Begin typing your search above and press return to search.

రాజధాని అమరావతి - పవన్ లో ఎంతో మార్పు

By:  Tupaki Desk   |   8 March 2022 6:19 AM GMT
రాజధాని అమరావతి - పవన్ లో ఎంతో మార్పు
X
రాజధాని రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించారు. హైకోర్టు తీర్పు ప్రకారం రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ప్రభుత్వం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అమరావతి నగరాన్ని నిర్మించాల్సిందే అన్నారు. కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేసేంతరకు పోరాటాలు చేస్తుండే ఉండాలన్న రైతులకు తాను అండగా ఉంటానని పవన్ ప్రకటించారు.

ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆధిర్భావ దినోత్సవ సభ జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సభ కూడా మంగళగిరిలోనే జరుగుతోంది. ఇందుకే పవన్ వ్యూహాత్మకంగా రాజధాని రైతులకు మద్దతు ప్రకటించినట్లే అనిపిస్తోంది.

సరే విషయం ఏదైనా రాజధాని రైతులకు పవన్ మద్దతు ప్రకటించటమే ఇక్కడ పాయింట్. ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పును ఆమోదించకుండా పక్కదారులు వెతుక్కుంటోందని మండిపడ్డారు.

కోర్టు తీర్పును గౌరవిస్తు నిర్దిష్ట కాలంలో ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేసేంత వరకు రైతులతో పాటు తాను కూడా పోరాటాలు చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం అమరావతి జేఏసీ, రైతులు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ది ఉన్నట్లు పవన్ చెప్పారు.

మొత్తం మీద రైతుల పోరాటంలో పవన్ కు ఇపుడు చిత్తశుద్ది కనబడినట్లుంది. ఎందుకంటే ఇదే పవన్ ఒకపుడు అమరావతిలో రాజధానిని వ్యతిరేకించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయటం కేవలం ఒక సామాజిక వర్గం కోసమే అని పవన్ ఆరోపించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రాజధాని రైతులకు మద్దతుగా రాజధాని గ్రామాల్లో ఒకసారి పర్యటించారు కూడా.

బలవంతంగా రైతుల నుండి భూములు లాక్కుంటే తాను చూస్తు ఊరుకోనని చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని పవన్ హెచ్చరించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో రాజధాని గ్రామాల్లో పర్యటించి హెచ్చరించిన పవన్ మళ్ళీ అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ ఇంతకాలానికి రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పటం గమనార్హం.