Begin typing your search above and press return to search.

తెదేపా ఎంపీలను పవన్ ఆడుకుంటాడా?

By:  Tupaki Desk   |   25 Oct 2016 7:30 PM GMT
తెదేపా ఎంపీలను పవన్ ఆడుకుంటాడా?
X
తెలుగుదేశం ఎంపీలు రాజీనామాలు చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని వైఎస్ జగన్ మోహన రెడ్డి తొలినుంచి చెబుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అందరు ఎంపీలు రాజీనామా చేసేస్తే.. ప్రత్యేకహోదా తప్పక వస్తుందని పవన్ కల్యాణ్ మరోవైపు ఇటీవలి కాలంనుంచి తన వాదన ప్రారంభించారు. అయితే.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులను తృణప్రాయంగా ఎంచడానికి సిద్ధంగానే ఉన్నారనే సంగతి తేలిపోయింది . ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామాలు చేసేలా.. పవన్ కల్యాణ్ వారి మీద ఒత్తిడి తెస్తాడా.. తన విమర్శలు దూషణలు మొత్తం వారి మీదనే కేంద్రీకరిస్తాడా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కీలక చర్చనీయాంశంగా ఉంది.

వైస్ జగన్మోహన రెడ్డి. .. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా ప్రత్యేక హోదా గనుక ఇవ్వకపోతే..  ఆ సమావేశాల తర్వాత.. తమ పార్టీకి చెందిన ఎంపీలంతా రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తామని, ప్రజాతీర్పు ద్వారా ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజెప్తామని అన్నారు.

నిజానికి పవన్ కల్యాణ్ తన తిరుపతి సభ  నుంచి ఎంపీల విషయంలో ఇదే వాదన వినిపిస్తున్నారు. ఎంపీలు అందరూ త్యాగాలు చేయడానికి సిద్ధపడితే.. హోదా  వస్తుందని ఆయన తన సభల్లో వివరించారు. ఏపీ ఎంపీలు గనుక సీరియస్‌ గా పట్టించుకోకపోతే.. తాను, తన పార్టీ కార్యకర్తలతో కలసి ఏపీ ఎంపీలందరి ఇళ్ల దగ్గర ఘెరావ్ లు గట్రా ఉద్యమాలు చేస్తామని, వారి జీవితాలను స్తంభింపజేస్తామని అన్నారు. తమ పార్టీ తరఫున ప్రజలను ఇబ్బంది పెట్టే ధర్నాలు బంద్ లు నిర్వహించబోం అని.. ఎంపీలను ఇబ్బంది పెట్టే ఘెరావ్ లు వారి ఇళ్ల ఎదుట ఉద్యమాలు చేస్తాం అని.. వారు రాజీనామాలు చేసేదాకా ఊరుకోం అని హెచ్చరించారు.

ఇప్పుడు ఒక పార్టీ విషయం ఫైనల్ అయింది.. పవన్ కల్యాణ్ చెప్పినా చెప్పకపోయినా.. వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి తెదేపా ఎంపీలు పదవుల్ని అంటిపెట్టుకుని కూర్చోవడం కూడా గ్యారంటీ. మరి అలాంటి సమయంలో.. పవన్ కల్యాణ్ తెదేపా వారి మీద మాత్రం ఫోకస్ పెట్టి తన పోరాటం సాగిస్తాడా? లేదా? అనేది ప్రజల్లో కీలక చర్చనీయాంశంగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/