Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో ‘తోక’ముద్ర పోవాలంటున్న పవన్!

By:  Tupaki Desk   |   3 March 2018 5:47 AM GMT
ఈ దెబ్బతో ‘తోక’ముద్ర పోవాలంటున్న పవన్!
X
పవన్ కల్యాణ్ పాపం.. ఎంత కష్టపడి రాజకీయం చేస్తున్నప్పటికీ.. ఆయన జనసేన పార్టీని మాత్రం ప్రజలు తెలుగుదేశానికి తోక పార్టీ అనే ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ఈ ‘తోక’ అనేది పవన్ కల్యాణ్ కు తెలియని సంగతి ఎంత మాత్రమూ కాదు. ఆయన ఎదుటనే రెండు మూడు సందర్భాల్లో విలేకర్లు.... ‘మీరు తెలుగుదేశానికి తోక పార్టీ అని జనం అనుకుంటూ ఉంటారు కదా’ అంటూ అనేశారు కూడా! ఆయా సందర్భాల్లో పవన్ కల్యాణ్ తేలిగ్గా నవ్వేసి.. గతంలో మద్దతు ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తేల్చేశారు గానీ.. ఆయనకు లోలోన ఆ ముద్రను పోగొట్టుకోవాలని మహా పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్రంగా పోటీచేసే ఉద్దేశం పవన్ కల్యాణ్ కు ఎటూ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తెలుగుదేశంతో కలిసి మాత్రమే పోటీచేస్తారనేది తథ్యం. అంతమాత్రాన.. ఇప్పటినుంచి తెలుగుదేశం తోకపార్టీ అనే ముద్రను భరిస్తూ తిరగాల్సిన అవసరం లేదన పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకు ప్రత్యేకహోదా పోరాటం అనే సందర్భాన్ని చాలా చక్కగా వాడుకోవాలనేది ఆయన ప్లాన్.

జెఎఫ్‌ సి పేరుతో చిన్న కసరత్తు చేయించిన పవన్ కల్యాణ్ ఆ కమిటీలోని ప్రతినిధులతో కలిసి ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రధానంగా తెలుగుదేశం వైఫల్యాలను కూడా ఎండగట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

తద్వారా ఇండైరక్టుగా తన మీద ఉన్న తెలుగుదేశం తోక అనే ముద్రను చెరపివేయాలనేది పవన్ ఆరాటం. ముందు ఆ ముద్ర ను చెరిపేసేలా.. తెదేపా విపలమవుతోందంటూ.. కొన్నాళ్లు హడావిడి చేస్తే.. ఆ తర్వాత ఎన్నికల వేళ వచ్చే సమయానికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం.. తెలుగుదేశం తో కలిసే ఎన్నికల బరిలోకి దిగుతున్నాం అని ప్రకటించవచ్చునని, ఈలోగా తోక అనే కీర్తిని సమూలంగా దూరం చేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయినా ‘పుట్టుకతో వచ్చింది పుడకల దాకా పోదనే’ సామెత ఉండనే ఉంది. మరి పవన్- జనసేనకు ‘తోక’ ముద్ర కూడా పుట్టుకతో వచ్చిందే కదా!!