Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకు రీసెర్చ్ చేసి మాట్లాడే అధినేత దొరికాడు

By:  Tupaki Desk   |   10 Nov 2016 3:32 PM GMT
ఎన్నాళ్లకు రీసెర్చ్ చేసి మాట్లాడే అధినేత దొరికాడు
X
తెలంగాణ రాష్ట్రానికి ఏపీకి చెందిన నేతల మధ్య పెద్ద వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదేం ఖర్మో కానీ.. తెలంగాణకు చెందిన నేతల్లో చాలామంది ఉద్యమాలు.. పోరాటాల బ్యాక్ గ్రౌండ్ లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు కనిపిస్తారు. రాజకీయం వారికి మొదటి నుంచి అలవాటన్నట్లుగా ఉంటారు. కానీ.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. రాజకీయాన్ని వృత్తిగా తీసుకునే వారు పెద్దగా కనిపించరు.

పారిశ్రామికవేత్తలు.. వ్యాపారవేత్తలే ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తారు. వందలాది కోట్ల రూపాయిలు సంపాదించేసి.. సంఘంలో సేవ చేయటానికి సమయం ఆసన్నమైందంటూ రాజకీయ పార్టీల్లోకి వచ్చేస్తారే తప్పించి.. ప్రజలకు ఏదో చేయాలన్న తపన వారిలో కించిత్ కనిపించదు. ఇలాంటి వారిని తిరస్కరించే పని చేయని సీమాంధ్రుల చేసిన తప్పునకు విభజన లాంటి శిక్ష అనుభవించాల్సిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అయినప్పటికీ ఏపీ ప్రజల్లో మార్పు రాలేదన్న విమర్శ ఉంది. ఇప్పటికి రాజకీయ నేతలుగా అవతారం ఎత్తిన పారిశ్రామికవేత్తలకే ఆదరణ కనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల సీమాంద్రులకు జరిగే నష్టం ఏమిటంటే.. ప్రజలకు జరిగే నష్టాల గురించి వివరించే వారు కనిపించరు. ఒకవేళ.. సీమాంధ్రకు ఏదైనా నష్టం వాటిల్లేలా నిర్ణయం తీసుకుంటే.. దాని గురించి చెప్పేవారెవరూ ఉండరు. నిజానికి ఈ కారణం వల్లే విభజన సమయంలో.. ఏపీకి ఏం కావాలో అడిగే నాథుడు లేకుండా పోయారు. విబజన అనివార్యమని.. ఆ విషయాన్ని గుర్తించి.. ఏపీకి ఏం కావాలో కోరుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న నిజాన్ని చెప్పే వారే లేకుండా పోయారు.

దాని కారణంగానే విభజన తర్వాత ఎన్ని సమస్యలు ఎదురుకావాలో అన్ని సమస్యలు ఎదురుకావటంతో పాటు.. పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఏపీ మునిగిపోయే దుస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురంలో నిర్వహించిన సభ ద్వారా ఒక విషయం స్పష్టమైంది. తొలిసారి ఒక రాజకీయ అధినేత.. ప్రజల గురించి.. ప్రజలకు జరిగే నష్టం గురించి నిపుణులతో.. విద్యావంతులతో.. మేధావులతో చర్చలు జరిపి.. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు ఏమిటన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారని చెప్పాలి. కేంద్రం ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ కారణంగా ఏపీకి ఏం ఒరిగిందన్న విషయాన్ని పవన్ వివరించిన తీరు చూస్తే.. ఆయన ఈ ఇష్యూ మీద భారీగా రీసెర్చ్ చేసినట్లు.. పలువురుప్రముఖులతో చర్చలు జరిపినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. పవన్ కానీ ఇదే తీరులో ముందుకు వెళితే.. చంద్రబాబు.. జగన్ లాంటి వారు సబ్జెక్ట్ మీద మరింత ఫోకస్ రావాల్సిన అవసరం రాక తప్పదేమో..?
..
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/