Begin typing your search above and press return to search.

క‌త్తి ఎపిసోడ్ పై ప‌వ‌న్ మార్క్ రియాక్ష‌న్‌!

By:  Tupaki Desk   |   23 Jan 2018 5:07 AM GMT
క‌త్తి ఎపిసోడ్ పై ప‌వ‌న్ మార్క్ రియాక్ష‌న్‌!
X
నెల‌ల త‌ర‌బ‌డి వంద‌ల గంట‌ల పాటు టీవీ ఛాన‌ళ్ల‌లో చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌ల‌తో మామూలు ఇష్యూను ఎక్క‌డికో తీసుకెళ్లిన క‌త్తి మ‌హేశ్ ఎపిసోడ్ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. న‌న్ను చుల‌క‌న చేస్తూ.. ప‌వ‌న్ అభిమానులు ఇష్టారాజ్యంగా రియాక్ట్ అవుతుంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌టంటే ఒక్క ట్వీట్ చేసి.. క‌త్తి మ‌హేశ్ పై విమ‌ర్శ‌లు మానండి..సోష‌ల్ మీడియాలో పోస్టుల దాడి చేయ‌కండి.. అది అనైతికమ‌న్న ట్వీట్ ఎందుకు చేయ‌రంటూ డిమాండ్ల మీద డిమాండ్లు చేసిన తీరుపై ప‌వ‌న్ స్పందించార‌ని చెప్పాలి.

క‌త్తి కోరిక‌ను తీర్చిన ప‌వ‌న్‌.. తాజాగా చేస్తున్న‌ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో పార్టీ వ‌ర్గాల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌త్తి ఎపిసోడ్‌ ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

ప‌వ‌న్ ఏమ‌న్నారన్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

"మీరు చూశారు ఈ మ‌ధ్య కాలంలో.. ఎవ‌రికి జ‌ర‌గ‌నంత‌గా.. మాట‌ల దాడులు జ‌రిగాయి. ఎన్నో స‌మ‌స్య‌లు ఉండ‌గా న‌న్ను టార్గెట్ చేసిన విధానం నాకు అర్థ‌మైంది. రానివ్వ‌కూడ‌దు.. ఆలోచ‌న ముందుకు వెళ్ల‌కూడ‌దు.. వాట‌న్నింటిని తీసుకుంటాను. న‌న్ను ఎంత హింసించినా కానీ నాకు చాలా మొండిత‌నం ఉంది. చూసేందుకు సున్నితంగా క‌నిపిస్తాను కానీ చాలా మొండిత‌నం ఉంది. చాలా మొండివాడిని" అని వ్యాఖ్యానించారు.

త‌న ఆశ‌య సాధ‌న కోసం ఎంత‌కైనా సిద్ధ‌మ‌ని.. స‌ర‌దా కోస‌మో.. చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవ‌టం కోస‌మో కాదని.. ఆశ‌యాల కోసం ఎలాంటి స్థాయికైనా త్యాగాల‌కు సిద్ధ‌మైపోతానన్నారు. రాజ‌కీయాల‌కు సంబంధించి త‌న‌కు బ‌ల‌మైన విశ్వాసాలు ఉన్నాయ‌ని చెప్పారు.

"మీరు న‌న్ను ఇంత‌కాలం ఒక న‌టుడిగా చూశారు. వాస్త‌వానికి ఇప్పుడు నాకు చాలా ప్రైమ్‌. మంచి గ్రోత్ ఉంది. దాన్ని సైతం కోసం వ‌దులుకొని రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా. ఇలాంటి వేళ‌లో సినిమాను వ‌దిలేస్తున్నా" అని చెప్పారు. రెండున్న‌ర గంట‌ల్లో చాలా మంచిసినిమా చేయొచ్చని.. సామాజిక సందేశం ఇవ్వొచ్చని కానీ దాని ప్ర‌భావం ప్ర‌జ‌ల్లో చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌న్నారు. రెండున్న‌ర గంట‌ల సినిమాలో న‌వ్వించొచ్చు.. క‌న్నీళ్లు పెట్టించొచ్చు.. సందేశం ఇవ్వొచ్చు. రెండున్న‌ర‌ గంట‌ల త‌ర్వాత సినిమా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆ సీన్ బాగుంది.. ఈ సీన్ బాగుంద‌ని చెప్పుకుంటూ రోడ్డు మీద చెప్పుకొని ఇంటిక‌వెళ‌తారు. త‌ర్వాత సినిమాను వ‌దిలేస్తారు. సినిమాతో స‌మాజానికి ఒక గంట.. కొన్ని రోజులు ఆలోచ‌న ఉంటుందేమో. సినిమా కార‌ణంగా స‌మాజంలో మార్పు 0.1 శాతం మాత్ర‌మే తీసుకొస్తుందేమో. అదే విధానం రాజ‌కీయాల్లో ఉంటే మార్పు చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను" అని అన్నారు.

ఇప్పుడు క‌నిపించేవ‌న్నీ నిజ‌మైన క‌ష్టాల‌ని.. సినిమాల్లో విల‌న్లు తిడ‌తార‌ని..నిజ‌జీవితంలో దాడులు చేస్తార‌న్నారు. నిజ నీవితంలో తాను దేన్నైనా ఎదుర్కోవ‌టానికి సిద్ధంగా ఉంటాన‌న్నారు. త‌న‌కు సినిమాల కంటే కూడా రాజ‌కీయాలంటే ప్రాణంగా ప‌వ‌న్ చెప్పారు. మొత్తానికి క‌త్తి ఎపిసోడ్ మొత్తం త‌న‌ను టార్గెట్ చేసిందే త‌ప్ప‌.. మ‌రొక‌టి కాద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ త‌న తాజా రియాక్ష‌న్ తో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.