Begin typing your search above and press return to search.

పబ్ రేప్ కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   6 Jun 2022 1:30 PM GMT
పబ్ రేప్ కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్
X
హైదరాబాద్ అమ్మేషియా పబ్ నుంచి మైనర్ బాలికను తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ఘటనపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఘాటుగా స్పందించారు. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోనూ తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మే 28న అమ్మేషియా పబ్ లో గెట్ టు గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన అనంతరం బాలికను ఇంటివద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపగా ఆమె నుంచి పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. తనపై నిందితులు ఐదుగురు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది.

మరోసారి బాలిక నుంచి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ప్రజాప్రతినిధుల పిల్లలు కావడంతోనే కేసును నీరుగారుస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఖండించారు. ఈ కేసులో ఎవరికీ మినహాయింపులు లేవని తెలిపారు.

ఇప్పటికే అమ్మేషియా పబ్ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేసిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. నిందితుల అరెస్ట్ ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు మీడియాను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నిందితుల వైపా? బాధితుల వైపా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని భయపెట్టండి అని అన్నారు.

విచారణ పూర్తికాకముందే కొందరికీ క్లీన్ చిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్ గా ఉంచారని ప్రశ్నించారు. అధికార పార్టీ, డబ్బున్న వారి పిల్లలనే ఫొటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు. నిందితులను ఎందుకు అరెస్ట్ చూపడం లేదని ప్రశ్నించారు.

తాజాగా పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి చేయకుండా ఉండాలంటే ముందుగా కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. అలా అయితేనే నిందితుల్లో భయం వస్తుందని.. ఇలాంటి నేరాలు చేయరని పవన్ కళ్యాణ్ అన్నారు.