Begin typing your search above and press return to search.

‘దేశం ముక్కలయ్యే మాట వద్దులే పవన్!’

By:  Tupaki Desk   |   17 Feb 2018 7:31 AM GMT
‘దేశం ముక్కలయ్యే మాట వద్దులే పవన్!’
X
సంయుక్త నిజనిర్ధారణ కమిటీ సమావేశం తొలిరోజు పూర్తయిన తర్వాత.. అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. అసలు అంశాలు పక్కదారి పడుతున్నాయని.. కొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయనే భావన కూడా కొందరిలో వ్యక్తం అవుతోంది.

వేర్పాటు వాద ప్రస్తావనతో పవన్ కల్యాణ్ మరింత అడ్డగోలుగా అసలు విషయాన్ని డైవర్ట్ చేసేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఉత్తరాది- దక్షిణాది దేశాల మధ్య అంతరాల విషయంలో ఆయన గళమెత్తుతున్నారు. దక్షిణ దేశం విడిపోవాలని కోరుకునే వరకు పరిస్థితులు విషమించవచ్చునని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆయన తరచూ ఇలాంటి ఉత్తర-దక్షిణ అంతరాల గురించి... సంకేతాలు ఇస్తున్నారు. కానీ.. ఇలాంటి వేర్పాటువాద భావజాలానికి సరైన ప్రాతిపదిక - సరైన పునాది లేదనే సంగతిని పవన్ గుర్తించాలి. పవన్ కంటె ఎక్కువగా సిద్ధాంతాలను - ఉత్తరాది వారు చేసే ద్రోహాలను చెప్పగల తమిళ ఉద్ధండ నాయకులు కూడా తమ సమ ప్రాధాన్యం కోసం పోరాటాలు చేశారే తప్ప.. దేశాన్ని ముక్కలు చేసే మాటెత్తలేదు.

ఇవాళ కొత్త కాదు...

దక్షిణ భారతదేశం పట్ల ఉత్తరాది నాయకుల చిన్నచూపు అనేది ఇవాళ కొత్త కాదు. శతాబ్దాలనుంచి ఈ వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ మరో ఇబ్బంది కూడా ఉంది. ఉత్తరాది వారు ఆర్యులు దక్షిణాది వారు ద్రావిడులు అనే జాతి పరమైన వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే వ్యత్యాసాలు జాతుల పుట్టిన నాటినుంచి ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా వ్యత్యాసాలుకొనసాగుతూ వచ్చాయి.

ఉత్తరాది వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యోద్యమ కాలంలో జస్టిస్ పార్టీ వంటివి గానీ, తమిళ సీమలో అపూర్వమైన నాయకుడు పెరియార్ స్థాపించిన ద్రవిడ కళగం గానీ వచ్చాయి. ద్రవిడ వాదనతో పోరాటాలు సాగించాయి. దక్షిణాది పట్ల వివక్ష ఉన్నదనే సంగతి కొత్తగా పవన్ కల్యాణ్ కనుగొన్న సంగతి కాదు. ఇలాంటి వివక్షకు వ్యతిరేకంగా ఇదివరకు పోరాడిన మహానుభావులు కూడా.. వేర్పాటు వాదం అనే ప్రస్తావన తీసుకురాలేదు. పవన్ ఈ విషయంలో ఒక వెర్రి ఆవేశంలో అత్యుత్సాహపు ప్రకటనలు చేస్తున్నారని అనిపిస్తోంది. వివక్షకు పరిష్కారం వేర్పాటు వాదమే అయ్యేట్లయితే గనుక మన దేశంలో ప్రతి పల్లె రెండు ముక్కలుగా విడిపోవాలి. ప్రతి నగరం అనేకానేక ముక్కలుగా విడిపోవాలి. వివక్షకు మందు విడిపోవడం కాదు అనే సంగతిని బాధ్యత గల నాయకులు తెలుసుకోవాలి. ప్రజాపోరాటాల పరమార్థం కూడా అదే.

వివక్ష అనేది ఉత్తరాది- దక్షిణాది మధ్య మాత్రమే కాదు.. దేశంలో ఎల్లెడలా ఉంది. అది అనేకానేక విశృంఖల రూపాల్లోకి విస్తరించి ఉంది. దీనికి పరిష్కారం.. విడిపోయి.. ఈ వివక్షా పూరిత వ్యవస్థకు దూరంగా పారిపోవడం కాదు. ఇదే వ్యవస్థలో ఉండి వివక్షను నిర్మూలించడం. పెరియార్ వంటి వారు కూడా అదే చేశారు.

పవన్ కు ఉత్తరాది నాయకుల పెత్తనం మీద బాగా ఆగ్రహం ఉంది. ఎంతగా ఉన్నప్పటికీ.. వేర్పాటు వాదం అనే మాట ఎత్తకుండా ఆ పాయింటు మీద ఎంత మాట్లాడినా బాగుంటుంది. కేవలం అయిదేళ్ల కాలపరిమితి ఉండే ఒక ప్రభుత్వం దుర్మార్గంగా వివక్షాపూరితంగా ఉంటే.. అందుకు పరిష్కారం వేర్పాటు వాదం అని అంటామా? పవన్ తనకు కులాలు మతాలు లేవని.. తనను తాను భారతీయుడిగా గుర్తించుకుంటానని అని తన ప్రసంగాల్లో చెబుతున్నప్పుడు ముచ్చటేస్తుంది. మనం దేశం ఒక్కటే యూనిట్ గా భావించాలి. రాష్ట్రాలు ముక్కలైనా అది కేవలం వివక్షను రూపుమాపగల ఒక పరిపాలన సౌలభ్యంగానే భావించాలి. అంతే తప్ప.. వివక్ష పేరు చెప్పి దేశాన్ని కూడా ముక్కలు చేసే మాటలు చెప్పడం - యువతరంలో అలాంటి ఆలోచనకు బీజం వేయడం విజ్ఞత కాదు.

పైగా ఈ వివక్ష- వేర్పాటు వాదం అనే అంశం మీద దక్షిణాది రాష్ట్రాల మధ్య, ఇక్కడి ప్రజల మధ్య ఒకే రకమైన భావజాలం కూడా లేదు. తమిళుల్లో ఉన్నంత ఉత్తరాది ద్వేషం కన్నడిగుల్లో ఉండదు. కేరళీయుల్లో ఇంకా తక్కువ. పైగా తమిళులు సాగించే జాతి పోరాటాలకు .. తమ తమ ఇతర వైషమ్యాల దృష్ట్యా కన్నడిగులు మద్దతు ఇవ్వరు. పైగా దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరపు అంచున ఉన్న తెలుగు రాష్ట్రాలు వేర్పాటు వాదం గురించి మాట్లాడితే.. అర్థం లేదనే అనుకోవాలి. ఎందుకంటే.. మనకంటే ఉత్తరాన (దిగువన) ఉన్న రాష్ట్రాలన్నీ మనకంటె ఎంతో ఆవేశంతో వేర్పాటు వాద స్వరాన్ని వినిపిస్తే తప్ప.. అలాంటిది సాధ్యం కాదు. కానీ ఈ అయిదు దక్షిణాది రాష్ట్రాల మీద ఏకరీతిగా పట్టున్న రాజకీయ పార్టీ లేదు. అయిదు రాష్ట్రాల మధ్య ఒక సమన్వయం లేదు. ఐక్యత లేదు. సారూప్య భావజాలం లేదు. ఇవేమీ లేకుండానే.. అటూ ఇటూ, ఉత్తరానికి- దక్షిణానికి మధ్యన ఉన్న తెలుగుప్రాంతం నుంచి పవన్ మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. పైగా ఎన్ని కష్టనష్టాలు ఉన్నప్పటికీ.. పోరాడి వాటిని పరిష్కరించుకోవాలే తప్ప.. నష్టాల గురించి పోరాటం చేయను అని అంటూ.. ఏకంగా వేర్పాటు వాదం పుడుతుందని హెచ్చరికలు చేయడం అర్థంలేని మాట.

పవన్ తన ప్రయత్నం ద్వారా పరిష్కారం సాధ్యం కాగల అంశాలను పక్కకు నెట్టేసి, తద్వారా జాతికి మేలు చేయగల అవకాశాలను విస్మరించి.. అత్యుత్సాహంతో పక్కదారి పట్టిపోతున్నారా అని కూడా ఆయన అభిమానులు కొందరు అనుకుంటున్నారు. ఆయన తన భావజాలాన్ని ఓసారి సమీక్షించుకుని.. కొన్నిటిని వదిలేసి.. కొన్నిటిని అలవరచుకుంటే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుంది.