Begin typing your search above and press return to search.

ఫ్రంట్ విఫ‌లం..బాబుకు వ‌య‌సు..లోకేష్‌ కు బుద్ధి స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   21 Nov 2018 12:32 PM GMT
ఫ్రంట్ విఫ‌లం..బాబుకు వ‌య‌సు..లోకేష్‌ కు బుద్ధి స‌మ‌స్య‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యేలా జనసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు చేస్తున్న కొత్త ప్ర‌య‌త్నం గురించి ఆయ‌న ఓ వైపు ఎత్తిపొడుస్తూ మ‌రోమైపు బాబు కుటుంబ రాజ‌కీయాల‌ను నిశితంగా విమ‌ర్శించారు. తమిళనాడులో పర్యటనకు జనసేన అధినేత పవన్‌ చెన్నై వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. జనసేన కార్యకర్తలు - పవన్ అభిమానులు తరలివచ్చి ఆహ్వానం పలికారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న మాటాడుతూ అందరికీ నమస్కారం అంటూ తమిళంలో ప్రసంగం ప్రారంభించారు. తన పేరు పవన్ కల్యాణ్ అని పరిచయం చేసుకున్న జనసేన అధినేత 2014లో జనసేన పార్టీని ప్రారంభించినట్టు చెప్పారు. 20 ఏళ్లు చెన్నైలో ఉన్నప్పటికీ తన తమిళ భాష విష‌యంలో ఏమైనా తప్పులుంటే క్షమించాలని పవన్ కోరారు.

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనలను ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గుర్తు చేశారు. చెన్నైలో ఆంధ్రులు ఎప్పుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగా లేరని.. కానీ ఏ తప్పు లేకపోయినా ఆంధ్రా ప్రజలు తెలంగాణలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో స‌రైన రీతిలో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌న్నారు. చంద్రబాబు విషయంలో కాసింత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆయన ఎప్పుడు స్నేహితుడుగా ఉంటారో.. ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని.. ఆయనతో ప్రయాణం ప్రమాదకరమన్నారు. టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండా.. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తే.. జరిగింది శూన్యమన్నారు. వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదని.. తాము స్వతంత్రంగా పోటీ చేయనున్నట్టు పవన్ స్పష్టం చేశారు. ఏపీలో త్రిముఖ పోటీ జరగనుందని చెప్పారు. చంద్రబాబుకు వయసు మళ్లితే ఆయన కుమారుడు లోకేష్‌కు జనం మద్దతు లేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడుతున్న మహాకూటమి విఫలమవుతుందన్నారు . 2019 సాధారణ ఎన్నికల నాటికి మూడో ఫ్రంట్ తయారు చేస్తామని చెప్పారు. దేశ రెండో రాజధానిని వెంటనే దక్షిణ భారతదేశంలో పెట్టాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. దక్షిణాది అంతా ఒక్కటవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.