Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం:ప‌వ‌న్

By:  Tupaki Desk   |   18 May 2018 11:36 AM GMT
ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం:ప‌వ‌న్
X
జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 45 రోజుల పాటు చేప‌ట్ట‌బోతున్న బ‌స్సు యాత్ర షెడ్యూలును ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఈ నెల 20 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆ యాత్ర ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. మే 20 జులై మొదటి వారం వరకూ శ్రీకాకుళం.. విజయనగరం.. విశాఖపట్నం జిల్లాల్లోనే పవన్ యాత్ర సాగుతుంది. గ‌తంలో ప‌వ‌న్ స‌భల్లో....ప‌వ‌న్ ను కాబోయే సీఎం అంటూ...కార్య‌క‌ర్త‌లు - అభిమానులు నిన‌దించిన నేప‌థ్యంలో ప‌వ‌న్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను అధికారంపై ఆశ‌తో రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, ప్ర‌జాసేవ చేసేందుకు వ‌చ్చాన‌ని అన్నారు. సీఎం అని పిలిచినంత మాత్రాన ముఖ్య‌మంత్రి అయిపోన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు త‌న‌కు అవ‌కావ‌మిస్తే త‌ప్ప‌కుండా బాధ్య‌తాయుత‌మైన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాన‌ని అన్నారు. గంగవరం పోర్టు నిర్వాసితులతో మాట్లాడిన సందర్భంగా ప‌వ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌కు సీఎం ప‌దవిపై వ్యామోహం లేద‌ని ప‌వ‌న్ గ‌తంలో చాలాసార్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అదే విష‌యాన్ని ప‌వ‌న్ మ‌రోసారి స్పష్టం చేశారు. ప‌దే ప‌దే త‌న‌ను సీఎం అని పిలిచినందు వ‌ల్ల ఉప‌యోగం లేద‌న్నారు. ప్రజలు చాన్స్ ఇస్తే స‌ర్కార్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అన్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న‌ను అందిస్తానని పవన్ అన్నారు. సీఎం అంటూ నినాదాలు చేస్తే సీఎం కాన‌న్నారు. ప్ర‌జా సమస్యలను అర్థం చేసుకున్న తర్వాతే ఆ ప‌దవి చేప‌డ‌తాన‌ని చెప్పారు. రాజ‌కీయ నాయ‌కుల‌ స్వార్థం కోసం వారి కుటుంబాల బాగుకోసం ప్రభుత్వాలు పనిచేయ‌కూడ‌ద‌ని అన్నారు. ప్రజా సంక్షేమమే ప‌ర‌మావ‌ధిగా ప్ర‌భుత్వాలు పని చేయాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో చెల‌గాట‌మాడే హ‌క్కు ప్ర‌భుత్వాల‌కు లేద‌ని ప‌వ‌న్ అన్నారు. టీడీపీ - బీజేపీలు హామీలను నెరవేర్చలేక పోయినందునే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. తాను స‌మ‌స్య‌లు, బాధ్యతల నుంచి దూరంగా పారిపోయే వ్యక్తిని కాదన్నారు.