Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక బ్ర‌హ్మ ప‌దార్థ‌మా?

By:  Tupaki Desk   |   24 Jan 2018 5:08 PM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక బ్ర‌హ్మ ప‌దార్థ‌మా?
X
``నాక్కొంచం తిక్కుంది.....కానీ దానికో లెక్కుంది...అంద‌రి లెక్క‌లూ తేలుస్తా.....`` ఇవ‌న్నీ జ‌న‌సేన అధినేత‌ - సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా ఓ సినిమాలో చెప్పిన పాపుల‌ర్ డైలాగులు. నాలుగేళ్ల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్.....ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నించ‌డానికే వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో - ప‌వ‌న్ అభిమానులు....ఏపీ - తెలంగాణ రాజ‌కీయాల్లో పెనుమార్పులు వ‌చ్చేస్తాయ‌ని - జ‌న‌సేనాని ప్ర‌భుత్వాల‌ను నిగ్గ‌దీసి అడుగుతాడ‌ని భావించారు. అయితే, ప‌వ‌న్ మాత్రం ఓ వైపు సినిమాల‌లో న‌టిస్తూనే....మ‌రోవైపు అడ‌పాద‌డ‌పా ఉద్దానం....ప్ర‌త్యేక‌హోదా.....గోదావ‌రి ఆక్వా వంటి స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ...త‌న పార్టీ ఉనికిని చాటుతూ వ‌చ్చారు. ఏపీ - తెలంగాణ‌లో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది గ‌డువే ఉండ‌డంతో ఇక‌పై ప‌వ‌న్ ఫుల్ టైం పొలిటీషియ‌న్ గా మార‌బోతున్నాన‌ని....కొండ‌గట్టు నుంచి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీకి అధికారం ద‌క్క‌డంలో ప‌వ‌న్ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా తాను ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించేశారు. ప‌వ‌న్ తెలంగాణ యాత్ర‌తో పాటే ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

ప‌వ‌న్ మొద‌టి నుంచి ఒకే పాట పాడుతున్నారు.....తాను నిర్మాణాత్మ‌క రాజ‌కీయాలు చేస్తాన‌ని......అధికార పార్టీని ఇరుకున పెట్టే కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌న‌ని.....స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భించే వ‌ర‌కు ప్ర‌భుత్వంతో పోరాడ‌తాన‌ని చెప్పారు. అదే విధంగా టీడీపీ అధినేత‌పై ఈగ వాల‌నివ్వ‌కుండా.....గొప్ప సీఎం అంటూ కొనియాడారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా ప‌వ‌న్ పై టీడీపీ శ్రేణులు నోరు పారేసుకోవ‌ద్ద‌ని సూచించారు. న్యూ ఈయ‌ర్ రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ ను క‌లిసిన ప‌వ‌న్ పై ఓ మోస్త‌రు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే, తాజాగా - క‌రీంన‌గ‌ర్ ప్రెస్ మీట్ లో కేసీఆర్ స్మార్ట్ సీఎం.....హార్డ్ వ‌ర్కర్ అంటూ ప‌వ‌న్ పొగిడేయ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ప‌వ‌న్ వైఖ‌రి పై ప‌లువురు రాజ‌కీయ కురువృద్ధులు - మేథావులు పెద‌వి విరుస్తున్నారు. గ‌తంలో కేసీఆర్ ను - తెలంగాణ‌ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప‌వ‌న్.....ఒక్క‌సారిగా కేసీఆర్ భ‌జ‌న చేయ‌డం ప‌వ‌న్ అభిమానులు - జ‌న‌సేక కార్య‌క‌ర్త‌ల‌కు కూడా మింగుడు ప‌డ‌డం లేద‌ని టాక్. అధికార పార్టీల‌కు ఇబ్బందులు ఉంటాయ‌ని - వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పార్టీకి బ‌లాబ‌లాల‌ను బేరీజు వేసుకొని అక్క‌డ మాత్ర‌మే పోటీ చేస్తాన‌ని, త‌క్ష‌ణ‌మే అధికారం కోసం తాను అర్రులు చాచ‌డం లేద‌ని... ప‌వ‌న్ నోట నుంచి వెలువ‌డిన ప్ర‌తి మాట కూడా ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను అయోమ‌యంలోకి నెట్టేసింద‌నే చెప్పాలి.

ఓ ర‌కంగా ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారో అన్న సందేహం ఇపుడు పలువురిని తొల‌చి వేస్తోంది. తెలంగాణ కోసం త‌న ర‌క్తం ధార‌బోస్తాన‌ని.....ఇక్క‌డి యువ‌త ఆశ‌యాలే త‌న లక్ష్యాల‌ని....ఇలా ప‌వ‌న్ కు ఒక్క‌సారిగా తెలంగాణ‌పై ఉన్న‌ట్లుండి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకువ‌చ్చింద‌నేది భేతాళ ప్ర‌శ్న‌. జ‌న‌సేన ఎందుకు స్థాపించారో ప‌వ‌న్ కే క్లారిటీ లేద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన‌పై ప‌వ‌న్ క్లారిటీ ఇస్తేగానీ తానేదైనా మాట్లాడ‌తాన‌ని మీడియాతో మాట్లాడిన తీరు ఆస‌క్తికరం. ఇరు తెలుగు రాష్ట్రాల‌ రాజ‌కీయాల‌తో పాటుగా జాతీయ రాజ‌కీయాల‌పై లోతైన విశ్లేష‌ణ చేయ‌గ‌లిగే మేధావిగా జ‌నానికి సుప‌రిచితుడు - తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ప‌వ‌న్ కు దిమ్మ తిరిగే కామెంట్ వదిలారు. జ‌న‌సేన గురించి గానీ - ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి గానీ మాట్లాడి... త‌న స్థాయిని త‌గ్గించుకోలేన‌ని కోదండ‌రాం చేసిన వ్యాఖ్యలు నిజంగానే ప‌వ‌న్ అవ‌గాహ‌నారాహిత్యానికి అద్దం ప‌డుతోంద‌ని చెప్ప‌క త‌ప్పదు.

త‌న రాజ‌కీయ జీవితంత‌లో చాలామంది పిచ్చోళ్ళను చూశాను కాని పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోణ్ణి చూడలేద‌ని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మందకృష్ణ మాదిగ ....సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కేసీఆర్ పాలన - ఏపీలో చంద్రబాబు పాలన బాగుంటే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లు ఎందుకు చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పవన్ కల్యాణ్ పార్టీ‘జనసేన’ కాదని - ‘భజనసేన’ అని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీ. హ‌నుమంత‌రావు వ్యాఖ్యానించారు.

తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తనతో వస్తే చూపిస్తానని, అందుకు సిద్ధమా అని వీహెచ్‌ సవాల్‌ విసిరారు. తాజాగా ఖ‌మ్మంలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్....కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా వీహెచ్ ను ప్ర‌క‌టిస్తే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తిస్తాన‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో పవన్ ‘పాపం పసివాడు’ టైపు అంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి ఎద్దేవా చేశారు. సీఎంను పొగిడేందుకు ఎంత ప్యాకేజీ తీసుకున్నావ‌ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌.....ప‌వ‌న్ ను సూటిగా ప్రశ్నించారు. త‌న సినిమా 5 షోలు ప్రదర్శించేలా అనుమతిచ్చినందుకే కేసీఆర్‌ కేసీఆర్‌ స్మార్ట్‌ సీఎం అయిపోయాడా.... అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ పవన్ ను ఉద్దేశించి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రం వస్తోందన్న బాధతో ఉపవాస దీక్ష చేసిన పవన్ కల్యాణ్ పై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారితో మంచి సంబంధాలను కొనసాగించడం సిగ్గుచేటన్నారు. సాక్ష్యాత్తూ....టీఆర్ ఎస్ ఎంపీ వినోద్....ప‌వ‌న్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఆర్ ఎస్ - కేసీఆర్ ల పై ప‌వ‌న్ కు ఎందుకంత ప్రేమో త‌న‌క‌ర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే వ్య‌క్తి .....కేవ‌లం చంద్ర‌బాబునాయుడు వంటి మేధావికి మాత్ర‌మే అర్థ‌మవుతాద‌ని, ఆయ‌నో బ్ర‌హ్మ‌ప‌దార్థ‌మ‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే ప‌వ‌న్ పై తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. అయితే, దాదాపుగా ఇవే సందేహాలు ప‌వ‌న్ ఫ్యాన్స్‌ - జ‌న‌సేన శ్రేణులకు కూడా క‌ల‌గ‌డంలో ఏమాత్రం త‌ప్పులేద‌ని చెప్ప‌వ‌చ్చు. త‌మ అభిమాన న‌టుడు...జ‌న‌సేనాని రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశాడ‌ని, రొమ్ములు చించుకొని ప్ర‌చార కార్య‌క్ర‌మాలలో పాల్గొన్న అభిమానులు....ఇపుడు అయోమ‌యంలో ప‌డ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల్సిన ప‌వ‌న్....ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించ‌డం....అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు మ‌ద్ద‌తిస్తాన‌న‌డం తో ఫ్యాన్స్ - జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఓ అభిమాని అయితే...ఏకంగా ప‌వ‌న్ ను ఉద్దేశించి ఓ బ‌హిరంగ లేఖ రాశాడు. ఆ ఒక్క అభిమానే కాదు.....దాదాపు అందరు అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల మ‌న‌సులోని మాట‌లు ఆ లేఖ‌లో ఉన్నట్లు క‌నిపిస్తోంది. ఆ లేఖ ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

``ప్రత్యేకహోదా - విశాఖ రైల్వేజోన్ - ఇంటికో ఉద్యోగం - నిరుద్యోగ బృతి - రైతు రుణమాఫీ - డ్వాక్రా రుణమాఫీ అని కొన్ని వందల హమీలు ఇచ్చారు కదన్నా.. వాటిని నెరవేర్చే బాధ్యతనాది అని నువ్వు అన్నావు కదన్నా మరి ఇప్పడు ఆ పార్టీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మరి వారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు అన్నా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే జనసేన పార్టీ ఎవరిని ప్రశ్నించడానికి పెట్టావు అన్నా..? ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిస్తే ఏం వస్తుంది అన్నా.. ప్రజలకు ఏం ఉపమోగం అన్నా... వారు ఏమైనా అధికారంలో వున్నారా హమీలు నెరవేర్చడానికి..? ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక్క మీటింగ్ పెడితే ప్రజాసమస్యలపై పోరాడినట్టు కాదన్నా.. నిరంతరం ప్రజల మద్యలో వుండి ప్రజా గోంతు రాష్ట్ర ప్రభుత్వాలకు వినబడేలా పోరాడితే ప్రజలకోసం పోరాడినట్టు అన్నా..ఇకనుంచి సినిమా పరంగా మీ అభిమానినే కానీ రాజకీయంగా కాదు..! ఇకపై నా ఇంటి పైన జనసేన పార్టీ జెండా కానీ నా చేతితో జెండా పట్టుకోవడం కానీ జై కొట్టడం చేయను.. జనసేన పార్టీకి ఓటు వేయడం జరగదు ఇక సెలవ్... జై హింద్...``అంటూ ఆ అభిమాని ఉద్వేగ‌పూరితంగా రాసిన లేఖ నిజంగా చాలామందిని ఆలోచింప‌జేస్తోంది. మ‌రి, ఆ లేఖ‌తో పాటు ప‌వ‌న్ పై మేధావులు - రాజ‌కీయ విశ్లేష‌కులు చేస్తున్న విమ‌ర్శలు ఆయ‌న వ‌ర‌కు చేర‌తాయో లేదో కాల‌మే స‌మాధాన‌మిస్తుంది.