Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కూడా పాద‌యాత్ర‌కు రెడీ

By:  Tupaki Desk   |   10 July 2017 5:58 AM GMT
ప‌వ‌న్ కూడా పాద‌యాత్ర‌కు రెడీ
X
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫుల్ టైం పొలిటీషియ‌న్‌ గా మార‌నున్నారా? ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న ప‌వ‌న్ ఇందుకోసం పాద‌యాత్ర చేయ‌డ‌మే స‌రైన మార్గంగా భావించారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ - వచ్చే ఏడాది జనవరిలో జనంలోకి పూర్తి స్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంలో ఆయన పూర్తిగా నిమగమయ్యారని, రాష్ట్రంలో ఏకధాటిగా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీ ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ప‌వ‌న్ సైతం అదే భావ‌న‌లో ఉన్న‌ట్లు తెర‌మీద‌కు రావడం ఆస‌క్తిక‌రం.

విభిన్న‌మైన రాజ‌కీయ వేత్త‌గా త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన పార్టీ అధినేత ఇప్పటికే వినూత్న తరహాలో పార్టీ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపిక ప్ర‌క్రియ ద్వారా త‌న‌తో క‌లిసి వ‌చ్చే నాయ‌కుల‌ను ప‌వ‌న్ ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికే జనసేన ఎంపికలు పూర్తి చేయగా, రాయలసీమలో పార్టీ ప్రతినిధులు - అభిమానుల కోరిక మేరకు చేపట్టిన రెండో విడత ఎంపికల కార్యాక్రమం కూడా చివరి దశకు చేరుకుంది. తెలంగాణలో మాత్రం గ్రేటర్‌ హైదరాబాద్‌ లో ఎంపికలు పూర్తి చేయగా - మరో ఐదు జిల్లాల్లో ఈ నెలాఖరు నాటికి పూర్తి కానున్నాయి. వీటితో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పార్టీ నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కార్య‌క‌ర్త‌ల ఎంపిక పూర్త‌యిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి పార్టీ రాష్ట్ర - జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఏడాది జనవరి నాటికి పార్టీ నిర్మాణం పూర్తి చేసేలా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ ఎంపికలు పూర్తి కాగానే క్షేత్ర స్థాయిలో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, ఇవన్నీ పూర్తి కావడానికి కనీసం ఐదారు నెలల సమయం పడుతుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.మరోవైపు పార్టీ కోసం ఎలాంటి డొనేషన్లు తీసుకోమని ప్రకటించిన పవన్‌ పూర్తిగా సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతోనే కార్యక్రమాల్ని చేపడతానని ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం ఐదు నెలలైనా పట్టొచ్చంటున్నారు. ఒకసారి క్షేత్ర స్థాయిలో అడుగుపెట్టాక మళ్లీ విరామం రాకూడదనే అభిప్రాయంతో ఒప్పుకున్న సినిమాలతో పాటు పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. పైగా జనవరిలో మొదలు పెడితే ఏడాది పాటు ప్రజల్లో తిరగొచ్చని, అడపాదడపా వచ్చిపోతున్నారంటూ వస్తున్న విమర్శలను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని పవన్‌ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప‌వ‌ర్ స్టార్ పాద‌యాత్ర ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం అవుతుంద‌ని ఆయ‌న అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.