Begin typing your search above and press return to search.

ఢిల్లీలో జగన్ ను అలా అనుకుంటున్నారంటూ పవన్ పోస్ట్

By:  Tupaki Desk   |   16 Nov 2019 9:14 AM GMT
ఢిల్లీలో జగన్ ను అలా అనుకుంటున్నారంటూ పవన్ పోస్ట్
X
అనూహ్యంగా ఢిల్లీ బాట పట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా ట్విట్టర్ ద్వారా తన సందేశాల్ని పోస్టు చేస్తున్నారు. దేశ రాజధానికి ఏ కారణం మీద పవన్ వెళ్లారు? ఎవరెవరితో భేటీ కానున్నారు? అన్న విషయాల మీద క్లారిటీ ఇవ్వని పవన్ కల్యాణ్.. తాజాగా ట్విట్టర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్య పోస్టు పెట్టారు.

కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకున్న జగన్ ఫోటోను ఆయన పోస్టు చేశారు. సీఎం జగన్ పై జాతీయ పత్రికల్లో వేసిన కార్టూన్ అని.. ఏపీ సీఎం గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉందన్న వ్యాఖ్య చేశారు. జగన్ క్యారికేచర్ తో వ్యంగ్య ఫోటోను పోస్టు చేసిన పవన్.. తన టార్గెట్ ఏమిటన్న విషయాన్ని తాజా ట్వీట్ తో స్పష్టం చేశారని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. వ్యంగ్య చిత్రంతో పాటు.. ఆయనో వ్యాఖ్యను పోస్టు చేశారు. ‘‘ఏపీలో మొత్తం175 అసెంబ్లీ స్థానాలు ఉంటే 151 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బ తింది. 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది’’ అంటూ మండిపడ్డారు.

పవన్ ట్వీట్ వ్యాఖ్య ఇలా ఉంటే.. వాస్తవం మరోలా ఉంది. ఏపీలో ఇసుక తీవ్రత ఉన్నప్పటికీ.. అది ప్రభుత్వ వైఫల్యం కంటే కూడా.. వరద పోటు ఎక్కువగా ఉండటంతో ఇసుకను తీయలేని పరిస్థితి. గడిచిన రెండు నెలలుగా ఉన్న కొరతను తీరుస్తూ ప్రస్తుతం ఇసుక ఉత్పత్తి జోరుగా సాగుతున్న వేళ.. నిజాల్ని పక్కన దారి పట్టేలా వ్యాఖ్యలు చేయటం ఒక దుర్మార్గమైతే.. మరోవైపు వాస్తవాల్ని వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడటం పవన్ కు మాత్రమే చెల్లిందని చెప్పక తప్పదు.