Begin typing your search above and press return to search.

నేను రెడీ జ‌గ‌న్‌..అవిశ్వాసం పెట్టేద్దాం : ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   19 Feb 2018 2:14 PM GMT
నేను రెడీ జ‌గ‌న్‌..అవిశ్వాసం పెట్టేద్దాం : ప‌వ‌న్‌
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ విసిరిన స‌వాల్‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. అవిశ్వాస తీర్మానంపై వైఎస్ జగన్ సవాల్‌ను స్వీకరించిన పవన్ కల్యాణ్ ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌పై స్పందించారు. అవిశ్వాసం క్రెడిట్ త‌న‌కు అవసరం లేదని వైసీపీయే ఆ క్రెడిట్ తీసుకోవచ్చున‌ని జనసేన అధినేత తెలిపారు. `మీరు అవిశ్వాస తీర్మానం పెడితే 50 కాదు 80 మంది వరకు మద్దతిస్తారు` అని పవన్ కల్యాణ్ తెలిపారు.


ప్రత్యేక హోదా కోసం ఎవరినైనా కలుపుకుని పోవడానికి.. ఎవరు ఏ సలహా ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామ‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొంటూ రాజీనామాలకే కాదు, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా మేం సిద్ధమే అని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ మాట్లాడి ఆయనకు జ్ఞానోదయం అయ్యేలా చేయాల‌ని, ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడదామ‌ని ఇందుకు ప‌వ‌న్ ఒప్పించాల‌ని కోరారు. దీనిపై ప‌వ‌న్ స్పందించారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ `జ‌గ‌న్ ద‌మ్ము - దైర్యం ఉన్న వ్యక్తి. మీరు అవిశ్వాసం పెట్టండి. మీ వెన‌క నేను ఉంటాను. పార్ల‌మెంటు స‌మావేశాల మొద‌టిరోజే అవిశ్వాసం పెట్టాలి. అవిశ్వాసం పెడితే చ‌ర్చ జ‌రుగుతుంది` అని ఆయ‌న పేర్కొన్నారు.

ఒక్క ఎంపీ అయినా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చున‌ని పేర్కొన్న పవన్ కల్యాణ్ అవ‌స‌ర‌మైతే మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని తెలిపారు. తాను ఢిల్లీవెళ్లి అన్ని పార్టీలతో మాట్లాడతాన‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, స‌మాజ్ వాది పార్టీ ర‌థ‌సార‌థి అఖిలేష్ యాద‌వ్ స‌హా ముస్లింలీగ్, టీఆర్ఎస్‌, ఆప్‌ మద్దతు కోరదామ‌ని ప్ర‌తిపాదించారు. మార్చి 4వ తేదీన నేను ఢిల్లీకి వస్తాను. అందరు ఎంపీల మద్దతు కూడగడతానని వెల్ల‌డించారు. ఒక‌వేళ వైఎస్ జ‌గ‌న్ అవిశ్వాసం పెట్ట‌క‌పోతే...టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెట్టాల‌న్నారు.