Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో కూడా పోటీకి సిద్ధ‌మంటున్న ప‌వ‌న్

By:  Tupaki Desk   |   25 Jun 2022 9:30 AM GMT
తెలంగాణ‌లో కూడా పోటీకి సిద్ధ‌మంటున్న ప‌వ‌న్
X
వ‌చ్చే ఏడాది తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి నేత‌లు, కార్య‌క‌ర్త‌లంతా సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఈ మేర‌కు త‌న‌ను క‌ల‌సిన తెలంగాణ నేత‌ల‌తో మాట్లాడుతూ ప‌వ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న నేప‌థ్యంలో నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు రాజ‌కీయ శిక్ష‌ణా శిబిరాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు, తెలంగాణ‌లో పార్టీ నేత‌లు, వివిధ విభాగాల అధ్య‌క్షులు, వీర మ‌హిళ‌లు, కార్య‌క‌ర్త‌లు మొత్తం 32 మంది ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖాముఖి నిర్వ‌హించారు. వారితో తెలంగాణ‌లో ఉన్న రాజ‌కీయ‌, ఆర్థిక‌, సామాజిక ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌జాప‌క్షం వ‌హిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌ని వారికి ప‌వ‌న్ ఉద్భోదించారు. క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి నేత‌లు, శ్రేణులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. అలాగే తెలంగాణలో నిర్వ‌హించ‌బోయే జ‌న‌సేన పార్టీ డివిజ‌న్ స్థాయి స‌మావేశాల‌పై చ‌ర్చించారు.

అయితే.. గ‌తంలో తెలంగాణ‌లో కూడా జ‌న‌సేన పార్టీకి పొత్తు ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి ముందు సిద్ధ‌మ‌య్యారు. అయితే బీజేపీ నేత‌ల నుంచి వ‌చ్చిన విన‌తితో నామినేష‌న్లు వేసి కూడా ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో జ‌న‌సేన మ‌ద్ద‌తుతో ఆ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ మంచి ఫ‌లితాలు సాధించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ త‌ర్వాత బీజేపీ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని.. ముఖ్య‌మైన విష‌యాలు త‌మ‌తో చ‌ర్చించ‌డం లేద‌ని ప‌వ‌న్ అల‌క‌బూనారని వార్త‌లు వ‌చ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిని, మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె వాణి దేవికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో బీజేపీ అభ్య‌ర్థి ఓడిపోయి టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణి దేవి గెలుపొందారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీతో క‌లిసి నడుస్తారో లేక టీఆర్ఎస్ తో క‌లిసి న‌డుస్తారా అనేది తేలాల్సి ఉంద‌ని అంటున్నారు.

టీఆర్ఎస్ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ హాజ‌ర‌య్యార‌ని చెబుతున్నారు. కేటీఆర్, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీకి హైద‌రాబాద్ న‌గ‌రంలో కొన్నిచోట్ల‌, అలాగే తెలంగాణ‌లో ఒక‌టి, రెండు చోట్ల టికెట్లు ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేద‌ని అంటున్నారు.

ముఖ్యంగా తెలంగాణ‌లో బీసీ జ‌నాభా ఎక్కువ‌. అందులోనూ మున్నూరు కాపులు అత్య‌ధికంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్, ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎంపికైన కె.ల‌క్ష్మ‌ణ్ వీరంతా మున్నూరు కాపులే కావడం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో భారీ సంఖ్య‌లో ఉన్న కాపుల‌ను ఆక‌ర్షించ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మ‌తో క‌లుపుకుంటార‌ని కొంద‌రు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ లోనూ చ‌ర్చ జ‌రుగుతోంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు జ‌న‌సేన పార్టీని క్షేత స్థాయిలో బ‌లోపేతం చేయాల్సి ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికీ చాలా జిల్లాల్లో జ‌న‌సేన పార్టీకి క‌మిటీలే లేవ‌ని గుర్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని వివ‌రిస్తున్నారు. ఆ త‌ర్వాతే తెలంగాణ‌లో పోటీకి సిద్ధ‌మ‌ని ప‌వ‌న్ చెబితే బాగుంటుంద‌ని అంటున్నారు.