Begin typing your search above and press return to search.

సీబీఐ దత్తపుత్రుడు వర్సెస్ సీబీఎన్ దత్తపుత్రుడు...?

By:  Tupaki Desk   |   14 May 2022 9:29 AM GMT
సీబీఐ దత్తపుత్రుడు వర్సెస్ సీబీఎన్ దత్తపుత్రుడు...?
X
ఏంటో ఏ రాష్ట్రానికి లేనంతమంది దత్తపుత్రులు ఒక్క ఏపీకే ఉన్నారు అంటే అదంతా రాజకీయ మహిమగానే చూడాలి. ఏపీలో ఈ దత్తపుత్రుల కధ ఈనాటిది కాదు. అయినా కూడా తాజాగా ఎన్నికల వేడి పెంచేస్తూ వాడిగా వేడిగా అటూ ఇటూ కౌంటర్లు పడిపోతున్నాయి. చాలా కాలం క్రితం నుంచే పవన్ని చంద్రబాబు దత్తపుత్రుడు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నాయి. అయితే నాడు లైట్ గా తీసుకున్న జనసేనకు ఇపుడు ఆ మాట అంటేనే తెగ మండుకొస్తోంది.

దానికి కారణం సొంతంగా ఎదగాలన్న ప్రయత్నం ఒక వైపు ఉండడంతో పాటు మేము మేమే. మాదీ ఒక పార్టీ అని లోకానికి చాటాలీ అన్న రాజకీయ తెలివిడి ఇపుడు పుట్టుకురావడం. నిజంగా మొదట్లోనే దీన్ని ఖండించి ఉంటే ఇప్పుడు ఇంత దాకా కధ సాగేది కాదు. కానీ బాబు దత్తపుత్రుదు పవన్ అని వైసీపీ చేసిన ప్రచారానికి 2019 ఎన్నికలో జనసేన దారుణంగా దెబ్బతింది.

ఇపుడు అంటే 2024 ఎన్నికల్లో కూడా అలాంటి ఇబ్బందులే ఎదురవుతాయని జనసేన గట్టిగా వ్యతిరేకిస్తోంది. అన్నీ ఆలోచించుకున్న మీదటనే పవన్ ఆ మధ్య నన్ను బాబు దత్తపుత్రుడు అంటే జగన్ని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. అయినా సరే జగన్ కానీ మంత్రులు కానీ ఏ మాత్రం తగ్గడంలేదు. లేటెస్ట్ గా ముమ్మిడివరం మత్య్సకార సభలో జగన్ పవన్ పేరు ఎత్తకుండా సీబీఎన్ దత్తపుత్రుడు అంటూ ఒకటికి పదిమార్లు విమర్శలు చేశారు. దాంతో పవన్ నుంచి నాదెండ్ల నుంచి మొదలుపెడితే ఆ పార్టీ నాయకులు అంతా కూడా కట్టకట్టుకుని మరీ జగన్ మీద గట్టిగానే విరుచుకుపడుతున్నారు.

అబద్దాలు చెబుతున్న సీబీఐ దత్తపుత్రుడు, ఏపీకి చేసింది ఏమీ లేకనే ఇలా మా మీద కామెంట్స్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనల మండిపడితే ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను చూసే జగన్ ఇలా తమ మీద విమర్శలు చేస్తున్నారు అని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ఇక విశాఖకు చెందిన జనసేన నాయకుడు శివశంకర్ అయితే సీబీఎన్ దత్తపుత్రుడు అని ఎలా పిలుస్తారు అని ముఖ్యమంత్రి మీదనే కామెంట్స్ చేశారు.

ప్రజల కోసం జనసేన పోరాడుతూంటే సీబీఎన్ దత్తపుత్రుడు అంటూ జగన్ విమర్శలు చేయడాన్ని సహించమని జనసేన నాయకులు అంటున్నారు. ఇవన్నీ అనుచితమైన కామెంట్స్ గా కూడా వారు అంటున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి మీద ప్రజలలో వ్యతిరకత ఉందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే తమ మీద విమర్శలు చేస్తున్నారు అని జనసేన మరో నేత బొలిశెట్టి సత్యనారాయణ అంటున్నారు.

మొత్తానికి చూస్తే సీబీఎన్ దత్తపుత్రుడు అనడాన్ని ఆ పార్టీ అసలు తట్టుకోలేకపోతోంది. అప్పటికీ పవన్ సీబీఐ దత్తపుత్రుడు అంటామని హెచ్చరించారు. ఇపుడు అనేస్తున్నారు కూడా. అయితే ఇలాగే వార్ జరగాలని వైసీపీ కోరుకుంటోంది. వ్యూహాత్మకంగానే దత్తపుత్రుడు అన్న అంశాన్ని తెర మీదకు తెచ్చి కెలుకుతోంది. తాను బాబు దత్తపుత్రుడుని కాను అని పవన్ నిరూపించుకోవాలన్నది ఆ పార్టీ ఆలోచన.

అంటే రేపటి ఎన్నికల్లో పొత్తులు లేకుండా జనసేన ఒంటరిగా బరిలోకి రావాలి. అందుకే ఆ పార్టీ నేతలలో పౌరుషాన్ని పెంచుతున్నారు. ఈ ట్రాప్ లో జనసేన కూడా పడుతున్నట్లుగానే ఉంది. అందుకే బాబు దత్తపుత్రుడు అనగానే ఉలిక్కిపడుతోంది. ఇక జగన్ని సీబీఐ దత్తపుత్రుడు అన్నా ఆ పార్టీకి పోయేది ఏమీ లేదు. పైగా జగన్ సీబీఐ కేసులలో ఉన్న సంగతి ఏపీ జనాలకు ఏనాడో తెలుసు. అయినా ఆయన్ని గెలిపించారు.

దాంతో ఇపుడు శీల పరీక్ష అంతా జనసేన నేతలదే అవుతోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మరి కొంతకాలం సీబీఐ దత్తపుత్రుడు వర్సెస్ సీబీఎన్ దత్తపుత్రుడు టాపిక్ హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది. ఇంతకీ తాను ఎవరికీ దత్తపుత్రుడిని కాను అని పదే పదే పవన్ అంటున్నారు కానీ చంద్రబాబు కానీ టీడీపీ కానీ ఎందుకు మాట్లాడదు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ టోటల్ ఎపిసోడ్ లో వారికి రాజకీయ లాభం ఉంది కాబట్టే ఫుల్ సైలెంట్ అవుతున్నారు అని అంటున్నారు. దత్త తండ్రి అని బాబుని ఉద్దేశించి మాజీ మంత్రి కొడాలి నాని లాంటి వారు అన్నపుడు టీడీపీ కూడా రెస్పాండ్ కావాలి కదా అన్న మాట అయితే ఉంది. ఏదేమైనా ఇది రాజకీయం. ఇలాగే ఉంటుంది మరి.