Begin typing your search above and press return to search.

తొందరపడుతున్నవేమో పవన్ కల్యాణ్?

By:  Tupaki Desk   |   27 Nov 2016 4:19 AM GMT
తొందరపడుతున్నవేమో పవన్ కల్యాణ్?
X
పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రజలేం అనుకుంటున్నారా?ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంపై భారతావని ఎలా రియాక్ట్ అవుతోంది? ప్రజా స్పందన ఏమిటి? సామాన్యుడు ఏమనుకుంటున్నారు? నోట్ల రద్దుపై లాభమా? నష్టమా? లాంటి విషయాలపై చర్చ మొదలు పెడితే.. ఒక పట్టానా తేలదు. మోడీ తీసుకున్న రద్దు నిర్ణయాన్ని ఎంత బలంగా సమర్థించే వారు ఉన్నారో.. వ్యతిరేకించే వారూ ఉన్నారు. అయితే.. సమర్థించేవారికి.. వ్యతిరేకించే వారికి మధ్యన ఒక పెద్ద వ్యత్యాసం ఉందని చెప్పాలి.

రద్దును వ్యతిరేకించేవారు చెబుతున్న మాటల్లో వాస్తవాల కంటే కూడా ఊహలే ఎక్కువగా కనిపిస్తాయి. రద్దు నిర్ణయం బడా పారిశ్రామికవేత్తలకు.. బీజేపీ నేతలకూ ముందే తెలిసిపోయిందన్నది ఒక ఆరోపణ. ఒకవేళ అదే జరిగి ఉంటే.. దానికి సంబంధించినవాస్తవాలు ఇప్పటికే బయటకు వచ్చి ఉండేవి కాదా? తమకు తెలిసిన విషయాల్ని అందరికి చెప్పాలన్న ఆతృత గతంలో కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఈ మధ్యన అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాతో సంచలనాల్ని సృష్టించేందుకు.. ప్రముఖంగా కనిపించాలని తపన పడే వారికి కొదవ లేదనే చెప్పాలి. అలాంటి వేళ.. ఒక భారీ రహస్యం బయటకు పొక్కితే.. అదెలా ప్రచారమవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అలాంటప్పుడు నోట్ల రద్దు విషయానికి సంబంధించిన ఒక చిన్న లీక్ దేశం మొత్తాన్ని ఇట్టే చుట్టేసేది. ఇలా.. లాజిక్కు అందని రీతిలో మోడీ రద్దు నిర్ణయాన్ని తప్పు పడుతున్న వారి మాటల్లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. రద్దు నిర్ణయంపై మోడీని వ్యతిరేకిస్తున్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పేశారు. తన వరుస ట్వీట్లతో నోట్ల రద్దుపై తన వ్యతిరేకతను స్పష్టం చేసిన ఆయన తొందరపడినట్లుగా కనిపిస్తోంది.

విపక్షాలు చెబుతున్నట్లుగా నోట్ల వ్యతిరేకత మీద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయంపై పవన్ కు అందిన ఫీడ్ బ్యాక్ తప్పన్న వాదన వినిపిస్తోంది. దేశంలో అత్యధికులు రద్దు నిర్ణయాన్ని ఇప్పటికి సమర్థిస్తున్నారు. అయితే.. రద్దు కారణంగా ఏటీఎంలు పని చేయకపోవటం.. బ్యాంకుల దగ్గర క్యూలు వారికిచిరాకు పుట్టిస్తున్నాయి. అయితే..ఈ చిరాకు.. అసహనం అంతా తాత్కాలికమే తప్పించి.. శాశ్వితం కాదన్న విషయాన్ని పవన్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. తమ అవసరాలకు సరిపడా డబ్బు దొరకలేదన్న ఆగ్రహం ఎవరికైనా మామూలే. కానీ.. చేతిలోకి డబ్బు అందిన తర్వాత.. సామాన్యుడు సైతం మోడీ నిర్ణయాన్ని.. ఆయన ప్రదర్శించిన ధైర్యాన్ని అభినందిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

విపక్ష ఎంపీలతో ఢిల్లీ రోడ్ల మీద నిలబెట్టి మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తరహాలో పవన్ పిలుపునివ్వటం కాస్తచిత్రమైన వ్యవహారంగా చెప్పాలి. నోట్ల రద్దుపై తమ నిరసనను.. ఏటీఎం క్యూలలో.. బ్యాంకుల వద్ద నిలబడటం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయాలని పవన్ కోరుతున్నారు. ఒక ఎంపీ ఏటీఎంల దగ్గరకు వచ్చి క్యూలో నిలుచుంటే.. ప్రజలకు ధైర్యంగా ఉంటుందన్న ఆయన మాటలు కాసింత కామెడీగా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు. ఒక ఎంపీ క్యూ లైన్లలో నిలుచునే కన్నా.. కరెన్సీ నోట్లను అక్రమంగా తరలిస్తున్న వారిపైనా.. కొందరు బడా బాబులతో కుమ్మక్కు అవుతున్న బ్యాంకు అధికారుల తాట తీయాలని.. అలాంటి వారి బండారాన్ని బయటపెట్టాలని కోరాల్సింది పోయి.. ఫోటోలకు ఫోజులిచ్చేలా పవన్ సలహా ఇవ్వటం కాస్త చిత్రమైన విషయంగా చెప్పక తప్పదు.

ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడెక్కడ? అంటూకొందరు విమర్శించింది నిజమే అయినప్పటికీ.. ఇలా అయిన దానికి కాని దానికి స్పందించటం.. సరైన కసరత్తు లేకుండా తొందరపడి ఎంపీలకు.. ఎమ్మెల్యేలకు సలహాలు.. సూచనలు చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని పవన్ మర్చిపోకూడదు. నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయంపై ఒక వ్యక్తి స్పందన ఎలా ఉంటుందన్న విషయాన్ని.. తన అన్న నాగబాబు చెప్పిన మాటల్ని ఆయన గమనిస్తే బాగుంటుంది. మీడియాలో వచ్చే కొన్ని కథనాల్ని ప్రాతిపదికగా తీసుకుంటూ.. సామాన్యుడికి అండగా ఉండాలన్న భావంతో పవన్ తొందరపడి మాట్లాడటం ఆయన ఇమేజ్ ను ఆయనే చెడగొట్టుకుంటున్నారనే చెప్పాలి.అయినా.. పవన్ లాంటి వ్యక్తి నోట.. రాహుల్ గాంధీ తరహా మాటలు అవసరమా? అన్నది ప్రశ్న. ఉన్నట్లుండి ఏమైంది పవన్ కల్యాణ్..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/