Begin typing your search above and press return to search.

మద్దతు.. బొకే ఇచ్చినంత తేలికకాదు పవన్ జీ!

By:  Tupaki Desk   |   20 Feb 2018 4:45 AM GMT
మద్దతు.. బొకే ఇచ్చినంత తేలికకాదు పవన్ జీ!
X
ముందు మీరు కనీసం ఒక్క సభ్యుడైనా స్పందించి.. అవిశ్వాసం పెట్టండి.. ఆతర్వాత సభలో స్పీకరు అడిగే సమయానికి దానికి కావాల్సిన మినిమం సభ్యుల మద్దతును నేను తీసుకువస్తా.. అని పవన్ కల్యాణ్ చాలా కాన్ఫిడెంట్ గా - ఇక లాక్ చేసుకోవచ్చునన్నంత రేంజిలో ప్రకటించారు. అందుకు ఆయనను మెచ్చుకోవాల్సిందే. అయితే పవన్ కల్యాణ్ కొన్ని పార్టీల జాబితాను చెప్పి.. వారి మద్దతు తీసుకువస్తా అని సెలవిచ్చారు. వాటిని ఓ సారి గుర్తు చేసుకుంటే.. మద్దతు అంత ఈజీ కాదేమో అనిపిస్తోంది.

ప్రధానంగా పవన్ మాట్లాడుతూ.. తెరాస ఎంపీ కవిత కూడా పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళనకు మద్దతు ఇచ్చారు - ఏపీ డిమాండులో అర్థముందని ఆమె పేర్కొన్నారు. తెరాసకు సభలో ఎక్కువ మందే సభ్యులున్నారు. వారి మద్దతును మనం తీసుకోవచ్చు అని వెల్లడించారు. అయితే విభజన హామీల అమలు కోసం, అందులో కూడా ఏపీ ప్రయోజనాలను లక్ష్యించి.. మోడీ సర్కారుపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తెరాస మద్దతు ఇస్తుందని అనుకోవడం పవన్ భ్రమ. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. ఆయన రాజకీయ అవగాహన రాహిత్యానికి మచ్చుతునక. తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఎన్డీయేలో సభ్య పార్టీగా అధికారిక ప్రకటన లేదు మినహా.. తతిమ్మా అన్ని రకాలుగానూ మోడీ దళంలోని ఒక సభ్య పార్టీగా మాత్రమే చెలామణీ అవుతోంది. మోడీని కేసీఆర్ కీర్తించడమూ - కేసీఆర్ పాలనను మోడీ బ్యాచ్ మొత్తం కీర్తించడమూ ఉభయతారకంగా నడుస్తూనే ఉంది. అలాంటప్పుడు తెరాస అవిశ్వాసానికి మద్దతిస్తుందా? ఇదో పెద్ద కామెడీ.

అలాగే 48 మంది సభ్యులున్న కాంగ్రెస్ మద్దతు కోసం రాహుల్ ను కలుస్తానని కూడా పవన్ చెప్పారు. రాహుల్ మద్దతు కూడా అంత ఈజీ ఏమీ కాదు. తాము ముందే 184 సెక్షన్ కింద చర్చకు నోటీసు ఇచ్చి ఉన్నాం అని.. దానికి అనుమతి రాకపోతే మాత్రమే అవిశ్వాసం సంగతి ఆలోచిస్తాం అని.. రాహుల్ అంటే గనుక.. పార్లమెంటు తిరిగి మొదలై కొన్ని రోజులు గడిచేదాకా ఆ సంగతి తేలదు. ఆ రకంగా పవన్ కలగంటున్నట్లు ముందే అవిశ్వాసానికి నోటీసు ఇచ్చేయడమూ.. పార్లమెంటు తొలిరోజునే దానికి సంబంధించి మద్దతు నిరూపించుకోవడమూ అనే ప్రక్రియ అసాధ్యం. ఇక పవన్ చెప్పిన మిగిలిన పార్టీలకు ఉన్న బలమంతా కలిపినా అవిశ్వాసానికి చాలకపోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాసం ఎవరు ప్రతిపాదించినా.. సభలో స్పీకరు అడిగే సమయానికి మద్దతు చూపించడం అనేది అసాధ్యం అనకూడదు కానీ.. పవన్ చెప్పినంత ఈజీ మాత్రం కాదని అర్థమవుతుంది. అందుకే అవిశ్వాసానికి మద్దతు అంటే బొకే ఇచ్చినంత ఈజీ కాదని పలువురు జోకులేసుకుంటున్నారు.