Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుకు 48 గంటల టైమిచ్చిన పవన్

By:  Tupaki Desk   |   3 Jan 2017 6:46 AM GMT
ఏపీ సర్కారుకు 48 గంటల టైమిచ్చిన పవన్
X
రాజకీయ పార్టీ అధినేత అంటే.. ఆకట్టుకునే ప్రసంగాలు ఉండాలి. రాజకీయప్రత్యర్థులపై సటైర్లు వేయాలి. వీలైతే తిట్ల దండకం అందుకోవాలి. సమస్యను సమస్యగా చెప్పే కంటే.. రాజకీయం చేయాలి. భావోద్వేగాల్ని స్పృశించేలా చేయాలి. అన్యాయంపై అరుపులు వేయాలి. సమస్య పరిష్కారం కంటే.. పొలిటికల్ మైలేజీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సమకాలీన కాలంలో సగటు రాజకీయ పార్టీ అధినేత తీరు ఇంతకు మించి వేరుగా ఉండదు. అయితే.. ఇలాంటి వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భిన్నం. ఆయన సమస్య లోతుల్లోకి వెళతారు. దానికి పరిష్కారం మీద దృష్టి పెడతారు. ప్రభుత్వాల మొద్దు నిద్రల్ని ప్రశ్నిస్తారు.

వందలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేసి.. కార్యక్రమాలు నిర్వహించే ప్రభుత్వాలు.. వేలాది నిండు ప్రాణాలు ఉత్త పుణ్యమానికి పోతున్నా పట్టనట్లుగా వ్యవహరించిన పవన్.. తాజాగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఊపిరి ఆగిపోతున్న అమాయక మనుషులకు గొంతుకయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని కొన్నిప్రాంతాల సమూహమైన ఉద్దానంలో అంతుబట్టని రీతిలో అక్కడిప్రజలు కిడ్నీ వ్యాధులకు గురి కావటం.. పెద్ద ఎత్తున మరణించటం మామూలే. దీనిపై ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాలు దృష్టి సారించలేదు.

ఏపీ అంటే.. బాగా బలిసినోళ్లు ఉండే ప్రాంతంగా చెప్పుకునే దానికి భిన్నంగా.. ఉద్దానం లాంటి అంతుచిక్కని కారణాలతోవేలాది మంది మరణించటాన్ని సమస్యగా.. దీన్నో ఇష్యూగా చూపని ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని పవన్ ప్రశ్నించటమే కాదు.. 48 గంటల్లో కానీ ఏపీ సర్కారు స్పందించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. విభజన సమయంలో ఏపీ సమస్యల్ని జాతీయ స్థాయిలో చర్చించని నేతలపైనా.. వారి నిర్లక్ష్యాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఇన్ని వేల మరణాలపై ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నట్లు అని ప్రశ్నించారు.

ఉద్దానం ప్రజలు ఎదుర్కొంటున్నకిడ్నీ సమస్యలకు సాంత్వన కలిగించేందుకు రూ.100కోట్లు సరిపోతాయని పలువురు నిపుణులు సూచనలు చేస్తున్న వేళ.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎందుకు విడుదల చేయదని నిలదీసిన ఆయన.. ఏపీ రాష్ట్ర సర్కారు ఈ అంశంపై తక్షణమే కమిటీ వేయాలని.. కిడ్నీ వ్యాధులతో చనిపోయిన బాధిత కుటుంబాలకు సాయం చేసే కార్యక్రమాన్నిప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఐదుగురు సభ్యులతోకూడిన ఒక నిపుణుల బృందాన్ని నియమించిన పవన్ కల్యాణ్.. ఈ అంశంపై 15 రోజుల్లో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని.. దాన్ని తీసుకొని తానే స్వయంగా ఏపీ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు వెల్లడించారు. ఈసమస్య పరిష్కారం కోసం అవసరమైన ప్రజాప్రతినిధుల్ని తానే స్వయంగా కలుస్తానని చెప్పారు. ఉద్దానం అంశం ఒక విపత్తుగా అభివర్ణించిన పవన్.. ఇంత దారుణం జరుగుతున్నా.. ప్రభుత్వాలు.. ప్రజాప్రతినిధులు పట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఉదానం ఇష్యూ మీద ప్రభుత్వం కానీ స్పందించకుండా ఉండిపోతే.. తానే జాతీయస్థాయిలో దీన్నో ఉద్యమంగా మార్చనున్నట్లు ఆయన ప్రకటించారు. రెండు నెలల క్రితం తన దృష్టిని ఉద్దానం అంశం వచ్చినప్పుడు.. పార్టీ తరఫున ఒక బృందాన్ని పంపి.. ఈ ఇష్యూ మీద అధ్యయనం చేపట్టటంతో పాటు.. ఒక డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరి.. పవన్ డిమాండ్లపై ఏపీ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/