Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో ఆఖ‌రికి బాబునే బుక్ చేసిన ప‌వ‌న్‌?!

By:  Tupaki Desk   |   23 July 2020 3:30 PM GMT
అమ‌రావ‌తిలో ఆఖ‌రికి బాబునే బుక్ చేసిన ప‌వ‌న్‌?!
X
ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన రాజ‌ధాని నిర్మాణ గురించి జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దీర్ఘ‌కాలం త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇటు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను, అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడ‌ను రాజ‌ధాని విష‌యంలో టార్గెట్ చేశారు. టీడీపీది సింగపూర్ కాన్సెప్ట్ అయితే వైసీపీది అభివృద్ధి వికేంద్రీకరణ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాజధాని విభజన, సీఆర్డీఎ రద్దు బిల్లులు శాసనసభ ఆమోదించింది కానీ శాసన మండలి ఆమోదించలేదని పేర్కొన్న ప‌వ‌న్ అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వీటి ఆమోదానికి గవర్నర్‌కు పంపించ‌డం స‌రికాద‌ని అన్నారు.

అమ‌రావ‌తిలో రాజధాని లేదని పేర్కొంటూ మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణ మీద తాము అసెంబ్లీలో తీర్మానం చేసినందున మండలిలో ఆమోదం అవసరం లేదని సాంకేతిక కార‌ణాలు పేర్కొంటూ ఆ బిల్లులను గవర్నర్‌కు పంపించడం ఏమిట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ``అందరి స‌హ‌కారంతో అభివృద్ధి చెందిన‌ హైదరాబాద్ లాంటి నగరం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు లేదు. కచ్చితంగా ఒక క్యాపిటల్ కావాలి. ఆ రోజున మోడీతో మేమంతా ఉన్నప్పుడు చక్కటి రాజధాని కావాలి అన్న ప్రస్తావన వచ్చింది. మోడీ మాట్లాడుతున్నప్పుడు గాంధీనగర్ ఉదహరించారు. రెండు, మూడు వేల ఎకరాల్లో చక్కటి, బలమైన రాజధాని చేసుకోవచ్చు... కాలక్రమంలో అభివృద్ధి అవుతుంది అన్నారు. అంతా దానికి ఆమోదం తెలిపాం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లు చేసిన తప్పు ఏంటంటే.. అది వాళ్ల విధాన నిర్ణయమా, ఆలోచించి చేసిందా, కారణాలు ఏమైనప్పటికీ భారీ స్థాయిలో భూమి సేక‌రించారు. అంత భూమిని సేకరించడంపై నాటి నుంచి నేను ఒకటే చెబుతూ వస్తున్నాను.`` అని పేర్కొన్నారు. ``రైతుల దగ్గర నుంచి ఇన్ని భూములు తీసుకుని సింగపూర్ తరహా రాజధాని కట్టాలంటే, సింగపూర్ లాంటి వ్యవస్థ ఉండాలి, లీక్వాన్ యూ లాంటి వ్యక్తి ఉండాలి అంద‌రినీ సింగపూర్ వారీగా ట్రీట్ చేయగలిగారు. అలాంటి ఉన్నతమైన మనసు. అలాంటి రాజకీయ విధానం ఇక్కడ మనకి లేదు.`` అంటూ చంద్ర‌బాబుపై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు.

రాజకీయ విధానం లేకుండా సింగపూర్ తరహా రాజధాని అంటే కాన్సెప్ట్ అమ్మేయడానికి చేశారని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``ఆ స్థాయిలో భూములు తీసుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది, అభివృద్ధి చేయనప్పుడు కష్టం అవుతుంది అని మొద‌టి నుంచే చెప్పాను. ఆ రోజున అందరూ మద్దతు తెలిపారు. ఈ రోజున రైతులు నష్టపోతున్నారు. రాజధాని రైతులకు మేం అండగా నిలబడతాం`` అని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``అభివృద్ధి అన్ని చోట్ల జరగాలి. కేవలం రాజధానులు విడగొట్టినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ఓ కాన్సెప్ట్ లాంటిదే. గతంలో టీడీపీ నాయకులు సింగపూర్ తరహా రాజధాని అని చెప్పి కాన్సెప్ట్ ఎలా అమ్మారో, ఈసారి అధికార వికేంద్రీకరణ అంటూ అలాంటిదే మరో కాన్సెప్ట్ అమ్మడం తప్ప, ప్రజలకు ఒక కల చూపడం తప్ప వాస్తవంలో అవేమీ రూపుదాల్చదు.`` అంటూ ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.