Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ టీవీ ఛాన‌ల్ అదేనా?

By:  Tupaki Desk   |   13 May 2018 4:08 AM GMT
ప‌వ‌న్ టీవీ ఛాన‌ల్ అదేనా?
X
రాజ‌కీయ పార్టీలకు మీడియా సంస్థ‌లు ఉండ‌టం ఇప్ప‌టి ముచ్చ‌ట కాదు. ప‌క్క‌నున్న త‌మిళ‌నాడులో పెద్ద పార్టీల‌కు సొంతంగా ఎవ‌రి మీడియా సంస్థ వారికి ఉంటుంది. తెలుగు నేల మీద కూడా ఇదేం కొత్త కాదు. పార్టీ పెట్టినంత‌నే మీడియా సంస్థ‌ను ఏర్పాటు చేసుకోవ‌టం తెలివైన నిర్ణ‌యంగా చెప్పే వారు లేక‌పోలేదు.అయితే.. వీటి పాపులార్టీ విష‌యంలో ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.

ఏపీ రాజ‌కీయాల్లో త‌న ముద్ర‌ను చూపించాల‌ని.. ఇప్ప‌టికిప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవాల‌న్న త‌ప‌న లేని అధినేత‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అభివ‌ర్ణిస్తుంటారు. త‌న‌కున్న బ్యాగేజీ కార‌ణంగా ప‌వ‌ర్ కావాల‌న్న కోణంలో మాట్లాడ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని చెబుతారు. ఈ కార‌ణంతోనే ఎన్నిక‌ల్లో పోటీ గురించి మాత్ర‌మే మాట్లాడే ప‌వ‌న్‌.. గెలుపు మాట‌.. అధికారాన్ని చేప‌ట్టే మాట ఆయ‌న నోటి నుంచి రాద‌న్న విశ్లేష‌ణ‌ను కొంద‌రు చేస్తుంటారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ పెట్టిన త‌ర్వాత ఆయ‌న‌కు ప‌లువురు టీవీ ఛాన‌ల్ పెట్టాల‌న్న స‌ల‌హాను ఇచ్చిన‌ట్లు చెబుతారు. అయితే.. త‌న‌కు పెద్ద ఆస‌క్తి లేద‌న్న‌ట్లుగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించే వార‌ని చెబుతారు. ఇటీవ‌ల కాలంలో త‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే మీడియా సంస్థ‌లు త‌న‌పై క‌త్తి క‌ట్టిన‌ట్లుగా ప‌వ‌న్ ఫీల‌వుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న వాద‌న‌ను వినిపించేందుకు.. త‌న భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఒక టీవీ ఛాన‌ల్ అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు మొద‌లైన‌ట్లుగా స‌మాచారం. ఈ విష‌యంపై ఈ మ‌ధ్య‌న ప‌లు వాద‌న‌లు తెర మీద‌కు వ‌చ్చాయి. ప‌వ‌న్ స్టార్ట్ చేయ‌బోయే ఛాన‌ల్ పేరు జే టీవీ అన్న ప్ర‌చారం మొద‌లైంది.

ఇలాంటి ప్ర‌చారాలు ఏదైనా వ‌చ్చిన వెంట‌నే ఖండించేందుకు భిన్నంగా ప‌వ‌న్ వ‌ర్గం కామ్ గా ఉండ‌టం చూస్తే.. ఛాన‌ల్ స్టార్ట్ చేసే విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాజిటివ్ గా ఉన్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొత్త ఛాన‌ల్ ను ఏర్పాటు చేయ‌టం కంటే కూడా సిక్ ఛాన‌ల్ (మూత‌వేత‌కు సిద్ధంగా ఉన్న‌) ను టేకోవ‌ర్ చేసి.. దాన్ని మార్చేసి.. త‌న‌కు త‌గ్గ‌ట్లు మార్చుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే ఆర్థికంగా ఎలాంటి ఆదాయం లేక‌.. ప్ర‌స్తుతం న‌ష్టాల్లో ఉన్న వామ‌ప‌క్షాల‌కు చెందిన టీవీ ఛాన‌ల్ ను ప‌వ‌న్ సొంతం చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో వామ‌ప‌క్ష నేత‌ల‌తో రాసుకుపూసుకు తిరుగుతున్న ప‌వ‌న్‌.. వారి ఛాన‌ల్ ను సొంతం చేసుకునే అవ‌కాశాన్ని కొట్టి పారేయ‌లేమ‌ని చెబుతున్నారు. సీపీఎంకు - సీపీఐకి చెందిన టీవీ ఛాన‌ళ్ల‌లో ఏదో ఒక‌దానిని ప‌వ‌న్ సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజం ఎంత‌న్న‌ది కాల‌మే స‌రిగా స‌మాధానం చెబుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.