Begin typing your search above and press return to search.

కర్ణాటక ఎన్నికల్లో పవన్ ప్రాచారం చేస్తాడా?

By:  Tupaki Desk   |   29 March 2018 5:11 PM GMT
కర్ణాటక ఎన్నికల్లో పవన్ ప్రాచారం చేస్తాడా?
X
తెలుగు వాళ్లు అధికంగా వుండే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అందుకే అక్కడ తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ వుంది. దీనిని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు కూడా తెలుగు సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఇక అభిమాన సంఘాలు కూడా ఇక్కడ లాగే అక్కడా వున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారికి యూత్ లో మంచి క్రేజ్ వుంటుంది. అందుకే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో కొన్ని పార్టీలు పవన్ చేత ప్రచారం చేయించుకోవాలని పోటీపడుతున్నాయి. అలాంటి వారిలో జె.డి.ఎస్(జనతాదళ్ సెక్యులర్) పార్టీ ముందు వరుసలో వుందనే ప్రచారం వుంది. ఆ పార్టీ అధినేత కుమారస్వామికి.. పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహం వుంది. గతంలో తన కుమారుడి సినిమా జాగ్వార్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ కెళ్లి మరీ కలిసొచ్చాడు కుమార్ స్వామి. తన కుమారుడి ఆడియో ఫంక్షన్ కి రావాల్సిందిగా ఆహ్వానించారు కూడా.

ఇప్పుడు అదే స్నేహాన్ని ఉపయోగించుకుని తన పార్టీ తరఫున ప్రచారం చేయాలని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు పవన్ నిరాకరించాడని తెలుస్తోంది. ఇటీవల బీజేపీ పట్ల పవన్ కాస్త సానుకూలంగా వున్నట్టు ప్రచారం జరుగుతున్న సమయంలో జేడీఎస్ తరఫున ప్రచారం ఎలా చేస్తాడనే వాదనా వుంది. ప్రత్యేక హోదా విషయంలో యు టర్న్ తీసుకుని కేంద్రాన్ని నిలదీయకుండా మిన్నకుండిపోవడం.. జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ ద్వారా తేల్చిన ఏపీకి రావాల్సిన 74 వేల కోట్ల విషయంలో గానీ.. పార్లమెంటులో అవిశ్వాసం కోసం 80 మంది ఎంపీల మద్ధతు కూడగడతానని సవాల్ చేయడం లాంటి విషయాల్లో యు టర్న్ తీసుకున్న పవన్.. ఇదంతా భాజపాకు సానుకూలతతోనే చేశాడనే ప్రచారం జరుగుతున్న సమయంలో అతను ఇతర పార్టీల తరఫున ప్రచారం చేస్తారా లేక భాజపా తరఫునే ఎన్నికల ప్రచారంలోకి దిగుతారా? అనేది సందిగ్ధం నెలకొని వుంది. మరోవైపు తన మిత్రులు కొందరు తెలుగు వారు ఎక్కువగా వున్న బెంగళూరు, బళ్లారి ప్రాంతాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారని.. వారు కూడా తమ తరఫున ప్రచారం చేయాల్సిందిగా ఆహ్వానించారనే ప్రచారం కూడా వుంది. అయితే పవన్ ఏ పార్టీ తరఫున కూడా ప్రచారం చేయరని జనసేన వర్గాలంటున్నాయి. మరి చూడాలి పవన్ ప్రచారం ఏ పార్టీవైపు వుంటుందో?!