Begin typing your search above and press return to search.

గాజువాకలో పవన్ ఖర్చు ఇంతేనా?

By:  Tupaki Desk   |   15 May 2019 8:47 AM GMT
గాజువాకలో పవన్ ఖర్చు ఇంతేనా?
X
ఎన్నికలంటే ఆషామాషీ కాదు.. అడుగుపెడితే వేలే.. కార్యకర్తలను మేపడం.. ప్రచారం ఖర్చు..బిర్యానీలు - బీరు - మద్యం కనీసం ఎంత లేదన్నా ఒక్కో అసెంబ్లీలో మినిమం 20 నుంచి 50 లక్షలు ఖర్చు చేస్తుంటారు. కొంతమంది కోటి రూపాయలు దాటిస్తుంటారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో సగటున డబ్బున్న వారు పోటీచేసిన నియోజకవర్గాల్లో మూడు నుంచి 5 - 10 కోట్ల వరకూ కొందరు అభ్యర్థులు ఖర్చు పెట్టారంటే అతిశయోక్తి కాదు..

తాజా ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు పెట్టవచ్చు. ఎంపీ అభ్యర్థులైతే రూ.70లక్షల వరకు ఖర్చు చేసే వెసులుబాటును ఈసీ కల్పించింది. అంతకుమించి ఖర్చు పెడితే చర్యలు చేపడుతారు. అయితే ఈసీకి సమర్పించే లెక్కల్లో మాత్రం అభ్యర్థులు లక్షలే చూపిస్తారు. కానీ బయట అధికారికంగా మాత్రం కోట్లు ఖర్చుపెడుతుంటారు. అది ఎప్పుడూ జరిగేదే.. ఇప్పుడు కూడా అదే విచిత్రం చోటు చేసుకుంది.

జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా గాజువాకలో పోటీచేసిన సంగతి తెలిసిందే. ఏపీలోనే అత్యంత్య ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గంలో ఎన్నికల వేళ నగదు వరదలా పారింది. అన్ని పార్టీలు కోట్లు కుమ్మరించాయి.

ప్రతీ ఓటరుకు 2 వేల నుంచి 5వేల వరకు.. ఇక ఇదే కాకుండా ప్రతీ ఇంటికి మద్యం - మహిళలకు చీరలు గ్రైండర్స్ - గోల్డ్ కాయిన్స్ - సిల్వర్ కాయిన్స్ - యువతకు స్పోర్ట్ కిట్స్ - కొన్ని కులసంఘాలకు - ఎక్కువ మంది ఉన్న వారికి టూ వీలర్స్ - కుల - మహిళా సంఘాలకు 10వేల చొప్పున నగదు ఇలా అభ్యర్థులంతా చేతికి ఎముకే లేనట్టు ఖర్చు పెట్టారన్నది నియోజకవర్గ ప్రజలను అడిగితే కథలు కథలుగా చెబుతుంటారు.

గాజువాకలో పోటీచేసిన జనసేనాని పవన్ తోపాటు మిగతా టీడీపీ - వైసీపీ అభ్యర్థులు కూడా బాగా ఖర్చు పెట్టారని.. ఏపీలోనే అత్యధిక వ్యయం చేసిన నియోజకవర్గాల్లో గాజువాక అని గుసగుసలు వినిపించాయి.

కానీ తాజాగా పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ఖర్చుపై ఈసీకి సమర్పించిన లెక్క చూశాక అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. జనసేన మొత్తం దృష్టి పెట్టిన ఈ నియోజకవర్గంలో పవన్ కేవలం రూ.8.39 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కనీసం ఈసీ నియోజకవర్గానికి ఖర్చు పెట్టండని పరిమితి ఇచ్చిన రూ.28లక్షలను కూడా పవన్ ఖర్చు చేయపెట్టకపోవడంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయినా 8 లక్షలనే ఆ నియోజకవర్గంలో పవన్ పెట్టాడడని తెలుపడంపై ఆయన ప్రత్యర్థులు - గాజువాక ప్రజలు కూడా నమ్మేలా కనిపించడం లేదు. అయితే ఖర్చు చూపించాలి కాబట్టి పద్ధతిగా పవన్ అంతే తక్కువ మొత్తం ప్రకటించాడనే చర్చ సాగుతోంది.