Begin typing your search above and press return to search.

పాల‌కొల్లుతో పెట్టుకుంటున్నావా ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   14 Aug 2018 7:31 AM GMT
పాల‌కొల్లుతో పెట్టుకుంటున్నావా ప‌వ‌న్‌?
X
ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అర్థం కాన‌ట్లుగా ఉంటుంది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు. ఎప్పుడు ఎలాంటి ప్ర‌క‌ట‌న అయినా ఆయ‌న నుంచి వ‌చ్చే వీలుంటుంది. సంప్ర‌దాయ రాజ‌కీయ అధినేత‌ల తీరుకు పూర్తి భిన్నంగా ఉండే ఆయ‌న తీరు త‌ర‌చూ ప‌లువురు త‌ప్పు ప‌డుతూ ఉంటారు.

అయిన‌ప్ప‌టికీ త‌న దారి త‌న‌దే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న‌.. ఇప్పుడు పోరాట యాత్ర పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాను వెల్ల‌డించే నిర్ణ‌యాల మీద ఏ మాత్రం నిల‌బ‌డ‌ని త‌త్త్వం ప‌వ‌న్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించే ప్ర‌ధాన లోపంగా చెప్పాలి. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలోని అన్ని స్థానాల నుంచి త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఏపీలోని 175 స్థానాల నుంచి బ‌రిలోకి దిగాల‌న్న ప్ర‌క‌ట‌న‌ను చేసిన ప‌వ‌న్‌.. గ‌తంలో తాను అనంత‌పురం అర్బ‌న్ నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాతి కాలంలో ఆయ‌న తాత్కాలిక నివాసం.. ఓట‌రు కార్డును ఏలూరులో తీసుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏలూరు నుంచి బ‌రిలోకి దిగాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ ను హిందూపురం బ‌రి నుంచి దిగితే బాగుంటుంద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వ‌చ్చింది. అయితే..ఈ వాద‌న‌పై ప‌వ‌న్ ఎప్పుడూ స్పందించింది లేదు.

ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ తాజాగా ఏలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓట‌రు కార్డు తీసుకోవ‌టం కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. అనంత‌పురం బ‌రిలో దిగుతాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఏలూరులో ఓట‌రుకార్డు ఎందుకు తీసుకున్న‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం తాను ప‌ర్య‌టిస్తున్న గోదావ‌రి జిల్లాల నుంచి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌న్న అభ్య‌ర్థులు ప‌లువురి నుంచి వ‌స్తున్నాయి.

తాజాగా వ‌స్తున్న కొన్ని ఊహాగానాలు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఆశ్చ‌ర్యాన్ని రేకెత్తించేలా ఉన్నాయి. గీతా గోవిందం నిర్మాత.. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ కు అత్యంత స‌న్నిహితుడైన బ‌న్నీ వాసు జ‌న‌సేన టికెట్ ను ఆశిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. పాల‌కొల్లు నుంచి ప‌వ‌న్ ను బ‌రిలో దిగాల‌ని కోరుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

కాపుల అధిక్య‌త ఉన్న పాల‌కొల్లు నుంచి పోటీ చేస్తే.. ఆరంభం అదిరిపోతుంద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది. అయితే.. 2009 ఎన్నిక‌ల్లో పాల‌కొల్లు త‌న అన్న చిరంజీవికి భారీ షాకిచ్చిన విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తు పెట్టుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు.

స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుంచి పాల‌కొల్లు నుంచి బ‌రిలో దిగిన నాటి ప్ర‌జారాజ్యం అధినేత చిరంజీవి సంచ‌ల‌న ప‌రాజ‌యానికి పాల‌కొల్లు వేదికైంది. ఈ చారిత్ర‌క స‌త్యాన్ని కాస్త ప‌రిశీలించాల‌న్న మాటతో పాటు.. ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌న్న విష‌యంపై అన‌వ‌స‌ర‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌కుండా పుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్య‌త ప‌వ‌న్ మీద ఉంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.