Begin typing your search above and press return to search.

విజయసాయి మాటను నిజం చేసిన పవన్

By:  Tupaki Desk   |   1 Nov 2019 4:27 AM GMT
విజయసాయి మాటను నిజం చేసిన పవన్
X
రాజకీయాలు చేసే వారు వేసుకునే ప్లాన్లు ఎలా ఉన్నా.. వారు వేసే ఎత్తులు ప్రజల్లో అపనమ్మకాన్ని.. చిరాకును మాత్రం కలిగించకూడదన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. జనంలో సందేహాలు మరిన్ని పెరిగేలా చోటు చేసుకునే పరిణామాలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని పవన్ మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది.

ఏపీలో ఇసుక సమస్య తీవ్రతి తీవ్రంగా ఉన్నట్లుగా హడావుడి చేయటంలో ఇటు విపక్షాలు.. అటు మీడియా సక్సెస్ అయ్యాయని చెప్పాలి. రాష్ట్రంలో చోటు చేసుకునే మరణాల్లో చాలావరకు ఇసుక ఖాతాలో వేసేయటం ద్వారా.. ఆ అంశానికి హైప్ క్రియేట్ చేయటంతో పాటు.. జగన్ ప్రభుత్వ వైఫల్యాన్నిఎత్తి చూపాలన్న తపన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇసుక కొరతకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం కన్నా.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని వైనాన్ని ఏపీ ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. కానీ.. రాజకీయ ప్రయోజనం కోసం దీన్నో ఇష్యూగా చేసి రాజకీయ లబ్థి పొందాలని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ వ్యూహంతోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. లాంగ్ మార్చ్ ప్రకటనను చేశారు.

అంతేకాదు.. తాను చేస్తున్న మార్చ్ తానొక్కడే చేస్తే తేలిపోతుందన్న విషయాన్ని గుర్తించిన ఆయన.. తెలివిగా టీడీపీతో సహా ఏపీలోని విపక్షాల్ని ఈ మార్చ్ కు ఆహ్వానించారు. వారి నైతిక మద్దతు కోరారు. ఎన్నికల వేళ పవన్ తో తెర వెనుక ఒప్పందాన్ని చేసుకోవటం ద్వారా.. జగన్ ఓటు బ్యాంకును చీల్చాలన్న భారీ ప్లాన్ కు ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు.

దీంతో.. బంపర్ మెజార్టీతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. బెడిసి కొట్టిన వ్యూహంతో బాబు విపక్షానికి పరిమితమయ్యారు. దానికి మించి అవమానకర రీతిలో సీట్లు వచ్చాయి. జనసేనతో కలిసి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న వాదనను అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారు తెలుగు తమ్ముళ్లు. పవన్ తో దోస్తీకి విపరీతంగా ట్రై చేస్తున్న బాబుకు..అనుకోని రీతిలో ఇసుక సమస్య మీద పవన్ కల్యాణ్ నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ కు తమతో కలిసి రావాలని విపక్షాల్ని కోరే క్రమంలో టీడీపీ మద్దతు కోరారు.

పవన్ అడిగారో లేదో.. ఆ వెంటనే బాబే స్వయంగా విశాఖలో జనసేన నిర్వహించే లాంగ్ మార్చ్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ మినహా మిగిలిన విపక్షాలు పవన్ చేపట్టనున్న మార్చ్ కు ఓకే చెప్పేశాయి. టీడీపీకి పవన్ కల్యాణ్ ఇచ్చిన కాల్షీట్లు ఇంకా అయిపోలేదంటూ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్ వేసిన తీరులో వాస్తవం ఎంతన్నది తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమైపోతుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

మొన్నటి వరకూ చంద్రబాబును.. ఆయన పాలనా విధానాల్ని తప్పు పట్టిన పవన్.. అంతలోనే తాను చేస్తున్న లాంగ్ మార్చ్ కు సాయం కోరటం లాంటివి పవన్ వ్యూహం పక్కాగా లేదన్న అభిప్రాయం కలిగించేలా చేస్తుందని చెప్పక తప్పదు.