Begin typing your search above and press return to search.

వైసీపీ ఇక‌, ఉండ‌దు.. ఆ పార్టీ లేని రాష్ట్రం చూస్తారు: ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   16 July 2022 3:24 PM GMT
వైసీపీ ఇక‌, ఉండ‌దు.. ఆ పార్టీ లేని రాష్ట్రం చూస్తారు:  ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ అభివృద్ధే జనసేన ధ్యేయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. కోనసీమ జిల్లా మండపేటలో జనసేన రైతు భరోసా యాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పవన్‌ పరామర్శించారు. 60 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వం రూ.7 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ముద్దుల మామయ్యను మళ్లీ ఆదరిస్తారా? అని సీఎ జగన్ ఉద్దేశించి ప్రశ్నించారు. జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం తమకేమీ సరదా కాదని పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా లేరని చెప్పారు. తప్పు జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకుంటే మనుగడ ఉండదని హెచ్చరించారు. తప్పులను ఎత్తిచూసే బాధ్యతను యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తనకు ఆదర్శమని పవన్ కల్యాణ్‌ ప్రకటించారు.

జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులు గ్రామాభివృద్ధికే కేటాయిస్తామని ప్రకటించారు. 2024 ఎన్నికలకు జనసేన సిద్ధం స్పష్టం చేశారు. జనసేన జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అమ్మ, అక్క అంటూ ముద్దులు పెట్టారని, ఇప్పుడు నిండు గర్భిణి అంగన్‌వాడీ కేంద్రం దగ్గర క్యూలో నిలబడాలా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో జనసేన ప్రణాళిక వెల్లడిస్తామని తెలిపారు.

వంద తప్పులను సహిస్తాం, భరిస్తాం.. తర్వాత తాటతీస్తామని హెచ్చరించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ అంధకారం అవుతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గోదావరి వరద బాధితులకు సాయం చేయాలని జనసేన పిలుపునిచ్చింది.

``అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరిస్తాం. అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. గోదావరి వరద బాధితులకు జనసైనికులు సాయం చేయాలి. తెలుగు ప్రజల ఐక్యత కోరుకుంటున్నా. ఏపీ భవిష్యత్తుకు వైసీపీ ప్రభుత్వం హానికరం. వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే ఏం జరుగుతుందో ఊహించాలి. నాకు ఎలాంటి కోరికలు లేవు. అధికారం వస్తే మంచిది.. రాకున్నా పోరాటం ఆపను. వంద తప్పులు సహిస్తాం.. భరిస్తాం.. తర్వాత తాట తీస్తాం. పోలీసులు కూడా వ్యవస్థ ప్రకారం పనిచేయాలి. అన్యాయం, తప్పు చేస్తే ప్రజలు ఎదురుతిరగాలి. ఎంతమందిపై కేసులు పెడతారు.. జైలులో పెడతారు. శ్రీలంక పరిస్థితి చూడండి.. ఏమైందో తెలుస్తోంది.`` అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

``నేను మాటలు నమ్మను.. చేతలనే నమ్ముతాను. పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం నిధులు ఇచ్చిందా ?. ఎన్నికల్లో ఎవరిపక్షం ఉంటారో యువత నిర్ణయించుకోవాలి. వచ్చే ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన జెండా ఎగరడం ఖాయం. ప్రజలు కులాల స్థాయిని దాటి ఆలోచించాలి. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెడితే మెుదట మేమే స్వాగతించాం. పాఠశాలలు విలీనం చేసి దూరం వెళ్లమంటే ఎలా ?. చిన్న పిల్లలు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లగలరా ?.`` అని నిల‌దీశారు.