Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ప‌వ‌న్ లేఖ‌..ఆ విష‌యంపై రిక్వెస్ట్‌

By:  Tupaki Desk   |   3 Aug 2017 10:18 AM GMT
కేసీఆర్‌ కు ప‌వ‌న్ లేఖ‌..ఆ విష‌యంపై రిక్వెస్ట్‌
X
టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు విషయంపై నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ స్పందించారు. కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటి రోజులుగా వర్ణిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు రాసిన లేఖలని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ చలన చిత్ర కూటమి తరపున మీకు అప్పీల్ చేసుకుంటున్నామని పవన్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా 2000 కోట్ల రూపాయలు దాటిన సంతోషంలో.. ఒక దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఆనందంలో.. తెలుగు పరిశ్రమ వెలిగిపోతున్న సమయంలో .. మమ్మల్ని కమ్మిన గ్రహణం మాద‌క ద్రవ్యాల కేసు అని తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ లేఖలో పేర్కొంది. ఈ మాదక ద్రవ్యాల కేసుని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలుగు మూవీ ఇండస్ట్రీ లేఖలో పేర్కొంది.

డ్రగ్స్ కేసును ధైర్యంగా బయటకు తెచ్చిన తీరు, వివిధ రంగాల్లోని యువతను పెడదోవ పట్టిస్తున్న మత్తు భూతాన్ని తరిమికొట్టడంలో మీరు చూపిస్తున్న తెగువను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లేఖ రాసింది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి, పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పీ కిరణ్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు బూర్గుపల్లి శివరామకృష్ణ - మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా - తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కే మురళీకృష్ణారావు సంయుక్తంగా సీఎం కేసీఆర్‌ కు రాసిన లేఖను.. మీడియాకు విడుదలచేశారు. విలన్లు నెగ్గిన సినిమాలు తీయబోమని, సమాజం మంచిని గుర్తించేలా స్ఫూర్తినిచ్చే సినిమాలు తీస్తున్నామని పేర్కొన్నారు. కొందరు చేసిన తప్పులకు నేడు సినిమా పరిశ్రమ తలవంచుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సినీ పరిశ్రమకు గడిచిన 10 రోజులు చీకటి దినాలుగా పేర్కొంటూనే, ఇది పరిశ్రమకు ఒక కుదుపు వంటిదని, అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సినిమా వాళ్లపై ఇంతగా ప్రతిస్పందించడం బాధగా ఉందని, సమాజంలో ఎవరికైనా కష్టమొస్తే జోలె పట్టుకుని విరాళాలు సేకరించిన కథానాయకులున్న పరిశ్రమగా తెలుగు ఇండస్ట్రీకి పేరుందన్నారు. సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, విచారణను హుందాగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ వ్యవహారాన్ని సున్నిత అంశంగా పరిగణించాలని లేఖలో విజ్ఞప్తిచేశారు.

మ‌రోవైపు పబ్బులు, క్లబ్బులు, బార్లు అడ్డాగా డ్రగ్స్ దందా సాగుతున్నట్టు అనుమానించి నిర్వాహకులకు ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ బృందం హెచ్చరికలు జారీచేసింది. బానిసలుగా మారుస్తున్న డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తులు చేస్తూనే.. మాట వినకపోతే లైసెన్స్‌లు రద్దుచేస్తామని, కేసులు తప్పవని స్పష్టంచేస్తున్నది. ఇకనుంచి పబ్బులు - క్లబ్బులు - బార్లలో డ్రగ్స్ వినియోగిస్తే.. అందుకు వాటి నిర్వాహకులదే పూర్తి బాధ్యత అని సిట్ అధికారులు స్పష్టంచేశారు. అక్కడకొచ్చే వినియోగదారులను గమనించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని, ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా, ఉపయోగిస్తున్నట్టు తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగిస్తూ ఎవరైనా పట్టుబడితే వెంటనే నిర్వాహకుల లైసెన్స్‌లను రద్దుచేస్తామని హెచ్చరించారు.