Begin typing your search above and press return to search.

సీఎం పవన్ : వాటి మీదనే సంతకాలు...వారంతా జైలుకే...

By:  Tupaki Desk   |   14 Nov 2022 6:40 AM GMT
సీఎం పవన్ : వాటి మీదనే సంతకాలు...వారంతా జైలుకే...
X
పవన్ కళ్యాణ్ ఏకంగా సీఎం కుర్చీకే గాలం వేశారు. ఆయన ఎమ్మెల్యే గా రెండు చోట్ల ఓడారు కదా. సీఎం గా నేరుగా టార్గెట్ చేయడమేంటి అన్న ప్రశ్న ఎవరైనా వేసినా డౌట్లు ఎవరికైనా వచ్చినా ఇది ప్రజాస్వామిక దేశమని మరచిపోకూడదు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎన్టీయార్ కూడా ఎకాఎకీన సీఎం కుర్చీలో కూర్చున్నారు. అలాగే ఈ మధ్య కనుక చూసుకుంటే ఢిలీని పాలిస్తున్న సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా మంత్రిగా ఎమ్మెల్యే పని చేయకుండానే నేరుగా ఎన్నికల్లో నెగ్గి వచ్చి ముఖ్యమంత్రి పీఠం పట్టేసారు.

అందువల్ల జనాలు మెచ్చాలి కానీ పవన్ సీఎం కావడం అన్నది పెద్దగా ఆలోచించే విషయం కానే కాదు. ఇక ఏపీ రాజకీయాల్లో మార్పు కచ్చితంగా కనుక వస్తే పవన్ కంటే బెస్ట్ ఆప్షన్ లేదు అనేవారూ ఉన్నారు. ఈ నేపధ్యంలో 2019 ఎన్నికల నుంచే తాను సీఎం అభ్యర్ధిని అని చాటుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ తాను వెళ్ళిన ప్రతీ చోట తన ప్రసంగాల ద్వారా ప్రకటనల ద్వారా సీఎం అయితే ఏం చేస్తానో చెబుతున్నారు. ఒక విధంగా ఇది జనసేన ఎన్నికల ప్రణాళిక కింద కూడా భావించాలి.

పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీలో కూర్చున్నాక తొలి రెండు సంతకాలు దేని మీద పెడతారు అన్న దాని మీద ఎలాంటి సస్పెన్స్ లేకుండా ఆయనే చెప్పేస్తున్నారు. ఆయన తాజాగా విజయనగరం టూర్ లో జనాల సాక్షిగా చెప్పేది ఏంటి అంటే తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న పధకాలను యధావిదిహ్గా కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అంటే వైసీపీ ఇపుడు అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు కానుక, విద్యా భరోసా వంటి పధకాలను కొనసాగిస్తామని చెప్పారు.

వీటితో పాటు అదనంగా ఇసుకను కూడా ప్రజలకు ఉచితంగా ఇస్తామని పవన్ మరో హామీని తాజా టూర్ లో చెప్పేశారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, తాము కనుక అధికారంలోకి వస్తే బాధ్యతగా వ్యవహరిస్తామని పవన్ చెప్పడం విశేషం.

దీనితో పాటు ఆయన మరో కీలకమైన హామీని జనాలకు ఇచ్చారు. అదేంటి అంటే తాము అధికారంలోకి వచ్చాక అవినీతి పరులను ఊచలు లెక్కపెట్టేలా చేస్తామని అంటే వారికి జైలు గోడలను చూపిస్తామని పవన్ చెప్పారన్న మాట. ఇంతకు ముందు కూడా పవన్ తాను సీఎం అయితే రెండు కీలక అంశాల మీద సంతకాలు చేస్తానని చెప్పారు. అది ఏంటి అంటే తొలి సంతకం సుగాలి ప్రీతికి న్యాయం జరిగేలా సంతకం చేయడం, మరొకటి ఏంటి అంటే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం.

ఇపుడు మరిన్ని హామీలను ఆయన విజయనగరం టూర్ లో ఉచ్చారు. మొత్తానికి పవన్ రాజకీయం పదును తేరుతోంది. ఆయన జనాలకు బాగా చేరువ అవుతున్నారు. 2024లో అధికార మార్పిడి కచ్చితంగా జరిగి తాను సీఎం కుర్చీలో కూర్చుంటాను అని ఆయన గట్టిగా భావిస్తున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఇస్తున్న హామీల మీద పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. పవన్ లో కూడా సీఎం అవుతాను అన్న ధీమా కూడా పెరుగుతోంది. చూడాలి మరి ఏపీ రాజకీయం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.