Begin typing your search above and press return to search.

పవన్ కు ఓ లెక్క.. ప్రపంచానికి మరో లెక్క ఉంటాయా?

By:  Tupaki Desk   |   12 Feb 2018 8:21 AM GMT
పవన్ కు ఓ లెక్క.. ప్రపంచానికి మరో లెక్క ఉంటాయా?
X
కొన్నేళ్ల కిందట వచ్చిన సంచలనాత్మక చిత్ర ‘ఛత్రపతి’ లో ఒక డైలాగు ఉంటుంది. ‘‘ఒట్టేసి ఒక మాట వెయ్యకుండా ఒక మాట చెప్పనమ్మా’’ అని!

ఇప్పుడు బహుశా భాజపా - తెలుగుదేశం పార్టీలు కూడా ఆ డైలాగును కాస్త బట్టీ పెట్టాలేమో. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన సొమ్ములు, వచ్చిన సొమ్ముల విషయంలో ఆ ప్రభుత్వాలను లెక్కలు అడుగుతున్నారు. ప్రభుత్వాలే లెక్కలు ఆయన చేతికి అందిస్తే.. అందులో ఎవరు నిజం చెబుతున్నారో.. ఎవరు అబద్ధం చెబుతున్నారో.. ఆయన నిర్వహణలో పనిచేసే నిజనిర్ధరాణ కమిటీ నిగ్గు తేలుస్తుందిట. ఇదీ పవన్ ప్రణాళిక. అయితే.. ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ పైన చెప్పిన డైలాగును ఉదాహరించి.. ‘‘పవన్ అడిగితే ఒకలెక్క.. ప్రపంచానికి మరో లెక్క చెప్పడం లేదు బాసూ’’ అని సెలవిస్తాయేమో!!

నిధుల కేటాయింపులకు సంబంధించి.. బడ్జెట్ ప్రతిపాదనలను సభలో సమర్పించిన నాటినుంచి.. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య సూచనప్రాయంగా ఉన్న ప్రతిష్టంభన విరాడ్రూపం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు ప్రభుత్వాలు నువ్వు ద్రోహం చేశావంటే.. నువ్వు తప్పుడు లెక్కలు ఇచ్చావంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు వేసుకోవడంతోటే కాలం గడచిపోతోంది. అసలు రాష్ట్రానికి స్పష్టమైన మేలుచేయగల ప్రత్యేకహోదా వంటి అంశాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ మినహా ఇప్పటికీ ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్... మళ్లీ తెరమీదికి వచ్చారు. ఈసారి తనగొంతు సరిపోవడం లేదని.. మేధావుల గొంతులు కూడా కలుపుకున్నారు. ప్రస్తుతానికి ఉండవిల్లి అరుణ్ కుమార్ - జేపీ ఆయన జట్టులో ఉన్నారు.

ఇంతకూ పవన్ చెబుతున్నది ఏంటంటే.. ప్రభుత్వాలు తాము చెబుతున్న వివరాలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను ఆయనకు 15వ తేదీలోగా ఇవ్వాలిట. ఆ తరువాత ఈ సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఆ కాగితాలను పరిశీలించి.. రెండు ప్రభుత్వాల్లో అబద్ధం ఎవరు చెబుతున్నారో తేలుస్తారట. నిజానికి రెండు ప్రభుత్వాలు కొన్ని నెలలుగా.. తము అంతా ఇచ్చేశాం అని కేంద్రం, అన్నీ పెండింగే అని ఏపీ ఎవరికి వారు మీడియాకు లీకులు ఇస్తూ డాక్యుమెంట్లు - నోట్ లు - లేఖలు విడుదల చేస్తూ పోతున్నారు. వాటిని మించి.. ఇప్పుడు కొత్తగా పవన్ కల్యాణ్ అడిగాడు గనుక.. వారేం కొత్త వివరాలు తయారు చేయగలరు? అని జనం విస్తుపోతున్నారు. పవన్ కేవలం ఈ వ్యవహారాన్ని సాగతీయడానికే ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలతో కసరత్తు చేస్తున్నారని పలువురు అంటున్నారు.