Begin typing your search above and press return to search.

వేమన పద్యంతో వైసీపీని వేసుకున్న పవన్

By:  Tupaki Desk   |   10 Nov 2022 9:30 AM GMT
వేమన పద్యంతో వైసీపీని వేసుకున్న పవన్
X
వేమన పద్యాలు ఇప్పటికి ఆరు వందల ఏళ్ల క్రితం నాటివి. కానీ సమాజాన్ని మొత్తం ఆయన చదివి పారేశారు. అంతే కాదు వాటి మీద ఆయన రాసిన పద్యాలు ఈ రోజుకే కాదు ఏ యుగానికైనా సరిపోయే అక్షర సత్యాలు. అందుకే ఒకే ఒక వేమన పద్యంతో వైసీపీని ఈసారి దెబ్బ కొట్టారు పవన్ కళ్యాణ్. తాను పుస్తకాలు లక్ష చదువుకున్నాను అంటే ఎకసెక్కం చేసేవారికి వేమన నీతి పద్యాలను గుర్తు చేశారు.

మొత్తానికి మ్యాటర్ ఏంటి అంటే సీఎం సొంత జిల్లా కడపలో వేమన వర్శిటీని పెట్టారు. అది కూడా వైఎస్సార్ సీఎం గా ఉండగా. ఆయన ఈ వర్శిటీ ముందు వేమన విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. అయితే మరి వైసీపీ ప్రభుత్వానికి సడెన్ గా ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ వేమన పోయే వైఎస్సార్ వచ్చే అన్నట్లుగా మహా తాత్వికుడు సర్వకాల సర్వావస్థలందు జనాలు తలచుకునే వాడు, నీతి పద్యాలు చెప్పి జాతిని మేలుకొలిపేవాడు అయిన వేమన విగ్రహాన్ని తీసేశారు, పక్కన పెట్టేశారు.

దానికి బదులుగా వైఎస్సార్ విగ్రహాన్ని తెచ్చారు. దీని మీద రాయలసీమ విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని కూడా వారు అంటున్నారు. ఇది పెద్ద వివాదంగా కూడా మారుతోంది. తీరుబాటుగా కూర్చుని మరీ ఇలాంటి పని చేయడమేంటి అన్న చర్చ కూడా సాగుతోంది. నిన్నటికి నిన్న విజయవాడలోని ఎంటీయార్ వర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టారు, ఇపుడు చూస్తే వేమన పోయి వైఎస్సార్ ని తెచ్చారు. ఇదేంటి ఈ మితిమీరిన తనం అని జనాలు కూడా మండుతున్నారు.

దాంతో ఆ న్యూస్ ని తన ట్విట్టర్ లో జత చేస్తూ వేమన పద్యాన్ని బహు చక్కగా సందర్భోచితంగా అక్కడ పెట్టి మరీ వైసీపీ సర్కర్ లేకితనాన్ని జనసేనాని ఏకేశారు. ముష్టి చెట్టు అని ఒకటి ఉంటుంది అది పచ్చి విషాన్ని ఇస్తుంది. అలాగే వేప చెట్టు ఆకులు చేదుగా ఉంటాయి. అయితే ఈ రెండూ కూడా తాము ఎంత విషంగా చేదుగా ఉన్నా సమాజానికి ప్రజలకు కూడా ఔషదాల రూపంలో బాగా ఉపయోగపడతాయి.

అదే నీచుడైన వాడు దుష్టుడు మాత్రం సమాజానికి ఎపుడూ ఉపయోగపడడు సరికదా హానికరంగా మారతాడు అని అర్ధంతో వేమన రాసిన పద్యాన్ని ఉంచి మరీ వైసీపీతో చెడుగుడు ఆడేసారు పవన్.

అవును మరి తప్పుల మీద తప్పులు చేస్తూ విపక్షాలకు అవకాశం ఇస్తున్న వైసీపీ పెద్దలు మాటలు అన్న వారి మీద పగ పట్టడం కాకుండా తాము చేస్తున్నది సబబా కాదా అని గుర్తెరిగి తప్పులను దిద్దుకుంటే బాగుంటుంది. కొత్త తప్పులు చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఒక్క వేమన ఏంటి ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎన్నో తాత్విక విషయాలను సమాజానికి బోధించి నీతులు చెప్పిన మహనీయులను అందరికీ కోడ్ చేస్తూ విపక్షాలు విరుచుకుపడతాయి. విస్సన్న చెప్పిందే వేదం కాదు కదా. వేమన్న చెప్పింది కూడా వినాలి కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.