Begin typing your search above and press return to search.

ఈ ఒక్క రోజు..నిరాహార దీక్ష‌లేంటిరా బాబూ!

By:  Tupaki Desk   |   25 May 2018 9:30 AM GMT
ఈ ఒక్క రోజు..నిరాహార దీక్ష‌లేంటిరా బాబూ!
X
ఏదేనీ ప్ర‌జా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపేందుకు రంగంలోకి దిగే రాజ‌కీయ నేత ఏం చేయాలి? అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాల‌పై పోరాడాలి. స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే దాకా వెన్ను చూప‌కూడ‌దు. వెన్ను చూప‌ని పోరాటానికే ప్ర‌జా మ‌ద్ద‌తు ఉంటుంద‌న్న విష‌యం వేరే చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే... ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆది నుంచి ఒక‌టే స్టాండ్‌ తో ముందుకు సాగుతున్న విప‌క్ష వైసీపీ... హోదా సాధ‌న‌కు అవ‌స‌ర‌మైన, త‌న‌కు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని ర‌కాల పోరాటాలు చేసింద‌నే చెప్పాలి. చివ‌రి అస్త్రంగా ఏకంగా త‌న ఐదుగురు ఎంపీల‌తో వైసీపీ రాజీనామాలు చేయించింది కూడా. ఆ రాజీనామాల‌ను ఆమోదించాల్సిందేన‌ని... సాక్షాత్తు రాజీనామాలు చేసేసిన ఎంపీలే ఇప్పుడు లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ పై ఒత్తిడి కూడా తీసుకువ‌స్తున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మైన త‌మ‌కు ప‌ద‌వులు అంత ముఖ్య‌మేమీ కాద‌ని కూడా వారు ఇప్ప‌టికే సుమిత్రా ముందు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు కూడా.

ఇక ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... విప‌క్ష నేత హోదాలో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం దాదాపుగా అన్ని ర‌కాలైన పోరాటాలు చేశారు. ఇందులో యువ‌భేరీలు - నిరాహార దీక్ష‌లు కూడా ఉన్నాయి. గుంటూరు వేదిక‌గా జ‌గ‌న్ చేప‌ట్టిన నిరాహార దీక్ష‌లు... నిజంగానే వైసీపీలో స‌మ‌రోత్సాహాన్ని నింపాయ‌నే చెప్పాలి. అయితే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న పేరు చెప్పిన చంద్ర‌బాబు స‌ర్కారు... జ‌గ‌న్ దీక్ష‌ను బ‌ల‌వంతంగా భ‌గ్నం చేసింది. బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన తీరుపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్‌... ప్ర‌త్యేక హోదాపై త‌మ పార్టీ పోరాటం ఏమాత్రం ఆగ‌బోద‌ని కూడా నాడే ప్ర‌క‌టించేశారు. అయినా ఇప్పుడు జ‌గ‌న్ పోరాటాన్ని ఇప్పుడు ప్ర‌స్తావించుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ దెబ్బ‌కు యూట‌ర్న్ తీసుకోక త‌ప్ప‌ని టీడీపీ... బీజేపీతో మైత్రికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇవ్వాల్సిందేన‌న్న డిమాండ్ తో సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల పేరిట మొన్నామ‌ధ్య విజ‌య‌వాడ‌లో - ఓ రెండు రోజుల క్రితం విశాఖలో దీక్ష‌లు చేశారు. ఈ రెండు దీక్ష‌లు సింగిల్ డే దీక్ష‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

అయినా ఏదేనీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించాలంటే... అదీ కేంద్రం ప‌రిధిలో ఉన్న అంశంపై ప‌రిష్కారం ల‌భించాలంటే ఒక్క రోజు దీక్ష‌లు స‌రిపోతాయా? అన్నది ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. ఇవేవీ ప‌ట్ట‌ని చంద్ర‌బాబు... సింపుల్ గా ఒక్క‌రోజు నిరాహార దీక్ష‌లు చేసేసి లేచిపోయారు. అయితే స‌మ‌స్య‌కు మాత్రం ప‌రిష్కారం ల‌భించ‌లేదు. అంతేనా... ఈ రెండు దీక్ష‌ల‌కు స‌ర్కారీ ఖ‌జానా నుంచి రూ.60 కోట్ల మేర‌ ప్ర‌జా ధ‌నాన్ని దుబారా చేసేశారు. ఇక ఇప్పుడు జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వంతు వ‌చ్చేసిన‌ట్టుంది. శ్రీ‌కాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. అక్క‌డి స‌మ‌స్య‌పై క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న చేసిన ప‌వ‌న్‌.. ఏపీ స‌ర్కారుతో పాటు కేంద్రంలోనూ క‌ద‌లిక వ‌చ్చేలా చేశార‌ని చెప్పాలి. అయితే ఆ క‌దలిక తాత్కాలిక‌మేన‌ని కూడా ఇప్ప‌టికే తేలిపోయింది.

ఈ నేప‌థ్యంలో శ్రీ‌కాకుళం జిల్లా నుంచే యాత్ర ప్రారంభించిన ప‌వ‌న్‌.. మ‌రోమారు ఉద్ధానం స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించారు. స‌మ‌స్య ప‌రిష్కారానికి చంద్ర‌బాబు స‌ర్కారుకు 48 గంట‌ల గ‌డువు కూడా విధించారు. అయితే మొన్న‌టిదాకా ప‌వ‌న్ ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌ల‌పై వేగంగా స్పందించిన చంద్ర‌బాబు సర్కారు... ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌వ‌న్ అల్టిమేటాన్ని ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ గ‌డువు నేటితో ముగియ‌నుంది. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాని నేప‌థ్యంలో నిరాహార దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా ప‌వ‌న్ శిబిరం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు దీక్ష‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ శ్రీ‌కాకుళం జిల్లా పోలీసు యంత్రాంగానికి జ‌న‌సేన ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌మేంటంటే... ఉద్ధానం స‌మ‌స్య‌పై ప‌వ‌న్ చేసే నిరాహార దీక్ష కూడా ఒక్క‌రోజు దీక్షేన‌ట‌. ఈ ఒక్క రోజు దీక్ష‌తో ప‌వ‌న్‌... చంద్ర‌బాబు స‌ర్కారులో క‌దలిక ఎలా తెస్తార‌న్న ప్ర‌శ్న ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది. అయినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే నేత‌లు, పార్టీలు ఒక్క రోజు దీక్ష‌లంటూ ఈ కొత్త డ్రామాలు ఆడ‌టం ఏమిటో అర్థం కావ‌డం లేద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.