Begin typing your search above and press return to search.

ఒక్క సైగ చేస్తే కాళ్లు విర‌గ్గొట్టి కూర్చోబెడ‌తారు..!!

By:  Tupaki Desk   |   27 Sep 2018 5:33 AM GMT
ఒక్క సైగ చేస్తే కాళ్లు విర‌గ్గొట్టి కూర్చోబెడ‌తారు..!!
X
త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో నిత్యం వివాదాల్లో ఉంటూ వార్త‌ల్లోకి ఎక్కే ఏపీ అధికార‌పార్టీ ఎమ్మెల్యే.. ఏపీ రాష్ట్ర విప్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చింత‌మ‌నేని తీరుపై తీవ్రంగా స్పందిస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అల్టిమేటం జారీ చేసిన వైనం హాట్ టాపిక్ గా మార‌గా.. అది స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే.. చింత‌మ‌నేనిపై ప‌వ‌న్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. ఘాటు హెచ్చ‌రిక‌ను చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాను గాలి రౌడీలు.. ఆకు రౌడీల‌కు భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాద‌ని.. ఒక్క సైగ చేస్తే చాలు.. కాళ్లు విర‌గ్గొట్టి కూర్చొబెడ‌తారంటూ తీవ్రంగా మండిప‌డ్డారు. 16 ఏళ్ల వ‌య‌సులోనే ఆకు రౌడీలు.. గాలి రౌడీల‌ను త‌న్ని త‌గ‌లేశాన‌న్న ప‌వ‌న్‌.. చింత‌మ‌నేనిని ఉద్దేశించి ఖ‌బ‌డ్డార్ అంటూ నిప్పులు చెరిగారు. దెందులూరులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఘాటు వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్ సంచ‌ల‌నం సృష్టించారు.

27 కేసులు ఉన్నాయన్న ప‌వ‌న్‌.. చింత‌మ‌నేనిపై ఉన్న కేసుల వివ‌రాల్ని స‌భాముఖంగా చ‌దివి వినిపించారు. ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా వెన‌కేసుకొస్తున్న టీడీపీకి తాను ఎందుకు అండ‌గా నిల‌వాలంటూ ప్ర‌శ్నించారు. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ లాంటి వ్య‌క్తి సింగ‌పూర్ లో ఉంటే క‌ర్ర‌ల‌తో కొడ‌తార‌ని.. అదే సౌదీ అరేబియాలో అయితే త‌ల తీసే వాళ్లంటూ తీవ్రంగా మండిప‌డ్డారు.

సింగ‌పూర్ లాంటి రాజ‌ధాని కావాలంటే..సింగ‌పూర్ లాంటి పాల‌న కావాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఆమోద‌యోగ్య‌మైన పాల‌న ఉంటే భ‌రిస్తార‌ని.. లేకుంటే త‌న్ని త‌రిమేస్తార‌న్న ప‌వ‌న్.. ఆడ‌పిల్ల‌ల్ని.. మ‌హిళ‌ల‌ను బూతులు తిడితే చూస్తూ ఊరుకోమ‌ని వార్నింగ్ ఇచ్చేశారు. చింత‌మ‌నేని లాంటి వ్య‌క్తిని విప్ గా ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. విప్ చేసిన త‌ప్పుల‌పై రాష్ట్ర డీజీపీ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. లేకుంటే.. అత‌డికి జ‌రిగే ప‌రిణామాల‌కు తాము బాధ్య‌త వ‌హించ‌మ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

చింత‌మ‌నేని అంటే చంద్ర‌బాబుకు.. లోకేశ్ ల‌కు భ‌య‌మ‌ని.. త‌న‌కు అలాంటిదేమీ లేద‌న్నారు. ‘‘2014 ఎన్నికల సమయంలో తన మద్దతు అడిగినప్పడు.. రాష్ట్రంలో బలమైన శాంతిభద్రతలు కావాలని చంద్రబాబును అడిగా. నేను ఏమీ ఆశించలేదు.. ఆడపిల్లలకు భద్రత ఉండాలని కోరుకున్నా. విభజన సమయంలో బాధ్యతతో కూడిన ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకున్నా. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మద్దతు ఇవ్వాలా? కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు.

అధికార‌పార్టీ ఎమ్మెల్యేను అదుపు చేయ‌టంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫెయిల్ అయ్యార‌ని.. కేసులున్నా చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌టంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.ఇలాంటి వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌న్నారు. గ‌డిచిన రెండు రోజులుగా చింత‌మ‌నేనిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న ప‌వ‌న్ కు ఏపీ ప్ర‌భుత్వ విప్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది. ఇటీవ‌ల కాలంలో చింత‌మ‌నేని పైనా.. ఆయ‌న తీరుపైనా ఈ స్థాయిలో విరుచుకుప‌డిన ఏకైక నేత ప‌వ‌న్ ఒక్క‌రేన‌ని చెబుతున్నారు.