Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ ప‌వ‌న్ !

By:  Tupaki Desk   |   25 July 2018 11:53 AM GMT
జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ ప‌వ‌న్ !
X

మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. నాలుగు నెల‌ల‌కోసారి ట్వీట్ చేసే ప‌వ‌న్ వంటి వారు కూడా రాజ‌కీయాల్లో ఉన్నార‌ని...వారు చేసే విమ‌ర్శ‌ల గురించి మాట్లాడుకోవాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని జ‌గ‌న్ అన్నారు. ఈ వ్యాఖ్య‌లతో పాటు త‌న‌పై జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ప‌వ‌న్ స్పందించారు.

తాను బలమైన వ్యక్తిని కాబ‌ట్టే తనను జగన్ విమర్శిస్తున్నారని పవన్ అన్నారు. జగన్ కే అంతుంటే.. నిజాయితీపరుడినైన తనకు ఎంతుండాలని పవన్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగం రాసింది చంద్రబాబో.. జగనో.. కాదని విమ‌ర్శ‌లు గుప్పించారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నందుకే త‌న‌పై జగన్ - బీజేపీ - టీడీపీ విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.

సామాజిక మార్పుకోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని - త‌మ స్వార్థం కోసం కొంద‌రు ప్ర‌జ‌ల మ‌ధ్య తగాదాలు పెట్టి విభజించి పాలిస్తున్నారని అన్నారు. అటువంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవడానికే జనసేనను స్థాపించాన‌ని అన్నారు. రాజకీయాలకు శ్రమ - ఓపిక చాలా అవసరమని పవన్ అన్నారు. రాష్ట్రంలో మూడో ప్ర‌త్యామ్నాయం అవ‌స‌రం ఉంద‌ని, అందుకే ఉద్దానం - ఉండ‌వ‌ల్లి వంటి స‌మ‌స్య‌లు వెలుగులోకి వ‌చ్చాయన్నారు. వేల‌ కోట్లు డ‌బ్బులు ఉంటే అహ‌కారం - త‌ల‌పొగ‌రు పెరుగుతాయ‌ని అన్నారు. స‌హ‌నానికి కూడా హ‌ద్దుటుంద‌ని - బెదిరించి - గూండాయిజానికి దిగితే భ‌య‌ప‌డొద్ద‌ని - ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. జ‌న‌సైనికులు తెచ్చిన స‌మాచారంతో ఏపీ భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని అన్నారు. రాజ‌కీయాల‌కు వేల‌ కోట్లు అవ‌స‌రం లేద‌ని - ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చిత్తశుద్ధితో పోరాడితే ప్రజలు మ‌న‌వెంటే ఉంటార‌న్నారు.