Begin typing your search above and press return to search.

మీడియా భేటీలో పవన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 Jan 2017 5:56 AM GMT
మీడియా భేటీలో పవన్ సంచలన వ్యాఖ్యలు
X
జల్లికట్టు స్ఫూర్తితో విశాఖలో తలపెట్టిన శాంతి నిరసనకు ఏపీ సర్కారు బ్రేక్ వేయటం.. ఈ నిరసనకు తన పూర్తి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కాని వేళ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతునన నేపథ్యంలో..ఈ రోజు ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆచితూచి మాట్లాడుతూనే.. ప్రధాని మోడీ మీద తనకున్న ఆగ్రహాన్ని బాహాటంగానే బయటపెట్టేశారు. మోడీ పాలన జనరంజకంగా లేదని చెప్పటంతో పాటు.. ఒంటెద్దు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యను చేశారు. వ్యవస్థల్ని భయపెట్టేలా చేయటాన్ని ప్రస్తావించి పవన్.. మీడియాను.. అందరిని భయపెట్టటం ఏమిటంటూ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారుపైన సునిశిత విమర్శలతో పాటు.. బాబు వెంట ఉన్న నేతలపై ఆరోపణలు చేస్తూ.. బాబును జాగ్రత్తగా ఉండాలని పేర్కొనటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేంద్రమంత్రి వెంకయ్యపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జల్లికట్టుకు సంబంధించి అందరూ చూస్తున్న కోణం వేరని.. అసలు విషయం వేరంటూ ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయ అనుభవం లేదని వ్యాఖ్యలు చేసే వారు మళ్లీ నోరెత్తకుండా సమాధానం చెప్పిన పవన్..అవసరమైతే ఎంతకైనా సరే.. దేనికైనా సిద్దమంటూ ప్రాణాల్ని పణంగా పెట్టటానికైనా తాను సిద్ధమన్న సంచలన వ్యాఖ్యను చేశారు. పవన్ ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాల్ని చూస్తే..

‘‘పదేళ్లు కేంద్రం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటంతోనే మొన్నటి ఎన్నికల్లో నేను బీజేపీ.. టీడీపీలకు మద్దతు ప్రకటించాను. గుజరాత్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మోదీ ప్రధాని అయితే బాగుంటుందని.. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రచారం చేశా. వారికి మద్దతుగా ప్రచారం చేసినప్పుడు నీకు రాజకీయాలు తెలుసా? నీకున్న రాజకీయ అనుభవం ఎంత? అని ఎవరూ అడగలేదు. ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు నన్ను కర్ణాటక.. తమిళనాడు.. తెలంగాణలో ప్రచారం చేయించుకున్నారు. నా అభిమానులతో జెండాలు మోయించారు. ఇప్పుడు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే మాత్రం నీకు రాజకీయాలు ఏం తెలుసు? నీకేం అనుభవం ఉంది? అంటూ విమర్శిస్తున్నారు. దీని కంటే అవకాశవాదం ఎక్కడైనా ఉంటుందా?’’

‘‘మూడేళ్ల కాలంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలేవీ నేను సంధించలేదు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడితే విభజనతో కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని, ప్రజలను ఇబ్బందులు పెట్టినట్లు అవుతుందని భావించా. మోదీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అనుకున్నా. కానీ ఆయన అన్ని విషయాల్లోనూ ఒంటెద్దు పోకడ కొనసాగిస్తున్నారు. పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. రోహిత్‌ వేముల.. పెద్ద నోట్ల రద్దు అంశాల్లో మోదీ ఒంటెద్దు పోకడ స్పష్టంగా కనిపిస్తోంది. మోదీ తీరు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా.. మీరనుకున్నది చేయడమే ప్రజాస్వామ్యమా? మోడీ నుంచి ప్రజలు కోరుకున్నది ఇదైతే కాదు. బీజేపీ నేతల్ని ఎంతగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా.. ప్రజల మనోభావాల్నివారు పట్టించుకోవటం లేదు’’

‘‘గతంలో చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శించలేదని చాలామంది అంటుంటారు. ఓటుకు నోటు ఉదంతం మీద స్పందించలేదని చెబుతారు. ప్రతిదీ రూల్ బుక్ లా ఉండాలని చెప్పలేం. ఐడియాలజీ చెప్పటానికి బాగుంటుంది. ఆచరణలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నా వరకు నాకూ ప్రాక్టికల్ గా ఉండే అంశాల్ని పరిగణలోకి తీసుకుంటా. ఓటుకు నోటు మీద ఎందుకు మాట్లాడలేదంటే.. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. ప్రతి చిన్న దాని గురించి గొడవ పెట్టుకొని అప్పుడే విడిపోయిన రెండు రాష్ట్రాల ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే మాట్లాడలేదు. అందుకే.. ఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడలేదు’’

జల్లికట్టు గురించి చెబుతూ.. ‘‘ఇదంతా ఒక ఆట అని చెబుతున్నారు. కానీ.. ఇందులో అసలు విషయం వేరే ఉంది. సినిమా షూటింగ్ లో భాగంగా నెలరోజుల పాటు తమిళనాడులో ఉన్నా. అక్కడ నా స్నేహితులు కొందరు.. జల్లికట్టు వివాదం గురించి చెబుతూ.. రానున్నరోజుల్లో ఇదో పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పారు. కానీ.. అప్పుడు అనుకోలేదు. కానీ.. తర్వాత అర్థమైంది. అక్కడ వారు చెప్పిందేమిటంటే.. జల్లికట్టు ఆట కోసం తమిళులు ఆస్థాయిలో రోడ్డు మీదకు రాలేదు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలను శాసించాలని భాజపా ప్రయత్నిస్తోంది. దీన్ని పసిగట్టిన అక్కడి యువత ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఉద్యమబాట పట్టింది. జల్లికట్టు ఉద్యమం కేవలం సంస్కృతి పరిరక్షణ ఉద్యమం కాదు.. బీజేపీ మీదున్న ఆగ్రహంతో తమిళ యువత చేపట్టిన ఉద్యమం’’

‘‘ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని పార్లమెంటులో డిమాండ్‌ చేసిన ఆయన.. అధికారంలోకి రాగానే అదేమీ సంజీవని కాదని వ్యాఖ్యానించడం దారుణం. ఆయన రోజుకో మాట మాట్లాడుతుంటే ప్రజలు ఊరుకోరు. ఆయన తన స్వర్ణభారత్‌ ట్రస్టు మీద పెట్టిన శ్రద్ధలో కొంత అయినా ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద కానీ పెట్టి ఉంటే.. ఆ సమస్య ఇప్పటికి తీరి ఉండేది. వెంకయ్యనాయుడు లాంటి వారి నిలకడ లేని మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ప్రజలంటే ఆటలుగా ఉందా? మీరేం చేసినా మేం చేతులు కట్టుకొని ఉంటామని అనుకుంటున్నారా?ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ప్రసాదిస్తామని చెప్పారు. ప్రసాదించటానికి ఆయనేమైనా దేవుడా?మీరు ఏమైనా పై నుంచి దిగి వచ్చారా? మేం మీకు ఏమైనా బానిసలమా? ఢిల్లీ రక్షణ వలయాల్లో ఉండి మాట్లాడటం.. నాలికను మెలి తిప్పి వ్యాఖ్యలు చేస్తుంటారు. మీ నిలకడ లేని మాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. రామ మందిరం గురించి పట్టించుకుంటారు గానీ.. 4కోట్ల ప్రజల సమస్యను మాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు’’

‘‘చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు వెనకడుగు వేశారో అర్థం కావడం లేదు. హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోవడం ఆయన నైతిక తప్పే. ఈ అంశంలో ఎందుకు కాంప్రమైజ్‌ కావాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పి తీరాలి. సింగపూర్‌ లాంటి రాజధానినినిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు.. సుజనాచౌదరి.. రాయపాటి లాంటి వ్యక్తుల్ని వెంటబెట్టుకుని తిరుగుతుండటం సిగ్గుచేటు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి నుంచి ఏం స్ఫూర్తి నేర్చుకోవాలి. రాయపాటి సాంబశివరాలుకు పోలవరం ప్రాజెక్టు అప్పగించారు. పోలవరం నిర్మాణంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిష్కారం చూపాల్సి ఉంది. ప్రత్యేక హోదా మీద మీరు ఎందుకు వెనకడుగు వేశారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది’’

‘‘ నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. ప్రజల కోసం కుటుంబాన్ని.. సొంత అన్నయ్యను వదిలివచ్చిన వాడిని. నాకు మీతో సంబంధం తెంచుకోవడం కష్టమేమీ కాదు. ప్రత్యేక హోదా కోసం యువత శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామంటే ఎందుకు అడ్డుకున్నారు. వారికి కనీసం ఒక గంటైనా సమయం ఇస్తే నిరసన చేపట్ట ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు. అనవసరంగా యువతను రెచ్చగొట్టడం సరికాదు. అనుమతి ఇవ్వకుండా వారి నిరసనను పోస్ట్ పోన్ మాత్రమే చేశారు’’

‘‘వెంకయ్య.. చంద్రబాబులకు వారి అనుభవానికి.. పెద్దరికారిని గౌరవం ఇస్తాను. నాకు వ్యక్తిగతంగా అందరూ తెలుసు. నేను విధానాల విషయంలోనే మాట్లాడతానను. ప్రజా సమస్యల విషయంలో అవసరమైతే రోడ్ల మీదకు వచ్చి కూర్చొని ఎందుకు నిరసన తెలియజేయకూడదో మీరు మీడియా ముందు చెప్పాలి. మీడియా వాళ్లను భయపెడుతున్నారు. ప్రొఫెసర్లను భయపెడుతున్నారు. పోలీసుల ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. మీరిలా చేస్తే.. మేం కూడా ఉంటే ఉంటాం.. పోతే పోతామని అనుకుంటే..? నాకూ కుటుంబం ఉంది. పిల్లలు ఉన్నారు. కెరీర్ ఉంది. వాటిని వదులుకొని ఎంతదూరమైన వచ్చేందుకు సిద్దం’’

‘‘ప్రత్యేకహోదాకు సరిసమానంగా ప్యాకేజీ అంటున్నారు. అదే నిజమైతే.. ప్యాకేజీని అర్థరాత్రి వేళ.. అంత హడావుడిగా ఎందుకు ఇచ్చినట్లు? నేనుఢిల్లీకి వెళ్లి.. ఆర్థిక శాఖకు సంబంధించిన వారిని సంప్రదించా. కొంతమంది మేధావులుతో చర్చలు జరిపా. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు’’

‘‘కేంద్రంలో ఉన్నంత మాత్రానా మీరు వేరుగా పుట్టలేదు. దక్షిణాది రాష్ట్రాల మీద మీ వైఖరి సరిగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్ని బానిసలుగా చూస్తారా? యూపీని నాలుగు రాష్ట్రాలుగా ఎందుకు విడగొట్టరు? ఉత్తరాదిలో మీ బలం తగ్గకూడదు. దక్షిణాది విషయంలో మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు’’

‘‘సింగపూర్ స్ఫూర్తిగా తీసుకొని ఏపీని సింగపూర్ ని చేస్తానని చెబుతుంటారు చంద్రబాబు. మరి.. సింగపూర్ నిర్మాత ఏ విధంగా అయితే.. తన సన్నిహితులు తప్పలు చేసినా వారిని శిక్షించినట్లుగా.. తన పక్కనుండే నేతల విషయంలో చంద్రబాబు అదే తీరులో చర్యలు తీసుకోగలరా?’’​



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/