Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వెంటే ప‌వ‌న్‌!... టీడీపీ వ్యూహ‌మేనా?

By:  Tupaki Desk   |   28 Jan 2018 7:31 AM GMT
జ‌గ‌న్ వెంటే ప‌వ‌న్‌!... టీడీపీ వ్యూహ‌మేనా?
X
తెలుగు నేల‌లో యాత్ర‌ల టైం స్టార్టైపోయింది. ఇంకో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో... ఆ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంకల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్ర‌ను చేప‌ట్టారు., క‌డ‌ప జిల్లాలోని ఇడుపుల‌పాయ‌లోని త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి నుంచి మొద‌లైన జ‌గ‌న్ యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌ - క‌ర్నూలు - అనంత‌పురం - చిత్తూరు జిల్లాల‌ను చుట్టేసి ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ యాత్రం ప్రారంభమైన నాటి నుంచి ఆరు నెల‌ల పాగు కొన‌సాగి శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియ‌నుంది. మొత్తంగా 3 వేల కిలో మీట‌ర్ల దూరం మేర న‌డ‌వ‌నున్న జ‌గ‌న్‌... త‌న తండ్రి చేప‌ట్టిన పాద‌యాత్ర రికార్డుల‌ను బ్రేక్ చేయ‌నున్నారు. మొత్తంగా తెలుగు నేల‌లో సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టిన నేత‌గానూ ఆయ‌న రికార్డు సృష్టించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. మొన్న‌టిదాకా సైలెంట్ గానే ఉన్న టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌. జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... అప్ప‌టిదాకా తాను సంత‌కాలు చేసిన ఒక‌టి అరా సినిమాల‌ను ప‌క్క‌న‌పెట్టేసి మ‌రీ హ‌డావిడిగా చ‌లోరే చ‌లోరే చ‌ల్ పేరిట యాత్ర‌ను చేప‌ట్టారు. తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప్రారంభ‌మైన ఈ యాత్ర‌... ఆ త‌ర్వాత ఖ‌మ్మం జిల్లాలోకి ఎంట‌రై... ఆ జిల్లాతోనే ముగిసిపోయింది.

అనంత‌రం ఖ‌మ్మం నుంచి నేరుగా హైద‌రాబాదులోని ఇంటికి చేరుకున్న ప‌వ‌న్ మ‌ళ్లీ ఏపీలోని అనంత‌పురం జిల్లాలో అదే పేరుతో యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. నిన్న అనంత‌లో ప్రారంభ‌మైన ఈ యాత్ర రేపు ముగియ‌నుంది. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో యాత్ర ముగించుకునే ప‌వ‌న్‌.. తిరిగి నేరుగా హైద‌రాబాదులోని త‌న ఇంటికి చేరుకుంటారు. ఇదంతా బాగానే ఉన్నా.. అనంత‌పురం జిల్లాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రూట్ మ్యాప్ చూస్తుంటే... వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ఫాలో అవుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే త‌న యాత్ర‌ను అనంత‌పురం జిల్లాలో పూర్తి చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో ముందుకు సాగుతున్నారు. జ‌గ‌న్ అనంత‌పురం టూర్ షెడ్యూల్ చూస్తే... క‌ర్నూలు జిల్లాలో యాత్ర‌ను ముగించుకుని గుత్తి వ‌ద్ద అనంత‌పురం జిల్లాలోకి ఎంట‌రైన జ‌గ‌న్‌... తర్వాత ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, తాడిపత్రి, రాప్తాడు తదితర నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకుని చిత్తూరు జిల్లాలోకి ఎంట‌ర‌య్యారు.

ఇప్పుడు ప‌వ‌న్ అనంత ప‌ర్య‌ట‌న చూస్తే... మొన్న జ‌గ‌న్ వెళ్లిన మార్గంలోనే ప‌వ‌న్ కూడా వెళుతున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. జ‌గ‌న్ మాదిరే ప‌వ‌న్ కూడా గుత్తి వ‌ద్దే అనంత‌పురంలోకి ఎంట్రీ ఇచ్చి జ‌గ‌న్ మాదిరే... కదిరి - పుట్టపర్తి - ధర్మవరం నియోజకవర్గాల్లో కొన‌సాగ‌నుంది. అయితే జ‌గ‌న్ త‌న యాత్ర‌ను అనంత‌పురం జిల్లాతోనే ముగించ‌కుండా నాన్ స్టాప్‌ గా కొన‌సాగిస్తున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం ధ‌ర్మవ‌రంలో ప‌ర్య‌టించి త‌న యాత్ర‌కు బ్రేకులు వేస్తున్నారు. ఈ ఒక్క తేడా మిన‌హా అనంత‌పురం జిల్లాలో జ‌గ‌న్ టూర్ సాగిన మార్గంలోనే ప‌వ‌న్ టూర్ కూడా సాగుతోంద‌నే చెప్పాలి. ప‌వ‌న్ టూర్ ఇప్ప‌టికిప్పుడు బ్రేకులు వేసుకున్నా... భ‌విష్య‌త్తులో మిగతా జిల్లాల్లోనూ జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేదు. అంటే జ‌గ‌న్ ఇప్ప‌టికే యాత్ర‌ను పూర్తి చేసిన జిల్లాల్లో ప‌వ‌న్ కూడా ప‌ర్య‌టించ‌నున్నార‌ని, జ‌గ‌న్ సాగిన రూట్‌లోనే ప‌వ‌న్ కూడా సాగ‌నున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. దీని వెనుక అధికార టీడీపీ హ‌స్త‌ముంద‌న్న ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్ యాత్ర‌కు ఆయా జిల్లాల్లో జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. టీడీపీకి ప్రాబ‌ల్యం ఉన్న అనంత‌పురం జిల్లాతో పాటు చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోనూ జ‌గ‌న్‌కు జ‌నం జేజేలు ప‌లికారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి జ‌డుసుకున్న టీడీపీ... ఆ ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకే ప‌వ‌న్‌ ను జ‌గ‌న్ రూట్లో యాత్ర సాగించేలా ప్లాన్ చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ మాట‌లో ఎంతమేర నిజ‌ముందో తెలియ‌దు గానీ... ఆది నుంచి కూడా జ‌గ‌న్ బాట‌లోనే ప‌వ‌న్ సాగుతున్నార‌న్న వాద‌న లేక‌పోలేదు. ఎందుకంటే చాలా స‌మ‌స్య‌ల‌పై అప్ప‌టిదాకా సైలెంట్‌ గానే ఉన్న ప‌వ‌న్‌... జ‌గ‌న్ స్పందించిన మ‌రుక్ష‌ణ‌మే ఆయా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం, ప‌వ‌న్ స్పందించిన కార‌ణంగానే స‌ద‌రు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేసిన‌ట్లుగా టీడీపీ స‌ర్కారు క‌ల‌రింగ్ ఇచ్చుకోవ‌డం తెలిసిందే క‌దా. ఆ ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలించి చూస్తే... ఇప్పుడు జ‌గ‌న్ వెంట సాగుతున్న ప‌వ‌న్ టూర్ పైనా అనుమానాలు రేకెత్త‌క మాన‌వు.