత్ లాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటంపై ఆవేదనను వ్యక్తం చేసిన పవన్.. వర్సిటీలో కులరాజకీయాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయన్న విషయాన్ని చెప్పేశారు.

పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్లు.. క్యాస్ట్ టూర్లకు తీసుకెళుతన్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. రోహిత్ ఇష్యూపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి తాను రాజకీయాలు చేయదలుచుకోలేనని తేల్చి చెప్పారు. యూనివర్సిటీలో కుల రాజకీయాలు రెండు.. మూడేళ్ల కాలంలో పుట్టవని.. ఎన్నో ఏళ్లుగా ఉన్నాయన్న విషయాన్ని తేల్చారు. రోహిత్ ఇష్యూలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లటం లేదని చెప్పటం ద్వారా.. వర్సిటీ రాజకీయాల పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు.

రోహిత్ ఇష్యూ వర్సిటీ స్థాయి వ్యవహారంగా తన మాటలతో చెప్పేసిన పవన్... రాహుల్ లాంటి జాతీయ నేత ఇలాంటి విషయం మీదన అవసరానికి మించిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించాన్న విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లైంది. కుల రాజకీయాలు రెండు మూడేళ్ల నుంచి మొదలు కావని చెప్పటం ద్వారా.. ఇలాంటి ఉదంతాల్లో గత ప్రభుత్వాల పాత్రను పవన్ చెప్పకనే చెప్పినట్లైందని చెప్పాలి.