Begin typing your search above and press return to search.

ఆంధ్ర‌జ్యోతి ఆర్కేను ట్వీట్స్ తో వెంటాడుతున్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   23 April 2018 6:36 AM GMT
ఆంధ్ర‌జ్యోతి ఆర్కేను ట్వీట్స్ తో వెంటాడుతున్న ప‌వ‌న్‌
X
త‌న త‌ల్లిని అవ‌మానించారంటూ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ ఎత్తున ట్వీట్లతో వార్ షురూ చేయ‌టం తెలిసిందే. కొంద‌రు మీడియా అధినేత‌ల‌పై ట్వీట్ల స‌మ‌ర శంఖాన్ని పూరించిన ఆయ‌న‌.. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ప‌లు ట్వీట్లు చేశారు. కొన్ని ఛాన‌ళ్ల‌ను ఎందుకు చూడాల‌ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. కొన్ని ఛాన‌ళ్ల అధినేత‌ల‌కు ముద్దుపేర్ల మాదిరి త‌గిలించి వారిపై ట్వీట్ల దాడిని ముమ్మ‌రం చేశారు.

మొన్న‌టికి మొన్న శ్రీ‌నిరాజుపై విమ‌ర్శ‌ల్ని సంధించిన ఆయ‌న త‌ర్వాత టీవీ9 ర‌విప్ర‌కాశ్‌ పై ట్వీట్ల క‌త్తి దూశారు. ప‌నిలో ప‌నిగా ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పైనా ఆరోప‌ణ‌ల్ని సంధించారు. శ్రీ‌నిరాజు మీద రెండు రోజులు విమ‌ర్శ‌లు చేసి వ‌దిలేసిన ప‌వ‌న్‌.. త‌ర్వాత ర‌విప్ర‌కాశ్ మీదా విమ‌ర్శ‌లు సంధించారు. ఏమైందో ఏమోకానీ.. ఆయ‌న మీద కూడా త‌న ట్వీట్ల గురిని త‌గ్గించేశారు. ఈ రోజు ఉద‌యం నుంచి ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ‌టం షురూ చేశారు.

వ్యంగ్యాస్త్రాల్ని సంధించ‌టం ఒక ఎత్తు అయితే.. త‌న మీద బ‌హిరంగంగా తిడుతున్న మీడియా .. లోగుట్టుగా మాత్రం ప‌లువురి చేత సారీ చెబుతానంటూ ఫీల‌ర్లు పంప‌టం ఏమిటంటూ ఓపెన్ అయ్యారు. త‌న దాడి ఇప్ప‌ట్లో ఆగ‌ద‌న్న‌ట్లుగా ఆయ‌న తాజా ట్వీట్లు ఉన్నాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఎప్పుడేం తోస్తే ఆ విష‌యాల్ని ట్వీట్ల రూపంలో చెబుతున్న ప‌వ‌న్ తీరు విచిత్రంగా ఉంద‌ని చెబుతున్నారు. ఓవైపు టీడీపీని త‌ప్పు ప‌డుతూ ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ ప్ర‌స్తావ‌న తెచ్చిన ప‌వ‌న్‌.. అంత‌లోనే త‌న చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌నకు సంబంధించిన షెడ్యూల్ ప్ర‌క‌టిస్తాన‌ని చెబుతున్నారు. అది కూడా సాయంత్రం లోపు విడుద‌ల చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంత‌లోనే.. ఇంకేదో గుర్తుకు వ‌చ్చిన‌ట్లుగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వేధింపుల‌కు గుర‌య్యే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా మ‌హిళా వింగ్ ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. క‌ల‌గా పుల‌గంగా మారిన ప‌వ‌న్ ట్వీట్ల‌లో కీల‌కమైన‌వి చూస్తే..

+ అమెరికా రాజ్యాంగ పీఠిక మేం దేవుడ్ని న‌మ్ముతామ‌ని. తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ పీఠిక ఏమిటో తెలుసా?. మేం తిట్టటాన్ని న‌మ్ముతామ‌ని. దేవుడ్ని త‌ప్ప ఎవ‌రినైనా తిడ‌తామ‌న్న‌దే వారి న‌మ్మ‌కం.

+ తెలుగుదేశం పార్టీలో త‌ల్లిని.. సోద‌రిని తిట్టే విభాగానికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రు.. బూతుజ్యోతి ర‌త్న ఆర్కే.

+ గ‌డిచిన ఆరు నెల‌లుగా నా మీద.. నా అభిమానుల మీదా.. నా పార్టీ కార్య‌క‌ర్త‌ల మీదా.. ఫిలిం ఇండ‌స్ట్రీ మీదా.. మా అమ్మ మీదా తిట్ట‌టం.. భావోద్వేగ అత్యాచారం చేస్తున్నారు. ఇంతటి అనారోగ్య‌మైన మ‌న‌స్త‌త్వం ఉన్న మీరు ప్రైవేటు గా మాత్రం నాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా సంకేతాలు పంపుతారా? ప‌బ్లిక్ గా తిట్టేయ‌టం ప్రైవేటుగా సారీలు చెప్ప‌టం నా ద‌గ్గ‌ర న‌డ‌వ‌ని ప‌ని.

+ పాత్రికేయ విలువ‌ల‌తో ఉన్న ఛానెల్స్‌.. ప‌త్రిక‌లు.. స‌మ‌దృష్టి కోణంతో ఉండే ఛాన‌ల్స్‌.. ప‌త్రిక‌ల వెనుకే నిల‌బ‌డ‌దాం. మ‌న‌ల్ని.. మ‌న త‌ల్లుల్ని.. ఆడ‌ప‌డుచుల్ని తిట్టే పేప‌ర్లు ఎందుకు చ‌ద‌వాలి? వాళ్ల టీవీలు ఎందుకు చూడాలి?

+ త్వ‌ర‌లోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఆడ‌ప‌డుచుల ఆత్మ‌గౌర‌వ పోరాట స‌మితి ఏర్పాటుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఆడ‌ప‌డుచుల ఆత్మ‌గౌర‌వ పోరాట స‌మితి ఏర్పాటుకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. వీరికి జ‌న‌సేన వీర మ‌హిళా విభాగం అండ‌గా ఉంటుంది.

+ చిత్తూరు జిల్లాలోని ప్ర‌జా స‌మ‌స్య‌లపై నాలుగు రోజులు నా ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్ని ఈ సాయంత్రం లోపు వివ‌రాలు విడుద‌ల చేస్తాం.