Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ గురి!..ఉత్త‌రాంధ్ర వ‌ర‌కే ప‌రిమిత‌మా?

By:  Tupaki Desk   |   3 July 2018 11:03 AM GMT
ప‌వ‌న్ గురి!..ఉత్త‌రాంధ్ర వ‌ర‌కే ప‌రిమిత‌మా?
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో నూత‌న రాజ‌కీయాల‌కు పునాది వేస్తానంటూ ఘ‌నంగా ప్ర‌క‌టించిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇప్ప‌టిదాకా మ‌నమంతా చూసిన ఫ‌క్తు రాజ‌కీయ నాయకుడి మాదిరిగానే క‌నిపిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌న పార్టీలోకి పాత కాపుల‌కు స్థాన‌మే లేదంటూ ఘీంక‌రించిన ప‌వ‌న్‌... ఇప్పుడు ఏ పార్టీలోనూ టికెట్లు రాని నేత‌ల‌కు - అన్ని పార్టీలు దూరం పెట్టేసిన నేత‌ల‌ను జ‌నసేన‌లో క‌లుపుకుని ముందుకు సాగుతున్నారు. ఆ చోటా మోటా నేత‌ల చేరిక‌ల‌తోనే తాను ఏదో సాధించేసిన‌ట్లుగా ప‌వ‌న్ త‌న‌దైన శైలి డైలాగులు డెలివ‌రీ చేస్తున్నారు. అయినా రాష్ట్రవ్యాప్తంగా జ‌ర‌గాల్సి ఉన్న ప్ర‌జా చైత‌న్య యాత్ర‌లో భాగంగా రెండు నెల‌ల నుంచి ప‌వ‌న్ కేవ‌లం ఉత్త‌రాంధ్ర‌ను కూడా పూర్తి చేయలేక‌పోయారు. విడ‌తల‌వారీగా యాత్ర చేస్తున్న ప‌వ‌న్‌... ఇప్ప‌టిదాకా మూడు జిల్లాల్లో కాలు మోప‌గా... ఆ మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను కూడా ఆయ‌న పూర్తి చేయ‌లేద‌ట‌. ఏదో త‌న‌కు తోచిన‌ట్లుగా వెళుతున్న ప‌వ‌న్‌... ఏ ఒక్క జిల్లా యాత్ర‌ను కూడా పూర్తి చేయ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప‌వ‌న్ అస‌లు రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టిస్తారా? లేక ఎన్నిక‌లు వ‌చ్చేదాకా ఇదే త‌ర‌హాలో ఏవో కొన్ని జిల్లాల్లో మాత్రం ప‌ర్య‌టించేసి... మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ అంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెనక్కి తీసుకుంటారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ త‌ర‌హా అనుమానాలు వేరెవ‌రో రేకెత్తిస్తే... ఏవో దురుద్ధేశ్యాల‌తో ఈ ప‌ని చేసి ఉండొచ్చ‌న్న వాద‌న వినిపించేది. అయితే అందుకు విరుద్ధంగా స్వ‌యంగా ప‌వ‌న్ టూర్ షెడ్యూల్ చూస్తేనే ఈ త‌ర‌హా అనుమానాలు వ‌చ్చేస్తున్నాయి. అయినా ఇప్ప‌టికే శ్రీ‌కాకుళం - విజ‌య‌న‌గ‌రం జిల్లాల ప‌ర్య‌ట‌న ముగిసిన‌ట్లుగా చెప్పుకొచ్చిన ప‌వ‌న్ అండ్ బ్యాచ్‌... మ‌ళ్లీ నిన్న శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టించ‌డ‌మేమిటో అర్ధం కావ‌డం లేద‌న్న మాట వినిపిస్తోంది. అంతేకాకుండా పోనీ శ్రీ‌కాకుళం జిల్లాలో క‌వ‌ర్ కాని ప్రాంతాల‌ను క‌వ‌ర్ చేసేందుకే ప‌వ‌న్ అక్క‌డికి వ‌చ్చార‌ని అనుకున్నా... మొన్న‌టిదాకా విశాఖ జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న‌ను పూర్తి చేసుకోకుండానే శ్రీ‌కాకుళం జిల్లాలో రెండో సారి కాలు పెట్టారు. ఇప్పుడు మ‌ళ్లీ విశాఖ జిల్లాలోకి వ‌చ్చేశారు. మొత్తంగా ఎక్క‌డ చూసినా... ఆ మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో స్థానిక స‌మ‌స్య‌ల కంటే కూడా ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌లంటూ ప‌వ‌న్ చెబుతున్న వైనం... ప‌వ‌న్ కేవ‌లం ఉత్త‌రాంధ్ర‌కే ప‌రిమిత‌మ‌వుతారా? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక జ‌న‌సేన సంస్థాగ‌త బ‌లోపేతం విష‌యానికి వ‌స్తే... ఎప్పుడో త‌న‌కు తీరుబ‌డిగా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్న ప‌వ‌న్‌... పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయ‌లేద‌నే చెప్పాలి. ప‌వ‌ర్ స్టార్ అభిమానులు త‌ప్పించి ఇప్ప‌టిదాకా పార్టీ ప్ర‌తినిధులం తామేనంటూ బ‌య‌ట‌కు వ‌చ్చిన వారి సంఖ్య‌ను వేళ్ల‌పై లెక్క‌పెట్టేయొచ్చు. అయితే పార్టీని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న యాత్ర‌లోనే బ‌లోపేతం చేస్తార‌ని - పార్టీలోకి చేరిక‌లు - సంస్థాగ‌త కూర్పు అంతా అప్పుడే రూపుదిద్దుకుంటుంద‌ని కూడా జ‌న‌సేన చెబుతూ వ‌స్తోంది. అయితే ఈ విష‌యంలోనూ ప‌వ‌న్ పెద్ద‌గా సక్సెస్ కాలేద‌నే చెప్పాలి. శ్రీ‌కాకుళం - విజ‌య‌న‌గ‌రం జిల్లాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌ర్కారుపై పోరాటానికే ప‌వ‌న్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు త‌ప్పించి అక్క‌డి స్థానిక స‌మ‌స్య‌లు - పార్టీలో చేరిక‌లు - ఆయా స్థానాల‌కు అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న త‌దిత‌రాల‌న్నీ కూడా ఇసుమంత కూడా క‌నిపించిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి.

ఇక విశాఖ జిల్లా విష‌యానికి వ‌స్తే... మొన్న కొంద‌రు నేత‌లు జ‌న‌సేన‌లో చేరారు. వారిలో చాలా మంది అస‌లు విశాఖ జిల్లాకే కొత్త ముఖాలు. ఒక‌రిద్ద‌రు ఓ స్థాయి క‌లిగిన నేత‌లే అయినా... మిగిలిన వారంతా ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ప‌క్క‌న‌పెట్టిన నేత‌లుగానే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక అభ్య‌ర్థుల విష‌యంలోనూ ప‌వ‌న్ గ‌తంలో చాలా గంభీర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు. త‌న పార్టీలో అన్నీ కొత్త ముఖాలే ఉంటాయ‌ని - ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి అస‌లు ఎంట్రీ ఇవ్వ‌మ‌ని కూడా ఆయ‌న ఘనంగా ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టి ప‌రిస్థితి చూస్తుంటే... ఇత‌ర పార్టీలు తిర‌స్క‌రించిన‌ - ప్ర‌జ‌లు ఓడించిన అభ్య‌ర్థుల‌ను మాత్ర‌మే పార్టీలో చేర్చుకుంటూ ప‌వ‌న్ ముందుకు సాగుతున్నారు. మొత్తంగా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌... ప‌వ‌న్ త‌న పార్టీపై జ‌నాల్లో నెల‌కొన్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తార‌ని ఆశించిన జ‌నాల‌కు నిరాశ‌నే మిగులుస్తూ... ముందుకు సాగుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.