Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఒంట‌రిగానే!

By:  Tupaki Desk   |   23 Oct 2021 4:30 AM GMT
ప‌వ‌న్ ఒంట‌రిగానే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023లో జ‌రిగే ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ వ్యూహం మార్చారా? పొత్తుల‌కు స్వ‌స్థి ప‌లికి మ‌రోసారి ఒంటరిగానే పోటీ చేయ‌నున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఆయ‌న ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రోసారి సోలోగానే పార్టీని బ‌రిలో దింపి రాజ‌కీయ ర‌ణరంగంలో విజ‌యం కోసం పోరాడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష పోటీకి దూరంగా ఉన్న ప‌వ‌న్‌.. అప్పుడు టీడీపీ బీజేపీ కూట‌మిగా మ‌ద్ద‌తునిచ్చారు. ఇటు రాష్ట్రంలో టీడీపీ.. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత టీడీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు జ‌న‌సేన మెడ‌కు చుట్టుకున్నాయ‌నే అభిప్రాయాలున్నాయి. మ‌రోవైపు రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ప‌ట్టించుకోలేదు. దీంతో ఈ రెండు పార్టీల పొత్తుకు గుడ్‌బై చెప్పిన ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో బీఎస్పీ వామ‌ప‌క్షాల‌తో క‌లిసి బ‌రిలో దిగారు. పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ మిగ‌తా పార్టీల ప్ర‌భావం అంతంత మాత్ర‌మే కాబ‌ట్టి జ‌న‌సేన ఒంట‌రిగానే పోటీ చేసింద‌ని చెప్పుకోవాలి. కానీ ఆ ఎన్నిక‌ల్లో జ‌నసేన‌కు దారుణ‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. కేవ‌లం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్ర‌మే గెలుచుకోగ‌లిగింది. ప‌వ‌న్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన ప‌వ‌న్ మ‌రోసారి బీజేపీతో జ‌ట్టు క‌ట్టారు. ఇప్పుడా పొత్తు కొన‌సాగుతోంది. కానీ గ‌త కొంత‌కాలంగా బీజేపీతో బంధం తెంచుకునేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీతో పొత్తుతో త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజనం క‌ల‌గ‌డం లేద‌నే భావ‌న జ‌న‌సేన పార్టీలో ఉంది. అందుకే ఈ పొత్తుకు ముగింపు ప‌లికేందుకు ప‌వ‌న్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా సాగుతున్న కేంద్రం నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించారు. అంతే కాకుండా బీజేపీతో సంప్ర‌దించ‌కుడానే బ‌ద్వేలు ఉప ఎన్నిక నుంచి త‌ప్పుకున్నారు. ఇప్పుడు ఈ ఎన్నిక బ‌రిలో బీజేపీ ఉన్న‌ప్ప‌టికీ జ‌న‌సేన మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం లేదు.

మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకుంటార‌నే ప్ర‌చారం సాగుతోంది. కానీ అది కూడా కార్య‌రూపం దాల్చేలా క‌నిపించ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఎన్నిక‌లప్ప‌టి నుంచి రాష్ట్రంలో వచ్చిన సామాజిక వర్గ వైరుద్ధ్యం వల్ల టీడీపీతో పొత్తు లాభించకపోవచ్చన్నది పవన్ విశ్లేషణ. ఇక ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌తో జ‌న‌సేనలో కొత్త ఆశ క‌నిపిస్తోంది. అందుకే టీడీపీ బీజేపీని దూరం పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేసేందుకు ప‌వ‌న్ మొగ్గు చూపుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల ప‌ట్ల రాష్ట్ర ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉండ‌డం... టీడీపీ తన వైపు తిప్పుకోలేకపోతుండటం వల్ల ఈ రెండు పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటే త‌న‌కే దెబ్బ ప‌డుతుంద‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ప‌వ‌న్ ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్తారా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే.