Begin typing your search above and press return to search.

రిజర్వేషన్ల అంశం.. కాపు నేతకు పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌!

By:  Tupaki Desk   |   2 Jan 2023 7:33 AM GMT
రిజర్వేషన్ల అంశం.. కాపు నేతకు పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌!
X
కేంద్రం ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అడ్డుకుని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన వైద్యానికి నిరాకరించి దీక్ష కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్షకు దిగిన మాజీ మంత్రి హరిరామజోగయ్యకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో హరిరామ జోగయ్య దీక్ష చేస్తున్నారని.. ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని అని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

కాపు రిజర్వేషన్ల కోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో డిసెంబర్‌ 30 వరకు జగన్‌ ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. ఆలోగా కాపులకు గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో పోలీసులు ఆయనను దీక్ష విరమించాలని కోరారు. అయితే జోగయ్య వినిపించుకోకపోవడంతో 400 మంది పోలీసుల భద్రత మధ్య జనవరి 1 రాత్రి ఆయనను పాలకొల్లులో పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా ఆయన కూర్చున్న వీల్‌ చైర్‌ తో సహా అంబులెన్సు ఎక్కించారు. అక్కడ నుంచి ఆయనను అంబులెన్సులో ఏలూరు ఆస్పత్రికి తరలించారు. మీడియాను సైతం జోగయ్య ఇంటిలోకి పోలీసులు అనుమతించలేదు.

దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే హరిరామ జోగయ్య తన దీక్ష కొనసాగిస్తున్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్‌ చేస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ అమలు చేసే వరకు తన దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. అదేవిధంగా జీవో నెంబర్‌ 60 రద్దు చేయాలని.. యాక్ట్‌14, 15 అమలులోకి తీసుకు రావాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

జనవరి 1 సాయంత్రం ఏడు గంటలకి తనను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారని జోగయ్య ప్రకటించారు. అప్పటి నుంచి తాను నిరాహార దీక్షలో ఉన్నానని వెల్లడించారు. కాపు రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై స్పందన లేదన్న ఆయన కాపు రిజర్వేషన్ల సాధన కోసం చావడానికైనా సిద్ధమంటూ ప్రకటించారు.

మరోవైపు.. దీక్షలో ఉన్న హరిరామ జోగయ్య షుగర్‌ లెవెల్స్‌ పడిపోయాయని ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెబుతున్నారు. అలాగే బీపీ కూడా పెరిగిందని వెల్లడించారు.

మరోవైపు జోగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పశ్చిమగోదావరి జిల్లాలో హైటెన్షన్‌ వాతావరణ ఏర్పడింది. దీక్ష భగ్నం చేసేందుకు జనవరి 1న ఆయన ఇంటి దగ్గర 400 మంది పోలీసులు మోహరించారు. ఏలూరు, మచిలీపట్నం, నరసాపురం, పాలకొల్లు డీఎస్పీలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.

కాగా కాపులకు గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ఎత్తేసింది. పైగా కాపుల రిజర్వేషన్‌ తమ చేతుల్లో లేదని.. అది కేంద్రమే నిర్ణయించాలని ప్రకటించింది. అయితే ఇటీవల పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందిస్తూ ఆయా కులాలకు రిజర్వేషన్లు కల్పించడమనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యకు పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య స్థితిపై వైద్యులను వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోగయ్యతో చర్చలు జరపాలని విన్నవించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.