Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స్టేట్‌ మెంట్ఃప్ర‌త్యేక హోదాను మ‌ర్చిపోలేదు

By:  Tupaki Desk   |   10 April 2016 6:51 PM GMT
ప‌వ‌న్ స్టేట్‌ మెంట్ఃప్ర‌త్యేక హోదాను మ‌ర్చిపోలేదు
X
స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా విడుద‌ల అనంత‌రం మీడియాతో తొలిసారిగా ముచ్చ‌టించిన జ‌న‌సేన అధినేత‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ త‌నలోని పొలిటీషియ‌న్‌ని, ప‌వ‌ర్‌స్టార్‌ను ఏక‌కాలంలో ఆవిష్క‌రించారు. త‌న ప్ర‌స్తుత చిత్రం స‌ర్దార్ నుంచి మొద‌లుకొని త‌న రాబోయే చిత్రాలు, రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై క్లారిటీ ఇచ్చారు.

అభిమానులు త‌న అన్నయ్య చిరంజీవితో పోల్చి అంచనాలు పెంచుకుంటారని పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అంచనాలు పెంచుకుంటూ పోతే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. నా స్టైల్‌లో నేను పని చేసుకుంటూ వెళ్తున్నానని తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయడానికే తాను సినిమాల్లోకి వచ్చానని, త‌న పని తాను చేస్తాన‌ని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. ఖుషీ తర్వాత రతన్‌పూర్‌ స్టోరీ ఆలోచన వచ్చిందన్నారు. సామాజిక అవగాహనపై సినిమా చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. సినిమాల్లో మూస ధోరణి అసలు నచ్చదన్నారు. ద‌ర్శ‌క‌కత్వంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని పవర్‌ స్టార్‌ స్పష్టం చేశారు. త‌న‌కున్న అనుభవంతో దర్శకత్వంలో సలహాలు మాత్రమే ఇస్తానని అన్నారు. మరో రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తానని, త్రివిక్రమ్‌, ఎస్‌జె.సూర్య దర్శకత్వంలో నటిస్తానని తెలిపారు. తెలుగులో తమిళ సినిమా మార్కెట్‌ పెరిగిందని, తెలుగు సినిమా తమిళంలోకి వెళ్లడానికి భయపడుతుందన్నారు. తాను దెబ్బతిన్నా ప్రయోగాలు చేయడానికి వెనుకాడనని చెప్పారు. ప్రత్యేకమైన మేనరిజం అంటే ఇష్టం ఉండదని, ఒక్కరోజు కూడా తాను స్టార్‌ డమ్‌ను అనుభవించాలనుకోలేదని చెప్పారు. తన దగ్గర డబ్బులు లేవని, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, నెల గడవడానికే కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. సాంస్కృతికపరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ కలవలేవని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తన సినిమాల్లో తెలంగాణ భాష, సంస్కృతికి సముచిత స్థానం కల్పించానని అన్నారు.

రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావిస్తూ అన్నయ్యతో రాజకీయంగా అభిప్రాయ బేధాలున్నాయని పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. అయితే కుటుంబపరంగా మాత్రం ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. అన్నయ్య పూర్తి కాంగ్రెస్‌ వాది అని అన్నారు. పార్టీలు మారాలంటే బలమైన కారణాలుండాలని అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు కొన్ని పరిమితులు ఉండేవన్నారు. జనసేనలో నేను ఏం మాట్లాడినా నేనే బాధ్యత వహిస్తానని, అయితే ప్రజారాజ్యంలో నేనేం మాట్లాడినా అన్నయ్య బాధ్యత వహించాల్సి వచ్చేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. టన్నుల కొద్దీ మాటలకన్నా.. ఒక ఔన్స్‌ పనిచేయడం మంచిదన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే కులంతో ముడిపెడతారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయమై తాను మరిచిపోలేదని ప‌వన్ స్ప‌ష్టం చేశారు. ప్రశ్నించేందుకు జనసేన, పోటీ చేసేందుకు 2019 ఎన్నిక‌లు ఉన్నాయ‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని, అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తానని చెప్పారు. రాజకీయాల్లో ఏం చేస్తానో.. చెప్పి చేస్తానని అన్నారు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తే సినిమాలు మానేస్తానని ప్ర‌క‌టించారు. రాజకీయాల్లో తిట్టే వాళ్లను, పొగిడే వాళ్లను భరించాలని చెప్పారు.