Begin typing your search above and press return to search.

త్వరలో జ‌న‌సేన పార్టీ ప‌త్రిక‌...ప‌వ‌న్ సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   6 Jun 2019 4:59 PM GMT
త్వరలో జ‌న‌సేన పార్టీ ప‌త్రిక‌...ప‌వ‌న్ సంచ‌ల‌నం
X
అధికారంలోకి రావడానికి తెలుగు రాష్ట్రాల నేతలు 2007 నుంచి ఒక ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. వైఎస్ సాక్షి పత్రికను ప్రారంభించడం అది వైఎస్ కు, జగన్ కు ఉపయోగపడటం - కేసీఆర్ నమస్తే తెలంగాణను ప్రారంభించడం అది సక్సెస్ కావడం - తెలుగుదేశానికి సానుకూల పత్రికలు ఉండటం వంటి నేపథ్యంలో పవన్ కొత్త ఆలోచన చేశారు. తన పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లాలంటే పత్రిక అవసరం అని డిసైడ్ అయ్యారు. అంతేకాదు - ప్రారంభిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే ఇది పార్టీ నడిపే పక్ష పత్రిక. దినపత్రిక కాదు.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ - లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఊహించ‌న రీతిలో దారుణ ప‌రాజ‌యం పాలైన విషయం తెలిసిందే. చాలా చోట్ల నోటాతో పోటీ పడింది. కేవలం ఒక్కటంటే ఒక్క సీటు గెలిచింది. ఈ నేపథ్యంలో జనసేనాధిపతి వ్యూహాన్ని మార్చారు. చాలా త్వరగా ఓటమి నుంచి కోలుకుని ముందుకెళ్తున్నారు.

తాజాగా జ‌న‌సేన అధినేత తొలిసారి పార్టీ పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌భ్యులు - పార్టీ ముఖ్య‌నేత‌ల స‌మావేశం అయ్యారు. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి ఓటు వేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త తెలుపుతూ జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున తీర్మానం చేశారు. అనంత‌రం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. ఓటు వేసిన వారికి కృతజ్జత తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మిని ఓట‌మిగా గాక ఒక అనుభ‌వంగా తీసుకుంటున్నామ‌ని అన్నారు. పార్టీ త‌ర‌ఫున ప‌త్రిక తీసుకురానున్న‌ట్లు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించారు.

కేవలం నాలుగేళ్ల క్రితం పుట్టిన జ‌న‌సేన పార్టీకి ఇన్ని ల‌క్ష‌ల మంది ఓటు వేశారంటే అది విజ‌యంగానే భావిస్తున్నట్లు పవన్ వెల్లడించారు. జనసేన ఎదగకుండా కొన్ని శ‌క్తులు బలంగా ప‌ని చేయ‌డం వల్లే ఊహించిన విజయం దక్కలేదన్నారు. పార్టీకి బ‌లమైన క్యాడ‌ర్ ఉంది. భ‌విష్య‌త్తులో గొప్ప ఫలితాలు సాధించడానికి ఈ కేడర్ చాలు. పార్టీ కోసం అందరూ ఒకతాటిపైకి వచ్చి - ఒకే మార్గంలో ముందుకు నడవాలి. ఈ ఎన్నికలు మనకు ఎన్నో మంచి విషయాలను నేర్పాయి.

దృడ‌మైన సంక‌ల్పంతో పార్టీ కోసం ప‌ని చేసే వారు మాత్రమే నాకు కావాలి. అలాంటి వారు కొందరు అయినా చాలు అని పవన్ వ్యాఖ్యానించారు. పార్టీలోని ప్ర‌తి ఒక్క‌నేత స్వీయ విశ్లేష‌ణ చేసుకోవాల‌ని - త‌మ శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను బేరీజు వేసుకుని కొత్త ప్రణాళికతో పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడవాలని సూచించారు.

పార్టీకి అనుకూల‌మైన ప‌వ‌నాలు వీచిన‌ప్పుడు ఆ ఫ‌లితాలు వేరుగా ఉంటాయ‌ని - మ‌న‌కు జ‌న‌బ‌లం ఉంది ఆ బ‌లాన్ని పార్టీ కోసం ఉప‌యోగించుకోవ‌డం పార్టీ నేత‌ల ముందున్న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం అని ప‌వ‌న్‌ సూచించారు.

పత్రిక వివరాలు

అయితే, జనసేన ప్రారంభిస్తున్నది దినపత్రిక కాదు - పక్ష పత్రిక. ఇది పార్టీ నడిపే పత్రిక. పార్టీ భావ‌జాలం - నిర్ణ‌యాలు - ప్ర‌ణాళిక‌లు కార్య‌క‌ర్త‌లు - ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌చేయ‌డానికి పార్టీ ఈ ప‌త్రిక‌ను తెస్తోంది. చివరి కార్యకర్తకు అధినేతకు ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చేయడానికి ఈ పత్రిక ఉపకరిస్తుంది.ఇందులో రాష్ట్ర‌ - దేశ విదేశాల‌కు చెందిన పాల‌సీ నిర్ణ‌యాలు - అభివృద్ది రంగాల‌కు చెందిన స‌మాచారం ఉంటుంది. మేధావులు - కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు వెల్ల‌డించ‌డానికి వేదిక అవుతుంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను కూడా వెలుగులోకి తెస్తుంది. ప‌త్రిక వ్యవహారాలు చూడటానికి ఒక క‌మిటీని నియ‌మించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. పత్రిక తొలి ఎడిషన్సె ప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయనున్నారు. ఆన్ లైన్ లో - ప్రింట్ లో ఇది లభ్యమవుతుంది.