Begin typing your search above and press return to search.

మూడేళ్ల జగన్ పాలనను.. ‘వైసీపీ ప్రతిజ్ఞ’ పేరుతో పవన్ మాటల్ని విన్నారా?

By:  Tupaki Desk   |   15 March 2022 3:31 AM GMT
మూడేళ్ల జగన్ పాలనను.. ‘వైసీపీ ప్రతిజ్ఞ’ పేరుతో పవన్ మాటల్ని విన్నారా?
X
జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన ప్రసంగంలో విశేషాలకు కొదవ లేదనే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఘాటు విమర్శలతో పాటు.. తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీల్చమన్న కీలక ప్రకటన కూడా చేవారు. ఈ సందర్భంగా మూడేళ్ల జగన్ పాలనను కళ్లకు కట్టినట్లుగా చెప్పేందుకు వీలుగా.. ‘వైసీపీ ప్రతిజ్ఞ’ పేరుతో ఆయన చదివిన పాఠం ఇప్పుడు సంచలనంగా మారింది.

బహిరంగ సభలో పవన్ చేసిన ప్రసంగంలో మెరుపుగా మారిన ఈ ప్రతిజ్ఞ.. రాబోయే రోజుల్లో వైసీపీ వ్యతిరేకులు.. జగన్ ను తప్పు పట్టే వారికి ఈ ప్రతిజ్ఞ ఆయుధంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

తప్పు మీద తప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం.. విధ్వంసమే తమ విధానంగా మార్చుకుందన్న ఘాటు వ్యాఖ్యతో పాటు.. జగన్ సర్కారు దారుణాలకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు. ఇంతకూ పవన్ చదివి వినిపించిన వైసీపీ ప్రతిజ్ఞలో ఏముందన్నది చూస్తే..

‘‘ఆంధ్రప్రదేశ్‌ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. న్యాయవ్యవస్థను లెక్కేచేయం. పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం. రాష్ట్ర రహదారులను గుంతల మయంచేస్తాం.

ప్రజల వెన్నుపూసలు విరగొట్టేవరకు విశ్రమించం. పెట్టుబడుల్లో 50 శాతం వాటా లాక్కుంటాం. అన్నం పెట్టే రైతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం. ఇసుకను అప్పడంలా కరకరా నమిలేస్తాం. పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టుపెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలతో చిత్తుగా తాగిస్తాం.

మా వైసీపీ ఎంపీ అయినా సరే... ఎదురు తిరిగితే చితక్కొడతాం. ఒక్క చాన్స్‌తో ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లాం. ఇంకొక్క చాన్స్‌ ఇస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కుంటాం!’’ అంటూ విరుచుకుపడ్డారు.

జనసేన ఆవిర్భావ సభకే హైలెట్ గా మారిన వైసీపీ ప్రతిజ్ఞ పాఠం జనసైనికులకే కాదు.. తెలుగు ప్రజలందరికి మూడేళ్ల జగన్ పాలన ఎలా ఉందన్న విషయాన్ని సిం‘ఫుల్’గా చెప్పేశారన్న మాట వినిపిస్తోంది.

రోటీన్ కు భిన్నమైన తీరులో సాగిన ఈ ప్రతిజ్ఞ పాఠం.. వైసీపీ మీద సంధించిన పవన్ సరికొత్త అస్త్రంగా పలువురు అభివర్ణిస్తున్నారు.