Begin typing your search above and press return to search.

పవన్ సభా వేదికపై జగన్ అంతరంగమే!

By:  Tupaki Desk   |   15 March 2018 8:38 AM GMT
పవన్ సభా వేదికపై జగన్ అంతరంగమే!
X
పవన్ కల్యాణ్ గుంటూరు సభలో మాట్లాడిన మాటలు - తెలుగుదేశం పార్టీ పరిపాలన మీద చేసిన విమర్శలు అన్నీ కూడా ఎంతో కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలే. ఇన్నాళ్లూ చంద్రబాబునాయుడును నెత్తిన పెట్టుకుని ఊరేగిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు సమాజంలో పరిస్థితుల్ని అర్థం చేసుకున్న తర్వాత.. చంద్రబాబు గానీ - తెలుగుదేశం పార్టీ గానీ మునిగిపోయే పడవ అని అర్థం చేసుకున్నందు వల్లనే - వారితో పార్టనర్ షిప్ నుంచి బయటకు వచ్చి రాళ్లు వేస్తుండవచ్చు గాక.. కానీ.. తన పార్టీ ఆవిర్భావ సభావేదిక మీదనుంచి.. అచ్చంగా జగన్ ను కాపీ కొడుతున్నట్లుగా.. ఆయన ఇటీవలి ప్రసంగాల్లోని ఆరోపణలనే మళ్లీ గుదిగుచ్చి వినిపించారు.

పవన్ తన మొత్తం ప్రసంగంలో.. చంద్రబాబు పాలన గురించి జగన్ చేయని ఆరోపణలు గానీ.. రాష్ట్రానికి మంచి జరగడం కోసం.. జగన్ చేయని డిమాండ్లు - చేయని పోరాటాలు గానీ.. కనీసం ఒక్కటంటే ఒక్కటికూడా లేదు. తెలుగుదేశం అరాచక పాలన గురించి తొలినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతున్న విషయాలనే పవన్ మళ్లీ ఇక్కడ ఏకరవు పెట్టారు తప్ప.. తాను కనుగొన్న వాస్తవం ఒక్కటి కూడా లేకపోవడం విశేషం.

పాయింట్ల వారీగా చూసినప్పుడు.. పవన్ కల్యాణ్ చెప్పిన సంగతులివే.. అన్నీ జగన్మోహన్ రెడ్డి పోరాటాలను - విమర్శలను ప్రతిబింబించేవే.

1) ఎమ్మార్వో వనజాక్షి మీద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి దిగినప్పుడు - వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నాలు చేయగా.. పవన్ కల్యాణ్ అప్పుడు మౌనంగానే ఉండిపోయారు.

2) వైఎస్సార్ కాంగ్రెస్ లోకేష్ పాల్పడుతున్న అవినీతి వ్యవహారాలపై ఏడాదిన్నర కిందటే పుస్తకాన్ని ప్రచురించింది. ఇన్నాళ్లుగా పవన్ ఆ అవినీతిపాలనను పట్టించుకోలేదు.

3) పార్టీ సభ్యత్వం తీసుకోవడం కోసం.. మిస్డ్ కాల్ ఇవ్వండి అనే నినాదం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న విధానానికి దగ్గరగా ఉన్నదే.

4) ఇసుక మాఫియా కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ కొన్నేళ్లుగా పోరాడుతోంది. పవన్ కల్యాణ్ కనీసం చిత్తూరు జిల్లా ఇసుక మాఫియా బాధితులను పరామర్శించడానికి కూడా రాలేదు.

5) ప్రధాన ప్రతిపక్షంగా వైకాపా - స్పెషల్ ప్యాకేజీని ఛీ కొట్టింది.. హోదా కోసమే మడమ తిప్పని పోరాటం సాగిస్తోంది. పవన్ కొత్తగా చెప్పింది ఏముంది?

6) ఓటుకు నోటు వ్యవహారం పై పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? వైకాపా ఈ విషయంలోనూ కోర్టును కూడా ఆశ్రయిచింది. ఇప్పడు మాత్రం పవన్ ఆ ప్రస్తావన తెచ్చారు.

పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అరాచక పాలన - లోకేష్ అవినీతి గురించి ఎప్పటినుంచో తెలిసే ఉంటుందని.. కాకపోతే ఇన్నాళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు వారితో డీల్ చెడినందునే ఇప్పుడే బయట పెడుతున్నట్లుగా ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే.. జగన్ ను అనుసరిస్తున్నట్లుగా పవన్ ప్రసంగాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.