Begin typing your search above and press return to search.

పీకే బ‌రిలోకి దిగుతున్నారండోయ్‌!

By:  Tupaki Desk   |   3 July 2017 5:02 AM GMT
పీకే బ‌రిలోకి దిగుతున్నారండోయ్‌!
X
టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్‌ గా అశేష అభిమానుల‌ను సంపాదించుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ ఇక రాజ‌కీయ రంగంలోకి దిగేస్తున్నారు. అదేంటీ... ప్ర‌జారాజ్యం పార్టీ పేరిట ఆయ‌న సోద‌రుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన రాజ‌కీయ పార్టీతోనే ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారుగా. అదీ కాకున్నా... అన్న పార్టీతో విభేదించి గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందే సొంతంగా జ‌న‌సేన పేరిట రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మేమిట‌నేగా మీ ప్ర‌శ్న‌? ప్ర‌జారాజ్యం పార్టీలో కాస్తంత యాక్టివ్‌ గానే రాజ‌కీయాలు నెర‌పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... నాడు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌లేదు. ఇక గ‌డ‌చిన ఎన్నిక‌ల కంటే ముందుగానే రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించిన ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేసింది కూడా లేదుగా.

ఇక తాజా ప‌రిస్థితికి వ‌స్తే... జ‌న‌సేన‌ను ప్ర‌క‌టించిన ప‌వ‌న్ ఇప్ప‌టికీ పార్ట్ టైం పొలిటీషియ‌న్‌ గానే ఉన్నారు గానీ.. ఫుల్ టైం రాజ‌కీయ‌వేత్త‌గా మారలేదు. ఇదే అంశాన్ని ఆస‌రా చేసుకుని విప‌క్షాల‌తో పాటు మిత్ర‌ప‌క్షాల నేత‌లు కూడా అప్పుడ‌ప్పుడూ ఆయ‌న‌పై సెటైర్లు వేస్తున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఇక ప్ర‌స్తుత వార్త విష‌యానికి వ‌స్తే... ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక‌పై ఫుల్ టైం పొలిటీష‌న్‌ గా మార‌బోతున్నార‌ట‌. ఇదేదో ఆయ‌న అభిమానులో, లేదంటే గాలి వార్త‌లు మోసుకొచ్చే వ్య‌క్తులో చెప్పిన విష‌యం కాదు... జ‌న‌సేన‌ ఉపాధ్య‌క్షుడి హోదాలో ఆ పార్టీ కీల‌క నేత‌ మ‌హేంద‌ర్ రెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించిన అంశం. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పార్టీ క్రియాశీల కార్య‌క‌ర్త‌ల ఎంపిక జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో నిన్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన కార్య‌క‌ర్త‌ల ఎంపికకు హాజ‌రైన మ‌హేంద‌ర్ రెడ్డి... ఈ సంద‌ర్భంగా నిన్న మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయ తెరంగేట్రంపై సంచల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే మార్చి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నార‌ట‌. మ‌రి అప్పుడు కూడా ప‌వ‌న్ సినిమాలు చేస్తారో, లేదో తెలియ‌దు గానీ... రాజ‌కీయాల్లో అయితే ఫుల్ టైంగానే ప‌నిచేస్తార‌ట‌. రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా మ‌రో ఏడాదిన్న‌ర‌లో రానున్నాయి.

ఆ ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగానే ఫుల్ టైం రాజ‌కీయ వేత్త‌గా మారేందుకే ప‌వ‌న్ మార్చి నాటి నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అంటే కేవ‌లం ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉంద‌న‌గా ప‌వ‌న్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వస్తార‌న్న మాట‌. అంటే రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఈ ద‌ఫా జ‌న‌సేన పోటీ చేయ‌నున్న‌ట్టేన‌న్న స్ప‌ష్ట‌త వ‌చ్చేసిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/