Begin typing your search above and press return to search.

ఓడిన చోట గెలుపు కోసం.. ప‌వ‌న్ సొంతిల్లు ప్లాన్!

By:  Tupaki Desk   |   31 May 2019 5:14 AM GMT
ఓడిన చోట గెలుపు కోసం.. ప‌వ‌న్ సొంతిల్లు ప్లాన్!
X
పేరుకు సొంతూరు చెప్పుకోవ‌టం.. రాజ‌కీయ ల‌బ్థి కోసం ఆ పేరును వాడుకోవ‌టం లాంటివి త‌మ‌కెంత చిరాకైన విష‌యాలో చెప్ప‌క‌నే చెప్పేశారు గోదావ‌రి జిల్లా వాసులు. పాల‌కొల్లును రాజ‌కీయ అవ‌స‌రాల‌కు మాత్ర‌మే తెర మీద‌కు తెచ్చే మెగా ఫ్యామిలీకి ఇప్ప‌టికే ఇవ్వాల్సిన రిట‌ర్న్ గిఫ్టులు ఇచ్చేశారు అక్క‌డి ప్ర‌జ‌లు. త‌మ‌లో ఒక‌టిగా ఉంటే ఓకే కానీ.. అందుకు భిన్నంగా త‌మ వైపు కూడా చూడ‌ని ప్ర‌ముఖులు.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టినంత‌నే.. త‌మ ప్రాంతం పేరు చెప్పేసి.. రాజ‌కీయ ల‌బ్థిని సొంతం చేసుకోవ‌టాన్ని ఎంత‌లా వ్య‌తిరేకించార‌న్న విష‌యం ఇప్ప‌టికే ప‌లుమార్లు స్ప‌ష్ట‌మైంది మెగా ఫ్యామిలీకి.

వెండితెర‌ను ఏలేసే మెగా ఫ్యామిలీ.. త‌మ సొంతూళ్ల‌కు చేసిందేమీ లేద‌న్న విమ‌ర్శ ఉంది. అయితే.. ఆ విమ‌ర్శ‌ను స‌రిదిద్దే ప్ర‌య‌త్నం ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. దాన్ని స‌రి చేసే బాధ్య‌త‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీసుకున్నట్లుగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో గాజువాక‌.. భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసిన ప‌వ‌న్.. అనూహ్యంగా రెండు చోట్ల ఓడిపోవ‌టం తెలిసిందే.

పేరుకు రెండుచోట్ల పోటీ చేసినా.. త‌న స్థిర నివాసం గాజువాక‌లో అన్న భావ‌న క‌లిగించేందుకు అక్క‌డ అద్దె ఇంటిని కూడా తీసుకున్నారు ప‌వ‌న్. అయిన‌ప్పటికీ గాజువాక ఓట‌ర్లు ప‌వ‌న్ ను రిజెక్ట్ చేశారు. ష‌రా మామూలే అన్న చందంగా భీమ‌వ‌రంలోనూ ఆయ‌న‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇక‌.. ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబును సైతం గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు.

గ‌తంలోనూ పాల‌కొల్లు నుంచి పోటీ చేసిన మెగాస్టార్ చిరుకు ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. దీంతో.. లోక‌ల్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకున్న ప‌వ‌న్.. త‌న వ్యూహాన్ని మార్చుకున్న‌ట్లుగా తెలుస్తోంది. తాను ఎక్క‌డైతే ఓడానో.. అక్క‌డి నుంచే గెలిచేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఆయ‌న భీమ‌వ‌రం షిఫ్ట్ కావాల‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. త‌న సొంతిల్లుతో పాటు.. ఓట‌రు కార్డు.. ఆధార్ కార్డును భీమ‌వ‌రం అడ్ర‌స్ కు మార్చుకొని లోక‌ల్ అన్న ఫీలింగ్ పెంచ‌టంతో పాటు.. రానున్న ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన శ‌క్తిగా మారేందుకు వీలుగా ఆయ‌న ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. మా సొంతూరు అంటూ అప్పుడ‌ప్పుడు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పే దానికి భిన్నంగా.. తాను అక్క‌డే ఉండాల‌న్న ప‌వ‌న్ నిర్ణ‌యం ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంద‌న్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఈ స‌మాచారాన్ని జ‌న‌సేనాని ఎప్పుడు క‌న్ఫ‌ర్మ్ చేస్తారో చూడాలి.