Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఎక్క‌డికి వెళితే.. అక్క‌డ హెచ్చ‌రిక‌లే!

By:  Tupaki Desk   |   27 March 2019 1:30 AM GMT
ప‌వ‌న్ ఎక్క‌డికి వెళితే.. అక్క‌డ హెచ్చ‌రిక‌లే!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఓ రేంజ్లో ఉంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌టం.. ఆరోప‌ణ‌స్త్రాల్ని సంధించ‌టం కామ‌న్ గా చేస్తున్నారు. నామినేష‌న్ల ప‌ర్వం పూర్తి కావ‌టంతో గేర్ మార్చిన నేత‌లు తుది పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్ర‌చారాన్ని చేస్తున్నారు.

ఏపీలో ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. తెలంగాణ‌లో మాత్రం కాస్త భిన్న‌మైన ప‌రిస్థితి. వార్ వ‌న్ సైడ్ అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సారు కోరుకున్న‌ట్లుగా 16 సీట్లు రావ‌టం అంత తేలిక కాద‌ని చెబుతున్నారు. అయితే.. కేసీఆర్‌కు ప‌రీక్ష పెట్టే ప్ర‌త్య‌ర్థులు రంగంలో లేక‌పోవ‌టం ఒకింత క‌లిసి వ‌చ్చే అంశంగా చెప్పాలి. ఇద్ద‌రు ముగ్గురు త‌ప్పించి మిగిలిన చోట్ల పోటీ నామ మాత్రంగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంకా రంగంలోకి దిగ‌లేదు. ఆయ‌న‌కు బ‌దులుగా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌మ్ కొడుకు కేటీఆర్ రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు.

తెలంగాణ‌లో కావొచ్చు.. ఏపీలో కావొచ్చు.. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని చూస్తే.. అధినేత‌లు ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకోవ‌టం.. ఘాటు విమ‌ర్శ‌లు చేసుకోవ‌టం క‌నిపిస్తుంది కానీ స్థానికంగా ఉండే అభ్య‌ర్థుల‌పై ప‌రుష వ్యాఖ్య‌లు చేయ‌టం క‌నిపిస్తుంది మిన‌హాయించి మ‌రెలాంటి వ్యాఖ్య‌లు ఉండ‌వు. అయితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది.

ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా.. త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీల అధినేత‌ల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌టం.. వారిపై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌టం ప‌వ‌న్ కు అల‌వాటు. అధినేత‌ల్ని తిట్ల వ‌ర్షం కురిపించే నేత‌.. ప‌నిలో ప‌నిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థుల‌పై తిట్ల వ‌ర్షం కురిపిస్తారు.

స్థానికంగా త‌ర‌చూ మాట్లాకునే ప‌లు అంశాల‌న్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తుంటారు. వివిధ పార్టీలు ఎంపిక చేసిన అభ్య‌ర్థుల ఘ‌న చ‌రిత్ర‌ను ప‌ట్టుకోవ‌ట‌మే కాదు.. వారికి షాక్ తినిపిస్తూ ఊహించ‌ని రీతిలో షాకుల మీద షాక్ తినేలా వ్యవ‌హ‌రిస్తుంటారు. తాజాగా నెల్లూరు రూర‌ల్‌.. సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్థిపైనే కాదు.. సిటీ అభ్య‌ర్థిపైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలిసిన రాజ‌కీయం.. స్థానికంగా ఉండే అభ్య‌ర్థుల మీద కంటే కూడా పార్టీల‌ను.. పార్టీ అధినేత‌ల మీద‌నే ఫోక‌స్ ఉంటుంది. ప‌వ‌న్ ఎంట్రీ పుణ్యమా అని అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నేడు నెల‌కొంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మిగిలిన అధినేత‌ల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న ధోర‌ణికి తెలుగు ప్ర‌జ‌ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.