Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

By:  Tupaki Desk   |   15 Nov 2021 5:30 PM GMT
జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు
X
ఏపీలో ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ప్రభుత్వ పథకాలపై పవన్ కళ్యాణ్ వరుసగా చేసిన 8 ట్వీట్లు వైరల్ అయ్యాయి. ‘అప్పుడు అమ్మ ఒడి.. ఇప్పుడు అమ్మకానికో బడి’ అంటూ ఆదివారం విమర్శలు చేసిన పవన్ .. సోమవారం కూడా ట్విట్టర్ వేదికగా వైసీపీని ఉద్దేశించి ఓ పోస్టు పెట్టాడు.

కర్ణాటక మంగుళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి అందరికీ స్ఫూర్తి దాయకమని పవన్ ప్రశంసించారు. హజబ్బా అనే పండ్ల వ్యాపారి తన సొంత డబ్బుతో స్కూలు నిర్మించాడని.. ఇప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు అని పవన్ తెలిపారు. అలాంటి వ్యక్తి దేశంలోనే నాలుగో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీ అవార్డు పొందారని పవన్ గుర్తు చేశారు.

ఒక విదేశీయుడు నారింజ పండ్లు కిలో ఎంత అని ఇంగ్లీష్ లో అడిగిన ప్రశ్న అతడి స్ఫూర్తికరమైన జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పిందన్నారు. తనకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడంతో హజబ్బా తిరిగి సమాధానం చెప్పలేకపోయారని.. భవిష్యత్ తరాలు తనలా కాకూడదనే భయంతోనే తన గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలను ఆ పండ్ల వ్యాపారి ప్రారంభించారని ట్వీట్ లో పేర్కొన్నారు.

పండ్ల అమ్మకాలతోపాటు ఇతరుల నుంచి సేకరించిన విరాళాలతో స్కూల్ ను ఏర్పాటు చేశారని.. అలాంటి వ్యక్తి ఎంతో కష్టపడి స్కూల్ నిర్మిస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం ఎయిడెడ్ స్కూళ్లను మూసివేస్తుందని పవన్ ఎద్దేవా చేశారు.